Share News

ఆమెదే పెత్తనం!

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:55 PM

జిల్లా పరిషత్‌లో ఓవరాల్‌గా మహిళా ప్రాతి నిధ్యం ఈసారి పెరగనుంది. అటు జడ్పీటీసీల నుంచి ఇటు ఎంపీపీల వరకు 90 శాతం పైబడి అంతా కొత్తవారే కొలువు తీరనున్నారు.

ఆమెదే పెత్తనం!

జడ్పీలో మహిళల హవా

ఒకరిద్దరు తప్ప అంతా కొత్తవారే

ఉంగుటూరు నుంచే సీనియర్లు

జడ్పీటీసీలు 14.. ఎంపీపీలు 16 మంది

19న ఎంపీపీ పీఠాలకు పరోక్ష ఎన్నికలు

23న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌లో ఓవరాల్‌గా మహిళా ప్రాతి నిధ్యం ఈసారి పెరగనుంది. అటు జడ్పీటీసీల నుంచి ఇటు ఎంపీపీల వరకు 90 శాతం పైబడి అంతా కొత్తవారే కొలువు తీరనున్నారు. ఈనెల 19న ఎంపీపీల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడక్కడా తప్ప.. 20 వరకు ఎంపీపీల ఎంపికను దాదాపుగా కూటమి సర్దుబాట్లలో కొలిక్కి తీసుకువచ్చారు. ఓవరాల్‌గా 27 జడ్పీటీసీ స్థానాలకు 13 మహిళలకు రిజర్వ్‌ చేయగా అదనంగా మరో స్థానం నుంచి కూడా మహిళ విజయం సాధించడంతో ఈసారి 14 మంది మహిళా జడ్పీటీసీలు కొలువు తీరనున్నారు. ఎంపీపీల పరంగా రిజర్వేషన్లు 13 కేటాయిస్తే అదనంగా మూడు చోట్ల మహిళలు గెల్చుకోవడంతో 16 మంది కొలువుతీరనున్నారు. టీడీపీ నుంచి గెలిచిన జడ్పీటీసీల్లో ఉంగుటూరు నుంచి చింతల వాసు, ఉంగుటూరు నుంచి ఎం పీపీగా ఖరారైన అక్కిన నాగమణి మాత్రమే సీనియర్లు కావడం విశేషం. ఈసారి ఎంపీపీల విషయంలో ఎటువంటి టెన్షన్‌ లేకుండా ఏలూరు ఎంపీపీగా గుత్తా శ్రీదేవి (టీడీపీ), భీమడోలు నుంచి ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు మేనకోడలు గన్ని సత్యవాణి (టీడీపీ), ఉంగుటూరు ఎంపీపీ జనరల్‌ మహిళ నుంచి రెండోసారి అక్కిన నాగమణి (టీడీపీ), ద్వారకాతిరుమల ఎంపీపీగా యేపూరి పావని (టీడీపీ), లింగపాలెం ఎంపీపీగా సి.సుగుణకుమారి (టీడీపీ) కైకలూరు ఎంపీపీగా బూరుబోయిన పద్మాదేవి (జనసేన), కలిదిండి ఎంపీపీగా గొరిపర్తి వెంకట నర్సమ్మ (టీడీపీ), ముదినేపల్లి కోటప్రోలు నాగరత్నకుమారి (బీజేపీ), పోలవరం ఎంపీపీగా పాదం మంగాదేవి (టీడీపీ). జంగారెడ్డిగూడెం ఎంపీపీగా ఆకుల మమతారాణి (జనసేన), కుక్కునూరు ఆశా శ్రీలత(వైసీపీ), వేలేరుపాడు ఎంపీపీగా ఎస్టీ మహిళ బాడిశ వెంకమ్మ (వైసీపీ)లు పార్టీల ఒప్పందంలో దాదాపుగా లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు.

ఉత్కంఠ లో ఆ నాలుగు స్థానాలు

కొయ్యలగూడెం ఎంపీపీ రేసులో అటు టీడీపీ, ఇటు బీజేపీల మధ్య ఉత్కంఠ రేగుతోంది. పారేపల్లి రామారావు భార్య జయలక్ష్మి (టీడీపీ) సుభద్రాదేవి (బీజేపీ)లు పోటీ పడుతున్నారు. జీలుగుమిల్లి ఎంపీపీగా ఎస్టీ మహిళ విభాగంలో వైసీపీలో ఇద్దరు మహిళలు పోటీపడుతున్నారు. నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారఽథి నిర్ణయం కోసం ముసునూరు, చాట్రాయిల్లో ఉత్కంఠ రేగుతోంది. ముసునూరు ఎస్సీ మహిళకు రిజర్వు చేయగా టీడీపీ నుంచి ముగ్గురు మహిళలు పోటీ పడుతున్నారు. చాట్రాయి జనరల్‌ మహిళకు కేటాయించగా ఇక్కడ ఇద్దరు మహిళలు ఈ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈనెల 18వ తేదీ నాటికి ఈ స్థానాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 16 , 2026 | 11:55 PM