Share News

యోగాతో భారతీయ సంస్కృతికి గుర్తింపు

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:51 AM

యోగా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అందించిన గొప్ప వరమని కలెక్టర్‌ నాగరాణి పేర్కొన్నారు.

యోగాతో భారతీయ సంస్కృతికి  గుర్తింపు
భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన యోగా ప్రదర్శనలో ఆసనాలు వేస్తున్న కలెక్టర్‌, జేసీ తదితరులు

భీమవరం టౌన్‌, జూన్‌ 19 (ఆంఽధ్రజ్యోతి): యోగా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అందించిన గొప్ప వరమని కలెక్టర్‌ నాగరాణి పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుంచే పూర్వీకులు యోగ సాధన, ఆసనాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలకు తెలియజేశారన్నారు. యోగాంధ్ర– 2026 కార్యక్రమంలో భాగంగా భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో యోగా ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగ సాధన ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. యువత యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ , జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా కబడ్డీ ఆడారు. కరాటే, ఆర్చరీలో పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి నిశాంత్‌ వర్మ, ప్రిన్సిపాల్‌ మురళీకృష్ణంరాజు, జిల్లా క్రీడల అధికారి మోహన్‌దాస్‌, యోగా జిల్లా నోడల్‌ అధికారి ఎ.వెంకట అప్పారావు పాల్గొన్నారు.

21న భీమవరంలో 1,500 మందితో యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 21న భీమవరం కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 1,500 మందితో యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం సాధించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,079 కేంద్రాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో 3,99,937 మంది పాల్గొన్నారని ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన 3,82,582 మంది నమోదు లక్ష్యాన్ని అధిగమించామన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:51 AM