Share News

కొలువుదీరిన జడ్పీ

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:31 AM

ఏలూరు జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మంది రంలో జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఏలూరు జిల్లా ప్రజా పరిషత్‌ మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా పెదవేగి జడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన చింతమనేని సాయి నవ్యశ్రీ, వైస్‌ చైర్మన్‌గా ముదినేపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొర్రా చలమయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.

 కొలువుదీరిన జడ్పీ
జడ్పీ చైర్‌పర్సన్‌ నవ్యశ్రీని అభినందిస్తున్న ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, బడేటి చంటి, కామినేని శ్రీనివాస్‌

జడ్పీ చైర్‌పర్సన్‌గా సాయి నవ్యశ్రీ, వైస్‌ చైర్మన్‌గా చలమయ్య ఏకగ్రీవ ఎన్నిక

27 మంది జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం

హాజరైన ఎమ్మెల్యేలు బడేటి, కామినేని.. నవ్యశ్రీకి అభినందనలు

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

ఏలూరు జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మంది రంలో జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఏలూరు జిల్లా ప్రజా పరిషత్‌ మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా పెదవేగి జడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన చింతమనేని సాయి నవ్యశ్రీ, వైస్‌ చైర్మన్‌గా ముదినేపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొర్రా చలమయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.

జిల్లాలో ఏకపక్షంగా సాగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూటమి తరపున 24 మంది జడ్పీటీసీ సభ్యులు ఎన్నిక కాగా ప్రతిపక్ష వైసీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శుక్ర వారం జరిగిన జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అతిరథ మహారఽథులు హాజరుకాగా ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలుత జిల్లాలోని 27 మంది జడ్పీటీసీ సభ్యులతో ప్రిసైడింగ్‌ అధికారిణిగా కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఏకగ్రీవ ఎన్నిక

జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెట్రిసెల్వి జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ల ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వ హించారు. పెదవేగి జడ్పీటీసీ సభ్యురాలు చింత మనేని సాయి నవ్యశ్రీ (దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె)ని ద్వారకా తిరుమల జడ్పీటీసీ సభ్యురాలు కరుటూరి సత్య శ్రావణి ప్రతిపాదించగా, కామవరపుకోట జడ్పీ టీసీ సభ్యురాలు మందలపు జాహ్నవి బలపరి చారు. మరో ప్రతిపాదన లేకపోవడంతో సాయి నవ్యశ్రీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జిల్లా కలెక్టర్‌ ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. తర్వాత జడ్పీ వైస్‌ చైర్మన్‌గా ముదినేపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొర్రా చల మయ్యను జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ సభ్యు రాలు గొల్లమందల సంకీర్తన ప్రతిపాదించగా, టి.నరసాపురం జడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి సుజాత బలపరి చారు. మరో ప్రతిపాదన లేకపోవడంతో ఆయనను వైస్‌ చైర్మన్‌గా ఏక గ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్‌ ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.

సాయి నవ్యశ్రీకి అభినందనల వెల్లువ

ఏలూరు జిల్లా ప్రజాపరిషత్‌ మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతమనేని సాయి నవ్యశ్రీకి అభినందలు వెల్లువెత్తాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన కుమార్తె సాయి నవ్యశ్రీకి పూల బొకే అందజేసి అభినందించగా సాయి నవ్యశ్రీని ఆమె కుటుంబ సభ్యులు పూలమాలలతో సత్కరించారు. ఏలూరు ఎమ్మెల్యే, కైకలూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, కామినేని శ్రీనివాస్‌లు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి, జడ్పీ సీఈవో ఇన్‌చార్జి జి.వెంకటనాయుడు, డిప్యూటీ సీఈవో కె.భీమేశ్వర్‌, జడ్పీ కార్యాలయ సిబ్బంది జడ్పీ చైర్‌పర్సన్‌ సాయి నవ్యశ్రీ, వైస్‌ చైర్మన్‌ చలమయ్యలను అభినందించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఏలూరు తహసీల్దార్‌ , తదితరులు పాల్గొన్నారు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్‌కుమార్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకు ముందు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు మేయర్‌గా ఎన్నికైన రెడ్డి అప్పలనాయుడులు జడ్పీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ చింతమనేని సాయి నవ్యశ్రీని కలిసి అభినందించారు.

Updated Date - Nov 21 , 2026 | 12:31 AM