Share News

జడ్పీ పీఠంపై ఉత్కంఠ

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:15 AM

పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. కూటమి తరపున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆశా వహులుగా ఇద్దరు నేతలు నామినేషన్‌లు దాఖలు చేశారు.

జడ్పీ పీఠంపై ఉత్కంఠ

అధిష్ఠానం తేలుస్తుందా ?

ఉపసంహరణలోగా నిర్ణయించాలి..

ఇద్దరు నేతలు ఉండిలోనే నామినేషన్‌

తెలుగుదేశం నుంచి పొత్తూరి రామరాజు

జనసేనలో పీవీఎల్‌ నరసింహరాజు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. కూటమి తరపున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆశా వహులుగా ఇద్దరు నేతలు నామినేషన్‌లు దాఖలు చేశారు. చైర్మన్‌గా ఎన్నిక కావాలంటే ముందు జడ్పీటీసీగా గెలుపొందాలి. ఎన్నికైన జడ్పీటీసీలు చైర్మన్‌ను ఎన్నుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ను జనరల్‌కు కేటాయించారు. దాంతో ఉండి జడ్పీటీసీ స్థానం నుంచే ఇద్దరు చైర్మన్‌ అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు.తెలుగుదేశం నుంచి నర్సాపురం ఇన్‌ఛార్జ్‌ పొత్తూరి రామరాజు, జనసేన నుంచి పీవీఎల్‌ నరసింహరాజులు నామినేషన్‌ వేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఉండి జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశానికి కేటాయిం చారు. స్థానిక నాయకుడు ముదునూరి కృష్ణంరాజు ఆ పార్టీ తరపున ఉండిలో నామినేషన్‌ దాఖలు చేశారు. అధిష్ఠానం ఉపసంహరణ సమయానికి ముందే నిర్ణయం తీసుకోవాలి. ఆ మేరకు పీవీఎల్‌, పొత్తూరి, ముదునూరి కృష్ణంరాజుల్లో ఒకరే బరిలో ఉండేలా కూటమిలో సంప్రదింపులు జరిగాయి. అధిష్ఠానం తేల్చని పక్షంలో పొత్తూరి, పీవీఎల్‌ ఇద్దరూ నామినేషన్‌లు ఉపసంహరించుకోవాల్సిందే. అదే జరిగితే జిల్లా నుంచి ఆశించిన ముఖ్య నాయకులు చైర్మన్‌ అభ్యర్థిత్వాన్ని కోల్పోయినట్టవుతుంది.

ఎన్నికల తర్వాతే నిర్ణయమా ?

కూటమి అధిష్ఠానం మాత్రం చైర్మన్‌ విషయంలో ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కనీసం ఏ పార్టీకి కేటా యిస్తారో ముందుగా తెలిసినా ఉండిలో నామినేషన్‌ వేసిన ఇద్దరు నాయకుల్లో ఒకరు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్ఠానమే. లేదంటే జనరల్‌ కేటగిరీలో గెలుపొందిన జడ్పీటీసీలలో ఒకరిని జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో వందశాతం గెలు పొందాలని కూటమి అడుగులు వేస్తోంది. ఆ దిశగానే ఎన్నికల వ్యూహాలు పన్ను తున్నారు. కానీ చైర్మన్‌ విషయంలో జిల్లాకైనా ముందుగా స్పష్టత ఇవ్వాల్సి ఉందని కూటమి నాయకులు ఆశిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఓటు లేక పోవడం వల్ల తెలుగుదేశం నుంచి చైర్మన్‌లుగా ఆశించిన నాయకులు నామినేషన్‌లు వేయలేకపోయారు.

గణపవరంలో పోటాపోటీ నామినేషన్‌లు

జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి గణపవరం మండలంలో కూటమిలో సయోధ్య లేనట్టు కనపడుతోంది. గణపవరం జడ్పీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం, జనేసన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఇందుకూరి రామకృష్ణంరాజు ఆప్కాబ్‌ చైర్మన్‌, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా వెళ్లి శుక్రవారం నామినేషన్‌ వేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రేసులో తాను కూడా ఉన్నట్టు రామకృష్ణంరాజు కేడర్‌ వద్ద చెపుతున్నారు. అదే మండలం నుంచి జనసేన తరపున నాలుగు నామినేషన్‌లు పడ్డాయి. అందులో కొనిశెట్టి గణేష్‌ ప్రఽధానంగా ఉన్నారు. మిగిలిన వారంతా డమ్మీలుగానే నామినేషన్‌ వేసినట్టు జనసేన కేడర్‌లో చర్చ జరుగుతోంది. తొలి నుంచీ

గణపవరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ విషయంలో కూటమి నాయకులు మధ్య ఫలప్రదమైన చర్చలు జరగకపోవడం వల్లే రెండు పార్టీల నుంచి నామినేషన్‌లు దాఖలైనట్టు మండలంలో చర్చ మొదలైంది. గణపవరం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌లో ఉన్న 20 మండలాల్లో గణపవరం ఒకటి. జిల్లాలో 19 జడ్‌పిటిసి స్థానాల్లో తెలు గుదేశం, జనసేనలు సయోధ్యగానే నామినేషన్‌లు వేశారు. గణపవరంలోనే రెండు పార్టీలో పోటీపడేలా నామినేషన్‌లు వేశారు. ఎంపీటీసీల విషయం లోనూ అదే జరిగింది. గణపవరం మండలంలో 19 స్థానాలుంటే తెలుగు దేశం నుంచి 25, జనసేన నుంచి 23 నామినేషన్‌లు పడ్డాయి. ఉప సంహరణ నాటికైనా కూటమిలో సయోధ్య కుదరకపోతే కేడర్‌ ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఏర్పడినుంది.

Updated Date - Oct 24 , 2026 | 12:15 AM