Share News

ఎయిరిండియాకు క్యాంప్‌బెల్‌ గుడ్‌బై

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:44 AM

టాటా గ్రూప్‌ నిర్వహణలోని ఎయురిండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా చేశారు. క్యాంప్‌బెల్‌ ఎందుకు రాజీనామా చేశారనే విషయం...

ఎయిరిండియాకు క్యాంప్‌బెల్‌ గుడ్‌బై

కొత్త సీఈఓ అన్వేషణలో టాటా గ్రూప్‌

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ నిర్వహణలోని ఎయురిండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా చేశారు. క్యాంప్‌బెల్‌ ఎందుకు రాజీనామా చేశారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. 2022 సెప్టెంబరులో ఎయిరిండియా సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన విల్సన్‌కు విమానయాన రంగంలో విశేష అనుభవం ఉంది. న్యూజిలాండ్‌ దేశస్తుడైన విల్సన్‌ సింగపూర్‌ ఎయిర్‌లైన్‌ విస్తరణలోనూ కీలక పాత్ర పోషించారు. తదుపరి సీఈఓ ఎంపిక కోసం ఎయిర్‌ ఇండియా బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నూతన సారథి ఎంపిక పూర్తయ్యే వరకు క్యాంప్‌బెల్‌ విల్సనే సీఈఓ, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఎయిరిండియా అధికారవర్గాలు చెప్పాయి. ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్‌ ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వాత, దాన్ని గాడిలో పెట్టడంలో విల్సన్‌ కీలక పాత్ర పోషించారని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఒక ప్రకటనలో ప్రశంసించారు. ఆయన నేతృత్వంలోనే పాత విమానాలను ఆధునీకరించడంతో పాటు, 100 కొత్త విమానాలు సమకూర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

టైమొచ్చింది తప్పుకుంటున్నా

కంపెనీ తదుపరి అభివృద్ధి దశను మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చింది కాబట్టే, రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు క్యాంప్‌బెల్‌ విల్సన్‌ ఉద్యోగులతో చెప్పారు. నాలుగు విమానయాన సంస్థల విలీనం, ఎయిరిండియాను ప్రభు త్వ విధానాల నుంచి ప్రైవేటు విధానాలకు మార్చడం, నిర్వహణా యంత్రాంగాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించడం, కంపెనీ విస్తరణ కోసం 600 కొత్త విమానాల కోసం ఆర్డర్‌ పెట్టడం తన హయాంలో చోటు చేసుకున్న ప్రధాన మార్పులన్నారు. రెండు యుద్ధాలు, సరఫరా అవాంతరాలు, ఇంధన ధరల సెగ, కొన్ని దేశాల గగనతలం మూసివేత వంటి సమస్యలున్నా ఈ కార్యక్రమాలను తాను విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 05:44 AM