Share News

ప్రొ.నాగేశ్వర్‌పై ‘జన’ ఆగ్రహం

ABN , Publish Date - May 22 , 2026 | 04:28 AM

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల భేటీపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలు జన సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి.

ప్రొ.నాగేశ్వర్‌పై ‘జన’ ఆగ్రహం

  • పలు పోలీ్‌సస్టేషన్లలో జనసేన ఫిర్యాదు

  • కాకినాడలో రెండు కేసులు నమోదు

  • మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు

  • డామేజ్‌ సూట్‌ వేసే యోచనలో అధిష్ఠానం

  • వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ప్రొ.నాగేశ్వర్‌

అమరావతి, సర్పవరం జంక్షన్‌(కాకినాడ), మే 21 (ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల భేటీపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలు జన సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకొంటామంటూ జనసేన నాయకత్వం గురువారం ప్రకటించిన కొద్ది గంటల్లోనే, రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో నాగేశ్వర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటి ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద నాగేశ్వర్‌పై కేసులు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో అమిత్‌షాను పవన్‌ కల్యాణ్‌ కలిశారు. ‘చంద్రబాబుతో మనది వ్యూహాత్మక తాత్కాలిక స్నేహం.. జగన్‌ మనకు రాజకీయంగా దీర్ఘకాలిక మిత్రుడు’ అని అప్పట్లో పవన్‌తో అమిత్‌షా అన్నట్టు నాగేశ్వర్‌ ఓ న్యూస్‌ చానల్‌ చర్చలో వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా పరిగణించింది. కూటమి పార్టీలను విచ్ఛిన్నం చేసే ధోరణిలో ఉన్న ఆ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోరాదని, నాగేశ్వర్‌పై డామేజ్‌ సూట్‌ వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ‘రాజకీయాల పవిత్రతను భ్రష్ఠు పట్టించడాన్ని క్షుద్రశక్తులు కొన్ని వృత్తిగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రచార మాధ్యమాల్లో ఊసర వెల్లులుగా మారుతున్నాయి’ అంటూ నాగేశ్వర్‌ను ఉద్దేశించి ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో ఆక్షేపించింది. జరిగింది జరగనట్టు, జరగనిదానిని జరిగినట్టు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడింది.. రాజకీయ వ్యవస్థకు, సమాజానికి చేటుగా మారుతున్న ఇటువంటి ప్రచార కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించింది. జనసేన పార్టీపైనా, అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, నాయకులపై ఎటువంటి అవాస్తవాలు, నిందారోపణలు చేసినా తక్షణమే పోలీస్‌ కేసులు, న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.


కాగా, పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగిస్తున్న నాగేశ్వర్‌పై చర్య తీసుకోవాలంటూ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జనసేన కార్యకర్త నల్లం శ్రీరాములు కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాగేశ్వర్‌తోపాటు జగన్‌ చానల్‌పై, ఆ చానల్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో మరో జనసైనికుడు శిరంగు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా పలు సెక్షన్ల కింద నాగేశ్వర్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నాగేశ్వర్‌తోపాటు గ్రేట్‌ ఆంధ్ర వెబ్‌సైట్‌పై, ఆ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు వెంకట రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో జనసేన కార్యకర్త మత్తిరాము ఫిర్యాదు చేశారు.


ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : ప్రొ.నాగేశ్వర్‌

హైదరాబాద్‌ సిటీ, మే21(ఆంధ్రజ్యోతి) : పవన్‌ కల్యాణ్‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాల భేటీ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం ఓ ప్రకటన లో వెల్లడించారు. ‘‘బీజేపీ, వైసీపీ మధ్య అప్రకటిత స్నేహం విషయంలో నేను చేసిన విశ్లేషణపై రాజకీయ చర్చ జరగకపోగా, మొత్తంగానే ఆ అంశం దారి తప్పింది. నా వ్యాఖ్యల్లోని ప్రధాన అంశం పక్కకుపోయి, అనవసరమైన చర్చ ముందుకు రావడం శోచనీయం. అందువల్ల నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను.’’ అని నాగేశ్వర్‌ తెలిపారు.

Updated Date - May 22 , 2026 | 04:30 AM