వివేకా హత్య కేసు.. ఉదయ్ కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి: సునీత
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:13 PM
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్‌కు వివేకా కుమార్తె సునీత లేఖ రాశారు. బెయిల్‌పై ఉన్న ఉదయ్ కుమార్‌ను ఇప్పుడు మళ్లీ ఎలా విధుల్లోకి తీసుకుంటారని ప్రశ్నించారు..
అమరావతి, ఫిబ్రవరి 19: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ (UCIL) జీఎం సుమన్ సర్కార్‌కు వివేకా కుమార్తె సునీత లేఖ రాశారు. బెయిల్‌పై ఉన్న ఉదయ్ కుమార్‌ను ఇప్పుడు మళ్లీ ఎలా విధుల్లోకి తీసుకుంటారని ప్రశ్నించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ.. ఉదయ్ కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె పేర్కొన్నారు. శాఖాపరమైన దర్యాప్తును వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రవర్తన, సీబీఐ అధికారిపై ఆయన చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు.
ఉదయ్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేయడంలో 11 నెలలు జాప్యం చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. ఏప్రిల్ 2023 నుంచి చేసిన చెల్లింపులపై పూర్తి స్థాయి ఆడిట్ చేయాలన్నారు. ఉదయ్ కుమార్‌రెడ్డిపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలను 15 రోజుల్లో తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. హత్య కేసులో నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక యంత్రాంగం విఫలమవడంపై సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో జాప్యం, పాలనాపరమైన లోపాలపై తాను అవసరం అయితే విజిలెన్స్, న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని లేఖలో సునీత హెచ్చరించారు.
సీఎం చంద్రబాబును కలిసి వివరిస్తా..
వైఎస్ సునీత గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా తండ్రి హత్య కేసులో ఏ6 అయిన గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డి సుమారు 500 రోజులు జైల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తిపై యురేనియం కార్పొరేషన్ ఎందుకు చర్యలు చేపట్టలేదు. బెయిల్‌పై ఉన్న ఉదయ్ కుమార్‌ను ఇప్పుడు మళ్లీ ఎలా విధుల్లోకి తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 495 రోజులు జైల్లో ఉంటే యూసీఐఎల్ సంస్థలో ఎలాంటి సెలవు పెట్టాడు. ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఈ విషయంపై సీఎం చంద్రబాబును కలిసి వివరిస్తాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు.. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడి అరెస్ట్
హెరిటేజ్‌పై వ్యతిరేక కథనాలను తొలగించాలి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..