పరిషత్ పీఠం ఎవరిది?
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:10 AM
పరిషత్ ఎన్నికలు పూర్తి కావడంతో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
19న మండల పరిషత్..
20న జడ్పీ పదవులకు ఎన్నికలు
ముందుగా కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక
14లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు
ప్రత్యేక సమావేశం నోటీసులు
పరిషత్ ఎన్నికలు పూర్తి కావడంతో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా కోఆప్టెడ్ సభ్యుల ఎంపిక, తర్వాత చైర్మన్ స్థానాలకు పరోక్ష ఎన్నిక జరుగుతుంది. ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు చేతులు పైకెత్తి చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎంపిక చేసుకుంటారు. ఆయా రాజకీయ పార్టీలు జారీ చేసే విప్‌ను సభ్యులు తప్పనిసరిగా పాటించాలి. 19న ఎంపీపీ, 20న జడ్పీ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఎన్నిక నిమిత్తం సమావేశానికి హాజరు కావాలని సభ్యులకు ఈ నెల 14న నోటీసులు అందజేస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా హాజరు కానున్నారు.
(ఏలూరుసిటీ–అంధ్రజ్యోతి)
జిల్లాలో 27 జడ్పీటీసీ, 454 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, చైర్‌పర్సన్‌లను పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 27 ఎంపీపీలు, జిల్లా పరిషత్ కో ఆప్టెడ్ సభ్యులు, ఎంపీపీ అధ్యక్ష, ఉపాఽధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ల ప్రకారం ఈనెల 19న జిల్లాలోని 27 మండల ప్రజా పరిషత్‌లలో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికతో పాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపా ఽధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈనెల 20న జిల్లా ప్రజాపరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికతో పాటు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారులు నిర్ణీత తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. జిల్లాలో ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జడ్పీ చైర్‌పర్సన్, మరొకరిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు.
కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక
ప్రతి మండల ప్రజాపరిషత్‌లో ఒక కోఆప్టెడ్ సభ్యుడు, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కోఆప్టెడ్ సభ్యులు మతపరమైన మైనార్టీ లేదా భాషాపరమైన మైనార్టీ వర్గాలకు చెందిన వారు అర్హులై ఉండాలి. ఎంపీపీ అధ్యక్ష, ఉపాఽధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలకు ముందుగానే కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికల ను నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు జరిగే ఎన్కిలను చేతులు పైకెత్తి ఓటు వేసే విధానంలో నిర్వహిస్తారు.
విప్ పాటించాల్సిందే..
పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సంబంధిత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు జారీచేసే పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాలి. కో అప్టెడ్ సభ్యుల ఎన్నికల విషయంలో పార్టీ విప్ వర్తించదు. అలాగే సంబంధిత మండల, జిల్లా ప్రజా పరిషత్‌లకు ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యేందుకు ఆహ్వానించబడతారు. పరోక్ష ఎన్నికలలో వారికి ఓటు హక్కు మాత్రం ఉండదు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఈనెల 19న నిర్వహించనున్న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, ఈ నెల 20న నిర్వహించనున్న జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాలకు నోటీసులను ఈనెల 14లోగా అందజేయాల్సి ఉంది.