నేను పిలుపు ఇస్తే ఎన్నికలే జరగవు
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:12 AM
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం పులివెందులలో ఓటు వేయకుండానే వైసీపీ అధినేత వెనుదిరిగారు.
పులివెందులలో జగన్ ధర్నా డ్రామా
పులివెందుల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం పులివెందులలో ఓటు వేయకుండానే వైసీపీ అధినేత వెనుదిరిగారు. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లల్లోకి పోనివ్వడం లేదంటూ, వారిని వెంటబెట్టుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద నేల మీద బైఠాయించారు. పులివెందుల స్థానానికి రీపోలింగ్ జరిపించాలంటూ ధర్నా నిర్వహించారు. జగన్ ఉన్న ప్రాంతానికి స్వయంగా వెళ్లి ఆయన నుంచి ఎన్నికల అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో చిన్నయ్య వినతిపత్రం తీసుకున్నారు. ఆ సందర్భంగాను, పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అక్కసునంతా వెళ్లగక్కారు. ‘‘నేను ఈరోజు పిలుపునిస్తే ఎలక్షన్లే జరగవు, అన్నీ ఆగిపోతాయి. మా వాళ్లు కూడా తిరగబడగలరు. కానీ నేను అలా చేయను. ప్రజాస్వామ్యాన్ని నేనే అపహాస్యం చేస్తే, ఏం మెసేజ్ ఇవ్వగలను’’ అని అన్నారు. ‘‘ప్రజలను కాపాడాల్సిన వాళ్లే ప్రజలను భక్షించే కార్యక్రమాలు చేస్తే, ప్రజలకు అన్యాయం తలపెడితే, తిరిగి నక్సలిజం పుడుతుంది... కాక్రోచ్‌లు పుడతాయ్’’ అంటూ ప్రగల్భాలు పలికారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలకు సహకరిస్తూ వైసీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారన్నారు. ఇండియా టుడే, ఎన్‌టీవీ చానళ్ల విలేకరులపై దాడులు చేసి కెమెరాలు, సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారన్నారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి ఇలాగే సహకరిస్తే భవిష్యత్తులో ఏపీలో ఎన్నికలు జరగవన్నారు. పులివెందులలో తన హెలికాప్టర్‌ను ఆపాలని ప్రయత్నించారని, ల్యాండ్ అయ్యే తరుణంలో ఇబ్బందులు పెట్టాలని చూశారని జగన్ తన ఫిర్యాదులో తెలిపారు.
రాష్ట్రంలో జరిగినవి ఎన్నికలే కాదు: సజ్జల
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఆదివారం జరిగినవి ఎన్నికలే కావు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు ఓటమి భయంతో రిగ్గింగ్ చేయించారు’ అని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘ఈసీ,పోలీసు సహకారంతో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను కూర్చోనివ్వలేదు. టీడీపీ దౌర్జన్యాలను జాతీయ స్థాయికి తీసుకెళతాం. పులివెందుల సహా రీపోలింగ్ జరగాల్సిన ప్రాంతాల్ని వివరిస్తూ కోర్టుకెళ్తాం. ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఈసీ, పోలీసులు... అంతా సవ్యంగా ఉందంటూ పట్టించుకోలేదు. చంద్రబాబు కుట్రలు చేసి వైసీపీ నేతలు, క్యాడర్‌ను నిస్సహాయ స్థితిలోకి నెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.