Share News

అవి షర్మిల ఆస్తులే!

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:48 AM

‘వైఎస్‌’ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతులవారీగా విమర్శల దాడి చేస్తుండటంతో... మరోమారు తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు....

అవి షర్మిల ఆస్తులే!

  • ఎంవోయూలో ఉన్నవి ఆమెకు చెందాల్సిందే.. కుటుంబ ఆస్తుల పంపకాలు జరగలేదు

  • నలుగురు మనుమలకు సమానంగా చెందాలి

  • ఇదే వైఎస్‌ ఉద్దేశం, ఆదేశం

  • మేనల్లుడు, మేనకోడలికి జగన్‌ అన్యాయం

  • నిజం నా దేవుడికీ, నా కుమారుడికీ తెలుసు

  • బాండ్‌ పేపర్‌పై విజయలక్ష్మి స్పష్టీకరణ

  • షర్మిలపై వైసీపీ నేతల దాడికి చెక్‌

  • అసత్య ప్రచారం ఆపాలని హితవు

  • తల్లీ చెల్లి మధ్య జగన్‌ ఉక్కిరి బిక్కిరి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘వైఎస్‌’ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతులవారీగా విమర్శల దాడి చేస్తుండటంతో... మరోమారు తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ‘క్లారిఫికేషన్‌’ రూపంలో కుమారుడు వైఎస్‌ జగన్‌కు షాక్‌ ఇచ్చారు. ‘ఆస్తుల పంపకం జరగలేదు. వైఎస్‌ మరణించేనాటికి ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడివే’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ‘మీకేం తెలియదు. మీరు మాట్లాడొద్దు’ అన్నట్లుగా వైసీపీ నేతలకూ పరోక్ష హెచ్చరికలు పంపారు. 20 రూపాయల బాండ్‌ పేపర్‌పై, నోటరీ చేయించి మరీ ‘స్పష్టత’ ఇచ్చారు. ఉమ్మడి ఆస్తుల పంపకం జరగలేదని... షర్మిలకు జగన్‌ అన్యాయం చేస్తున్నారని విజయలక్ష్మి తేల్చిచెప్పారు.

షర్మిలపై వ్యూహాత్మక దాడి...

తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతా రెడ్డికి షర్మిల అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఇలాంటి అన్న ఉంటే ప్రత్యేకంగా మరో శత్రువు అక్కర్లేదు. అన్న అనే పదానికే కళంకం’ అంటూ జగన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గురువారం ఈ అంశంపై విశాఖలో షర్మిల సుదీర్ఘంగా మాట్లాడారు. సూటి ప్రశ్నలు సంధించారు. ‘మనస్సాక్షితో సమాధానం చెప్పాలి’ అంటూ సోదరుడికి సవాలు విసిరారు. దీంతో జగన్‌ మరోసారి ఆత్మరక్షణలో పడ్డారు. ఇక వ్యూహాత్మకంగా వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వైఎస్‌ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరులోకి చంద్రబాబును లాగారు. ‘చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ’ అంటూ షర్మిలను నిందించడమే కాకుండా... ‘30 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న మీకు ఇప్పుడు వాటాలు ఇవ్వడమేంటి!? ఇవ్వాల్సిన అవసరం లేకున్నా... జగన్‌ తన స్వార్జితం నుంచి కోట్లు పంచి ఇచ్చారు’ అంటూ షర్మిలపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండు రోజులుగా షర్మిలను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ముఖ్యనేతలూ సునీత, షర్మిలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఇక... వైసీపీ సోషల్‌ మీడియా సంగతి సరేసరి!


విజయలక్ష్మి లేఖతో కౌంటర్‌...

షర్మిలకు జగన్‌ ఇప్పటికే అవసరానికి మించి ‘వాటాలు’ ఇచ్చేశారంటూ వైసీపీ నేతలు వరుసగా చేస్తున్న దాడికి నేరుగా విజయలక్ష్మి కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం దీనిపై ‘క్లారిఫికేషన్‌’ పేరుతో ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. చెల్లెలు, మేనల్లుడు, మేనకోడలికి జగన్‌ అన్యాయం చేశారని అందులో పేర్కొన్నారు. అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చేస్తారు? షర్మిలను దూషించినట్లే విజయలక్ష్మిపైనా విరుచుకుపడతారా?

ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులలాంటివే జగన్‌కు కూడా వైఎస్సార్‌ ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్‌ ప్రచారం చేయడానికి మీరు ఎవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్‌ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించవద్దని వేడుకుంటున్నా! దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే!

ఇట్లు..

వైఎస్‌ విజయ రాజశేఖర్‌ రెడ్డి.

నా దేవుని సాక్షిగా...

2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే (కంబైన్డ్‌ ఫ్యామిలీ అసెట్స్‌). ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్సార్‌ ఉద్దేశం. అది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిది.

ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే. అందుకే జగన్‌ ఎంవోయూ రాశాడు. (నిజానికి తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్‌తో సహా ఎంవోయూలోని ఎలహంక ల్యాండ్‌ కూడా షర్మిలదే. ఇచ్చాను... అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్‌ మాత్రమే.) ఆస్తుల విషయంలో జగన్‌ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను.

Updated Date - Mar 21 , 2026 | 06:33 AM