Share News

జడ్పీ విభజన షూరూ..

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:54 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ మూడు జడ్పీలుగా మారింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో కొంత భాగంతో ఏర్పాటు కానుంది. 2021లో జిల్లాల విభజన జరిగినా పాలకవర్గ పదవీకాలం ఉండడంతో జడ్పీల విభజన జరగలేదు.

జడ్పీ విభజన షూరూ..

మూడుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ రూపాంతరం

కొత్తగా ఏలూరు జడ్పీ ఏర్పాటు

భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి..

తూర్పు గోదావరి జడ్పీలోకి తొమ్మిది మండలాలు..

25 నుంచి కార్యకలాపాలు ప్రారంభం

కొనసాగుతున్న ఉద్యోగుల విభజన ప్రక్రియ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ మూడు జడ్పీలుగా మారింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో కొంత భాగంతో ఏర్పాటు కానుంది. 2021లో జిల్లాల విభజన జరిగినా పాలకవర్గ పదవీకాలం ఉండడంతో జడ్పీల విభజన జరగలేదు. ఈ నెల 24తో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుంది. 25వ తేదీ నుంచి ఏలూరు జిల్లా పరిషత్‌గా, భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌గా ఏర్పడతాయి. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజ వర్గాల్లోని తొమ్మిది మండలాలు తూర్పు గోదావరి జడ్పీలోకి వెళ్లనున్నాయి. ఏలూరు జడ్పీలో ఉమ్మడి కృష్ణాలోని ఎనిమిది విలీన మండలాలతో కలిపి 27, పశ్చిమ జడ్పీలోకి 20 మండలాలు వెళ్లనున్నాయి.

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర వ్యాప్తంగా 13 జడ్పీలు.. ఇకపై 28 జడ్పీలుగా ఏర్పడనున్నాయి. వీటికి సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు నియమించనున్నారు. జడ్పీ పాలకవర్గం పదవీ కాలం ముగిసిన వెంటనే కొత్త జడ్పీ పాలన ప్రారంభం అవు తుంది. ఉమ్మడి పశ్చిమ జడ్పీలో 119 పోస్టులు ఉండగా ఉద్యోగుల సంఖ్య 99. వీరిలో జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోతోపాటు పది మంది ఏవోలు, 25 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు యూడీ స్టెనోలు, 44 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక ఎల్‌డీ స్టెనో, 8 మంది టైపిస్టులు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ముగ్గురు డ్రైవర్లు, 22 మంది ఆఫీస్‌ సబార్డినేట్స్‌కి 99 మంది పని చేస్తున్నారు. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏలూరు జడ్పీ కార్యాలయం నుంచి 60 శాతం మంది ఉద్యోగు లు, పశ్చిమ, తూర్పు గోదావరిలకు వెళ్లనున్నారు. కృష్ణా జడ్పీ నుంచి ఏలూరు జడ్పీకి పది శాతం మంది ఉద్యోగులు రానున్నారు. జడ్పీల పరిధి తగ్గడంతో 50 శాతం మంది ఉద్యోగులు వారి ప్రాంతీయత ఆధారంగా మిగిలిన జడ్పీలకు వెళ్లే అవకాశాలున్నాయి. పశ్చిమ జడ్పీకి తాత్కాలిక ప్రాతిపదికన కొందరిని పంపించే అవకాశాలున్నాయి.

కార్యాలయాల ఎంపికలో అధికారులు

భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి శుక్రవారం డిప్యూటీ సీఈవో కె.భీమేశ్వర్‌ భవనాలను పరిశీలించారు. జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయిన తర్వాత శాశ్వత భవనాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

త్వరలో జడ్పీ ఎన్నికలు

త్వరలో జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్‌కు సంబంధించి ఏలూరు జిల్లాలో 27 మండలాలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రకటించగా, పోలింగ్‌ కేంద్రాల జాబితాల కసరత్తు దాదాపు పూర్తయింది. ఇక రిజర్వేషన్ల ప్రక్రియ జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి.

Updated Date - Sep 19 , 2026 | 12:55 AM