పన్ను పోటు లేని 10 ఆదాయాలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:48 AM
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. పన్ను చెల్లింపుదారులందరూ వచ్చే నెలాఖరులోగా ఈ పని పూర్తి చేయాలి. ఇలా రిటర్నులు సమర్పించే వారందరూ పన్ను పోటు ఏ మాత్రం లేని...
రిటర్నుల్లో వెల్లడించడం మర్చిపోవద్దు
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. పన్ను చెల్లింపుదారులందరూ వచ్చే నెలాఖరులోగా ఈ పని పూర్తి చేయాలి. ఇలా రిటర్నులు సమర్పించే వారందరూ పన్ను పోటు ఏ మాత్రం లేని కొన్ని ఆదాయాలు ఉన్నాయనే విషయం తెలుసుకుంటే మంచిది.
ఐటీ రిటర్నులు ఫైల్ చేసే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ డిడక్షన్లు, మినహాయింపుల కోసం చూస్తారు. లక్షలకు లక్షలు సంసాదించినా.. కొన్ని ఆదాయాలపై పైసా కూడా పన్ను పోటు ఉండదు. పన్ను పోటు లేకపోయినా ఈ ఆదాయాలను తప్పనిసరిగా ఐటీ రిటర్నుల్లో వెల్లడించాలి. లేకపోతే ట్యాక్స్ ప్లానింగ్ మిస్ అవుతున్నట్టే లెక్క. లేదా ఐటీ రిటర్నుల్లో తప్పులు దొర్లితే తర్వాత తిప్పలు తప్పవు. మన దేశంలో ప్రస్తుతం 10 ఆదాయాలు ఆదాయ పన్ను పరిధిలోకి రావు. అవేమిటంటే?
వ్యవసాయ ఆదాయం
ఆరుగాలం కష్టపడే రైతులకు వ్యవ‘సాయం’ అంతంత మాత్రమే. పన్ను పోటు తగ్గించుకోవాలనుకునే ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు మాత్రం వ్యవసాయ ఆదాయం బాగానే సాయం చేస్తుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 10(1) ప్రకారం మన దేశంలోని సాగు భూమి ద్వారా సంపాదించిన ఆదాయానికి పూర్తి పన్ను మినయింపు లభిస్తుంది. ఈ నిర్వచనం ప్రకారం సాగు చేసిన పంటల అమ్మకం లేదా వ్యవసాయ భూమిని లీజు లేదా కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాలకు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. వ్యయసాయంగా మారిన వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేసేందుకు ఐటీ చట్టంలో ఈ మినహాయింపు ఇచ్చారు. ఈ ఆదాయం రూ.5,000 కంటే ఎక్కువ ఉండి.. పన్ను చెల్లింపుదారుడికి ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించిన వ్యవసాయేతర ఆదాయం ఉంటే.. అప్పుడు అతడి ఆదాయ పన్ను శ్లాబు నిర్ణయించేందుకు వ్యవసాయ ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
హెచ్‌యూఎ్‌ఫ నుంచి అందుకునే ఆదాయం
మన ఐటీ చట్టం అవిభాజ్య హిందూ కుటుంబాల (హెచ్‌యూఎ్‌ఫ)ను ప్రత్యేక ట్యాక్సబుల్ తరగతిగా చూస్తోంది. కాబట్టి కుటుంబ సభ్యులకు హెచ్‌యూఎ్‌ఫ నుంచి అందుకునే మొత్తానికి కూడా పన్ను పోటు ఉండదు. ఐటీ చట్టంలోని సెక్షన్ 10(2) ఇందుకు స్పష్టమైన వీలు కల్పిస్తోంది.
లాభాల్లో వాటా
భాగస్వామ్య సంస్థలు లేదా పరిమిత భాగస్వామ్య సంస్థ (ఎల్‌ఎల్‌పీ)ల నుంచి లభించే లాభాలకూ పన్ను లేదు. కాకపోతే ఈ లాభం భాగస్వామి వాటాకు అనుగుణంగా ఉండాలి. ఈ సంస్థల్లో సభ్యులు పెట్టే పెట్టుబడులపై లభించే వడ్డీ, వారికి లభించే రెమ్యునరేషన్ ఆదాయాలపై మాత్రం పన్ను పోటు తప్పదు.
స్కాలర్‌షిప్‌లు
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థల నుంచి విద్యార్థులకు లభించే ఉపకార వేతనాల (స్కాలర్‌షిప్స్) పైనా ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు. చదువు ఆర్థిక గుదిబండ కాకూడదనే లక్ష్యంతో ఈ మినహాయింపు కల్పించారు.
లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్
ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత అందుకునే లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ కింద అందుకునే మొత్తానికి పూర్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అదే ప్రైవేటు ఉద్యోగులైతే రూ.25 లక్షల వరకు మాత్రమే పన్ను పోటు ఉండదు. ప్రైవేటు ఉద్యోగుల గ్రాట్యుటీని పన్ను కోసం పరిగణనలోకి తీసుకునేటప్పుడు 10 నెలల సరాసరి జీతం లేదా పూర్తి చేసిన సర్వీసులో ప్రతి సంవత్సరానికి 30 రోజులను పరిగణనలోకి తీసుకుంటారు. సర్వీసులో ఉండగా లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ చేసుకుంటే ఆ ఆదాయం పూర్తిగా ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది.
జీవిత బీమా మొత్తాలు
పాలసీ గడువు తీరిన తర్వాత (మెచ్యూరిటీ) జీవిత బీమా పాలసీలపై అందే మొత్తాలపైనా ఎలాంటి పన్ను పోటు ఉండదు. కాకపోతే సాధారణ పౌరులైతే చెల్లించే వార్షిక ప్రీమియం, పాలసీ కింద హామీ ఇచ్చిన మొత్తంలో 10 శాతానికి మించి ఉండకూడదు. దివ్యాంగులు, ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికైతే 15 శాతం వరకు అనుమతిస్తారు. అదే యులిప్స్ అయితే రూ.2.5 లక్షల వరకు, సాధారణ పాలసీలైతే రూ.5 లక్షల వరకు అనుమతిస్తారు. డెత్ బెనిఫిట్స్‌కు మాత్రం ఎలాంటి ప్రీమియం పరిమితులు ఉండవు.
ఈ మినహాయింపులన్నీ కొన్ని షరతులకు లోబడి ఉంటాయి. ఐటీ రిటర్నుల్లో క్లెయిమ్ చేసే ముందే వాటికి సంబంధించిన నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
వడ్డీ ఆదాయం
సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎ్‌సవై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) వంటి ప్రభుత్వ పొదుపు పథకాల పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయాలపైనా ఎలాంటి పన్ను పోటు ఉండదు. కాకపోతే ఈ పెట్టుబడులను నిర్ణీత కాలం పాటు ఆ పెట్టుబడుల్లో కొనసాగించి.. కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే వెనక్కి తీసుకోవాలి. మెచ్యూరిటీ తర్వాత చేతికి వచ్చే ఈ పొదుపు పెట్టుబడి మొత్తాలపైనా ఎలాంటి పన్ను పోటు ఉండదు.
గ్రాట్యుటీ
రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ మొత్తానికి పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ప్రైవేటు ఉద్యోగులకు మాత్రం సెక్షన్ 10(10) ప్రకారం రూ.20 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకూ రూ.20 లక్షల వరకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది.
పీఎఫ్ ఉపసంహరణ
ఈపీఎ్‌ఫతో సహా ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి జరిగే విత్‌డ్రాయల్స్‌పైనా ఎలాంటి పన్ను పోటు ఉండదు. కాకపోతే ఈ విత్‌డ్రాయల్స్ కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. విత్‌డ్రా చేసుకునే ఉద్యోగి ఆ పీఎఫ్ పథకంలో కనీసం ఐదు సంవత్సరాలు కొనసాగి ఉండాలి. తీవ్ర అనారోగ్యం, పనిచేస్తున్న కంపెనీ మూతపడినప్పుడు లేదా చట్టంలో పేర్కొన్న ఇతర పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయినప్పుడు కూడా పీఎఫ్ చందాదారులు మధ్యలోనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ విత్‌డ్రాయల్ ద్వారా వచ్చే పీఎఫ్ మొత్తాలకీ ఎటువంటి పన్ను పోటు ఉండదు.
బహుమతులు
తల్లిదండ్రులు, భార్య, పిల్లలు.. ఐటీ చట్టంలో పేర్కొన్న ఇతర దగ్గరి బంధువుల నుంచి అందుకునే బహుమతులకు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. పెళ్లిళ్ల సమయంలో బంధువేతరుల నుంచి అందే బహుమతులూ పన్ను పరిధిలోకి రావు. అయితే ఇతర సమయాల్లో బంధువేతరుల నుంచి అందే కొన్ని బహుమతులపై మాత్రం పన్ను పోటు తప్పదు. నగదు లేదా స్థిర, చరాస్తుల రూపంలో వీరి నుంచి లభించే బహుమతుల విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే.. బహుమతి అందుకున్న వ్యక్తే కొన్ని షరతులకు లోబడి పన్ను చెల్లించాలి. అదే వ్యక్తుల మరణానంతరం వారి చట్టబద్ద వారసులకు సంక్రమించే ఆస్తులపైనా ఎలాంటి పన్ను పోటు ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్
ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్