Share News

పశ్చిమకు జిల్లా పరిషత్‌

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:56 AM

భీమవరం కేంద్రంగా ఏర్పాటైన పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానున్నది. ప్రస్తుతం ఏలూరు కేంద్రంగా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ కొనసాగుతోంది.

పశ్చిమకు జిల్లా పరిషత్‌

స్థానిక పదవులపై ఆశలు

ఆశావహుల్లో ఉత్కంఠ

పరిషత్‌ తమదేనంటూ కూటమిలో ధీమా

విభేదాలు కలసి వస్తాయన్న భ్రమలో వైసీపీ

ప్రజలకు పాలన మరింత చేరువ

ప్రస్తుతం ఏలూరు కేంద్రంగా కార్యకలాపాలు

భీమవరం కేంద్రంగా ఏర్పాటైన పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానున్నది. ప్రస్తుతం ఏలూరు కేంద్రంగా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఆధారంగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అమలు చేయాలని భావిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఒకింత జోష్‌ నెలకొంది. జిల్లాలోని 20 మండలాలతో నూతన జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానున్నది. ఇప్పటికే భీమవరం ప్రాంతంలో కార్యాలయం కోసం భవనాలు చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులంతా ఏలూరు వెళుతున్నారు. ఉమ్మడి జిల్లా ఆధారంగానే నిధులు కేటాయిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌ ఏర్పాటుకు సన్నాహాలు చకాచకా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆధారంగా పాలనా పరమైన ఇబ్బందులుంటు న్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లా కలెక్టర్‌లకు జిల్లా పరిషత్‌పై ఎటువంటి అజమాయిషీ ఉండడం లేదు. నిధులు కేటాయింపులోనూ వ్యత్యాసం ఉండే అవకాశం ఉందన్న అపోహలు లేకపోలేదు. దానికితోడు కలెక్టరేట్‌లు ప్రత్యేకంగా జిల్లాకు ఏర్పడ్డాయి. జిల్లా పరిషత్‌లు కూడా ఏర్పాటు చేయడం అనివార్యం కానుంది. గతంలో ఉమ్మడి జిల్లా ఆధారంగా ఎన్నికలు నిర్వహించడంతో జిల్లాలు విభజన అయినా సరే జిల్లా పరిషత్‌ ఒక్కటిగానే ఉంది. ఏలూరులోనే ఉమ్మడి జిల్లా పరిషత్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇకపై పశ్చిమ గోదావరి జిల్లాకు వేరు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలకు ప్రత్యేక పరిషత్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆశావహులెందరో..

పశ్చిమగోదావరికి ప్రత్యేక జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానున్నదని తేటతెల్లం కావడంతో ఆశావహుల్లోనూ జోష్‌ నెలకొంది. కొత్త తరానికి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవులు కొందరికే వర్తించాయి.జిల్లాలో ఇంకా అనేకమంది వివిధ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర పదవులన్నీ భర్తీ అయిపోయాయి. జిల్లా స్థాయి పదవులే మిగిలి ఉన్నాయి. జిల్లా పరిషత్‌ కూడా అందులో ఒకటి. దాంతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌పై కూటమిలో నాయకులు కన్నేశారు. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి పోటీ నెలకొంది. జనరల్‌ కేటగిరీకి ఇస్తే జిల్లాలో సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గానికి చైర్మన్‌ పదవి కేటాయిస్తారని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జనరల్‌లో ఒక సంఖ్యాపరంగా తక్కు వైనా సరే పదవులు మాత్రం ఒక సామాజిక వర్గానికి అత్యధికంగా జిల్లాలో వరించాయంటూ ఇప్పటికే కూటమిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణుల్లో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. అందుకే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ఇతర సామాజిక వర్గాలకు కేటాయి స్తారంటూ ముందునుంచే అంచనాలు మొదల య్యాయి. కొత్త జిల్లా పరిషత్‌ కావడంతో దీనిని జనరల్‌ కేటగిరీకే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో సంఖ్యా పరంగా బలమైన సామాజిక వర్గానికి ఇస్తారంటూ చర్చ నడుస్తోంది. పార్టీ నుంచి అటువంటి సంకేతా లున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆశావహుల్లో ఉత్కంఠ ఏర్పడింది. నామినేటెడ్‌ పద వులు ఆశించిన వారంతా ఇప్పుడు క్యూలైన్‌లో ఉన్నారు. భీమవరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దగానే ఆశలు పెట్టుకుంటోంది. ఇతర సామాజిక వర్గాలకు రిజర్వ్‌ అయినా సరే జిల్లా పరిషత్‌కు జిల్లా నుంచి పెద్దపోటీనే ఉండనుంది. వైసీపీలోనూ నాయకులకు కరువు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి కూటమి శ్రేణులు తమకు నల్లేరుపై నడకగానే భావిస్తున్నాయి.అయితే తాడేపల్లిగూడెం, నర్సాపురం వంటి నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య విభేధాలు ఏమి చేస్తాయన్న ఆందోళన కూడా ఉంది. అంతిమంగా గెలుపుపై కూటమిలో జోష్‌ నెలకొంది. జిల్లా పరిషత్‌ తమదేనంటూ ఆశావహులు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. మొత్తానికి ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌ ఏర్పాటైతే జిల్లాలో పాలన ప్రజలకు మరింత చేరువకానుంది.

Updated Date - Jun 29 , 2026 | 12:56 AM