ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా యలమంజుల బాలాజీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:30 AM
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రభుత్వ న్యాయవాది యలమంజుల బాలాజీ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా న్యాయవాది బండారు వెంకట రమణమూర్తి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా సీనియర్ న్యాయవాది ...
తెలుగు రాష్ట్రాల్లో చైర్మన్‌గా ఎన్నికైన తొలి బీసీ న్యాయవాది
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రభుత్వ న్యాయవాది యలమంజుల బాలాజీ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా న్యాయవాది బండారు వెంకట రమణమూర్తి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు. ఈ ఎన్నికను నోటిఫై చేస్తూ ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో 25మంది బార్ కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చైర్మన్ పదవికి పోటీపడ్డ యలమంజుల బాలాజీకి 16, బీవీ కృష్ణారెడ్డికి 10ఓట్లు వచ్చాయి. వైస్ చైర్మన్ పోస్టుకు బండారు వెంకటరమణమూర్తి, రవి బెల్లాన పోటీ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడి పోస్టుకు సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం, ఆలూరు రామిరెడ్డి పోటీ పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 23 మంది సభ్యులు గెలుపొందగా, మరో ఇద్దరు మహిళ న్యాయవాదులను కోఆప్టెడ్ సభ్యులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ ఇటీవల నామినేట్ చేశారు. కాగా, చైర్మన్‌గా ఎన్నికయిన బాలాజీని పలువురు న్యాయవాదులు శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ తన గెలుపులో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సహకారం ఎంతో ఉందన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా మొదటిసారి ఎన్నికైన వ్యక్తి.. చైర్మన్‌గా కూడా ఎన్నిక కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని, ఓ బీసీ న్యాయవాది బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నిక కావడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు