Share News

18 నెలల్లో 50-60 కొత్త విమానాలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:17 AM

ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ చేతికి రానున్న కాలంలో భారీ సంఖ్యలో విమానాలు అందనున్నాయి. వచ్చే 18 నెలల్లో 50 నుంచి 60 కొత్త విమానాలను అందుకునే అవకాశం ఉందని ఎయిర్‌ ఇండియా చీఫ్‌...

18 నెలల్లో 50-60 కొత్త విమానాలు

  • అందుకోనున్న ఎయిర్‌ ఇండియా గ్రూప్‌

  • ప్రస్తుతం ఏఐ, ఏఐ ఎక్స్‌ప్రెస్‌ వద్ద 290కి పైగా విమానాలు

అబుదాబి: ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ చేతికి రానున్న కాలంలో భారీ సంఖ్యలో విమానాలు అందనున్నాయి. వచ్చే 18 నెలల్లో 50 నుంచి 60 కొత్త విమానాలను అందుకునే అవకాశం ఉందని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ చైర్మన్‌ నిపుణ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. విమానయాన రంగం ఊహించని అనేక క్లిష్ట పరిస్థితుల ప్రభావానికి గురైనప్పటికీ సంస్థ పరివర్తన కార్యక్రమం మాత్రం సజావుగా సాగుతోందన్నారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్‌ ఇండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ భారీ పరివర్తన ప్రణాళికను అమలు చేస్తోంది. గత కొన్నేళ్ల కాలంలో తాము ఎన్నో విషయాలను నేర్చుకున్నామని, ఇదొక సంక్లిష్టమైన, సవాలుతో కూడుకున్న ప్రాజెక్టు అని అగర్వాల్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో సప్లయ్‌ చెయిన్‌ సమస్యలతో పాటు గగనతల సమస్యలు, ఇంధన ధరల్లో అస్థిరత, భౌగోళిక రాజకీయ సమస్యలు వంటివి ఎదురయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వద్ద 290కి పైగా విమానాలున్నాయని అగర్వాల్‌ చెప్పారు.

10 శాతం విమానాలే డెలివరీ: కాగా సంస్థ ఐదేళ్ల పరివర్తన ప్రణాళికను చేపట్టగా.. విమానాల ఆధునికీకరణ, ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌) కార్యకలాపాలలో పెట్టుబడులతో సహా అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని నిపుణ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ దాదాపు 600 విమానాలకు ఆర్డర్లు ఇవ్వగా.. అందులో 10 శాతం కన్నా తక్కువ విమానాలే ఇప్పటి వరకు డెలివరీ అయ్యాయి. మిగతా విమానాలు వచ్చే దశాబ్దం మధ్య కాలం వరకు డెలివరీ కానున్నాయి. వచ్చే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో ఏడాదికి 50 నుంచి 60 విమానాలను తాము సమకూర్చుకోనున్నామని అగర్వాల్‌ తెలిపారు. ఈ ఏడాది చివరి నుంచి విమానాల డెలివరీల్లో వేగం పుంజుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏటా దాదాపు 10-15 వైడ్‌ బాడీ, 45-50 న్యారో బాడీ విమానాలు వస్తాయన్నారు. వచ్చే 18 నెలల్లో 50-60 విమానాలు గ్రూప్‌నకు అందుతాయని చెప్పారు. వచ్చే మార్చి నాటికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ తన అన్ని విమానాలను ఒకే శ్రేణిలోకి మార్చే రెట్రోఫిటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందన్నారు.


రెండు నెలల్లో యుద్ధానికి ముందున్న స్థాయికి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇంధన ధరల్లో పెరుగుదలతో పాటు ఇతర కారణాల మూలంగా ఇటీవలి నెలల్లో ఎయిర్‌ ఇండియా కొన్ని సర్వీసులను తగ్గించింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతుండటంతో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి తమ నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో నెట్‌వర్క్‌లో కొంత మేర తగ్గింపు చేపట్టినప్పటికీ ద్వితీయార్ధం నుంచి వాటిని పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే 90 శాతం సేవలను పునరుద్ధరించామని, యూరప్‌, అమెరికా మార్గాల్లో బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయన్నారు. మరో రెండు నెలల్లో యుద్ధానికి ముందున్న స్థాయికి చేరుకుంటామన్న విశ్వాసాన్ని అగర్వాల్‌ వ్యక్తం చేశారు.

  • జెనరాలీ సెంట్రల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. సునేరా పెన్షన్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. పదవీ విరమణ అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. రిటైర్మెంట్‌ కార్ప్‌సను ఏర్పరచుకునే విధంగా రూపొందించిన పార్టిసిపేటింగ్‌, ఆన్‌ లింక్డ్‌, పెన్షన్‌, పొదుపు ఆధారిత జీవిత బీమా ప్లాన్‌ ఇది.

  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. జూన్‌ త్రైమాసికంలో రూ.386 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 27.8ు వృద్ధి చెందింది. ఈ కాలంలో కంపెనీ టర్మ్‌ ప్లాన్‌ వ్యాపారం 60.4ు వృద్ధి చెందింది. కాగా కంపెనీ పేరును ఐసీఐసీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌గా మార్చేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించింది.

  • రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన ట్రెండ్స్‌.. ఏపీలో తన కార్యకలాపాలు విస్తరించింది. ఇందులో భాగంగా ఒంగోలు, గుంటూరుల్లో కొత్త షోరూమ్స్‌ను ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా కంపెనీ ఈ స్టోర్లను ఏర్పాటు చేసింది.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 04:17 AM