Share News

బూత్‌లు.. ఎక్కడ..ఎన్నెన్ని?

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:52 AM

జిల్లాల విభజన జరిగిన తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతు న్నాయి. రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల విభజనకు శ్రీకారం చుట్టటంతో ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు జిల్లా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.

 బూత్‌లు.. ఎక్కడ..ఎన్నెన్ని?

జడ్పీ, ఎంపీపీ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు షెడ్యూలు విడుదల

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

జిల్లాల విభజన జరిగిన తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతు న్నాయి. రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల విభజనకు శ్రీకారం చుట్టటంతో ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు జిల్లా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇందుకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాలక వర్గాలకు పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగుస్తోంది. ఆపై పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు, ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు సంబంధించి ఫొటో ఓటర్ల జాబితా ఈనెల 11న విడుదల కానుంది. జడ్పీ, మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 541 గ్రామాల వారీగా పోలింగ్‌ కేంద్రాల గుర్తించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూలు విడుదల చేసింది. దీనిప్రకారం గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల జాబితాలను రూపొందించాల్సి ఉంది.

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు షెడ్యూల్‌

జిల్లాలో మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఎన్ని కలకు సంబంధించి గ్రామాల్లో ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణతో పాటు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూలు విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తించిన పోలింగ్‌ కేంద్రాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబందించి పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తారు. ఏఏ గ్రామానికి ఎన్ని పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ఓటర్ల సంఖ్య ఆధారంగా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తదుపరి ఎన్నికల ప్రక్రియకు షెడ్యూలు విడుదల చేసే అవకాశాలున్నాయి.

వేడెక్కిన రాజకీయాలు

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలకు సంబం ధించి పోలింగ్‌ కేంద్రాల జాబితా రూపొందించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి షెడ్యూలు విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల పరిషత్‌ అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లుగా పోటీ చేయడానికి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలలో ఆశావహుల జాబితాలు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్‌లు విడుదల కాకపోయినా గ్రామాల్లో బలమైన అభ్యర్థుల ఎంపికకు అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు.

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు

14–9–2026 : పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా తయారీ

15–9–2026 : పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ

15–9–2026 నుంచి 16–9–2026 వరకు : పోలింగ్‌ కేం ద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు/క్లయిమ్‌లు స్వీకరణ,

16–9–2026 : రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

18–9–2026 : పోలింగ్‌ కేంద్రాల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆమోదించే ప్రక్రియ

19–9–2026 : పోలింగ్‌ కేంద్రాల తుదిజాబితా ప్రచురణ

21–9–2026 : జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల సంఖ్యతో కూడిన కాంప్లియన్స్‌ రిపోర్టును రాష్ట్రఎన్నికల సంఘానికి పంపాలి.

Updated Date - Sep 10 , 2026 | 12:52 AM