వైసీపీలో నిస్తేజం !
ABN , Publish Date - May 07 , 2026 | 12:38 AM
జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం అవరించింది. పార్టీ అధినాయకత్వం నుంచి కూడా ప్రజా సమస్యలపై పిలుపులు లేకపోవడంతో ఏదో ఉనికి కోసం వైఎస్ ఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాల నిర్వహణతోనే కాలం గడుపుతున్నారు.
ప్రజా సమస్యలపై పట్టింపులేమి
తూతూమంత్రంగా గ్రామ కమిటీలు
ఏలూరులోనూ లుకలుకలు
దెందులూరు కన్వీనర్ మార్పు?
ఓ విధ్వంస నాయకుడిపై రౌడీషీట్
జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం అవరించింది. పార్టీ అధినాయకత్వం నుంచి కూడా ప్రజా సమస్యలపై పిలుపులు లేకపోవడంతో ఏదో ఉనికి కోసం వైఎస్ ఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాల నిర్వహణతోనే కాలం గడుపుతున్నారు. ఇటీవలే చాలాచోట్ల అతికష్టం మీద గ్రామ,మండల, పట్టణ, అనుబంధ కమిటీలు పూర్తి చేయగా దెందులూరు, పోలవరం, తదితర చోట్ల పెండింగ్ లోనే ఉన్నాయి. ఇటీవల జగన్ మావిగన్ అంటూ చేసిన రాజకీయంపై సొంత పార్టీలోనే లుకలుకలు వ్యక్తమయ్యాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
వైసీపీలో అంతర్గత కుమ్మలాటలు, పార్టీని దిశానిర్దేశం చేసేవారు కరువవ్వడంతో ఏ కార్యక్రమం తలపెట్టిన జిల్లా, నియోజకవర్గాల్లో విజయవంతం కాకపోవడంతో ఆ పార్టీలో అం తటా నిస్తేజం ఆవరించింది. ఇప్పటి వరకు ఉన్న రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్య నారాయణను ఈ కారణంతోనే ఆ బాధ్యతల నుంచి తప్పించినట్టు సమాచారం. ఆయన స్థానంలో అనకాపల్లి జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో పార్టీని ఐక్యంగా నడిపించడంలో లోపా ల వల్ల అప్పుడప్పుడు పొరుగు జిల్లాల నేతలతో కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్ని వర్గాల ను కలుపుకుని వెళ్లకుండా, కొన్ని సొంత నిర్ణ యాల వల్ల పార్టీలో లుకలుకలకు కారణంగా చెబుతున్నారు.
అంతటా నిర్లిప్తతే..
జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్ ను సరైన పంథాలో దిశా నిర్దేశం జరగడం లేద న్న విమర్శలున్నాయి. మాజీ మంత్రి ఆళ్లనానితో కలిసి ప్రయాణం చేసిన కొంతమంది కేడర్ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయ ప్రకాష్‌ను ఇటీవల కలిసి ముందుకు సాగడంతో కొంత ఊరట పొందుతున్నారు. ఏలూరు నగరంలో కొందరు ముఖ్య నాయకులు సైతం ఆయన నాయకత్వంలో పని చేయడానికి ఇష్టం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో నియోజకవర్గ కన్వీనర్ ఒక నెల అందుబాటులో ఉంటే మూడు నెలలు పార్టీకి దూరంగా ఉంటూ విదేశాల్లో విహరిం చడంతో పార్టీలో పట్టు తప్పుతోంది. దీంతో నియోజకవర్గ కన్వీనర్ మార్చుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కీలక నేతగా ఉన్న ఆళ్ల సతీష్ చౌదరి కన్వీనర్ పదవిని ఆశిస్తున్నారు. చాలాకాలం నుంచి అబ్బయ్య చౌదరి పార్టీ మా రుతారన్న ప్రచారంతోనే ఆయన వెంట పెద్దగా నడిచే నాయకత్వం కరువైందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. మరికొందరు నేతలు అదనపు కన్వీనర్ల పదవులను ఆశిస్తున్నా అందుకు అధి ష్ఠానం మొగ్గు చూపడం లేదు.కీలకమైన దెందులూరు మండలంలోనే ప్రధానంగా మండల పార్టీ అధ్యక్షుడు, జడ్పీటీసీల మధ్య అంతర్గతంగా విభేధాలు పొడచూపాయి. పెద వేగిలోనూ వైసీపీ క్యాడర్ నిస్తేజంగా ఉంది. పెదపాడులో కమిటీలే పూర్తి కాలేదు.
కైకలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష కేంద్రంలో సమస్యలపై ఒక్క ఆందోళన కూడా చేయలేదు. ఇక్కడ పాతవారితోనే ఎక్కువగా 5,044 మంది సభ్యులతో గ్రామ, మండల కమిటీలు పూర్తయ్యాయి. పోలవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఓ మోస్తరు కార్యక్రమాలతో పట్టుకోల్పోకుండా సాగుతున్నారు. అయితే కొయ్యలగూడెం కేంద్రంగానే చేస్తున్నారు. ఇతర మండలాల్లో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కన్పిపిస్తోంది. చింతలపూడి నియోజకవర్గంలో కంభంపాటి విజయరాజు పెద్దగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలను చేయడం లేదు. దీంతో కేడర్ పట్టుజారిపోయింది. ఉంగుటూరులో పుప్పాల వాసుబాబు పార్టీ కార్యక్రమాల తప్ప.. ఏ విధమైన ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం లేదు. నూజివీడులోనూ పార్టీ కేడర్ అంత స్పీడు లేదు. ప్రధానంగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు బయటకు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నా పెద్దగా కేడర్ ఆయన వెంట లేరు.
కూటమితో అంటకాగేవారే ఎక్కువ
అన్ని నియోజక వర్గాల్లోనూ కూటమి నేతలతోనే సందడ్లో సడేమియాగా వైసీపీ శ్రేణులు టచ్‌లో ఉంటూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇసుక, మట్టి, ఇతర కాంట్రాక్టర్ల అవతారంలో వైసీపీ నేతలే ఉన్నట్లు సమాచారం. వైసీపీలో ప్రజా సమస్యలపై కనీసం వినతులు ఇచ్చేవారే కరువయ్యారు. కైకలూరులో ఎమ్మెల్యే కోటరీలోనే నేతలు తిరుగుతూ తెర వెనుక పనులు చేయించుకునే నాయకులు అన్ని మండలాల్లోను తయారయ్యారు. ఇది కొంత కూటమికి కష్టంగా పరిణ మిస్తోంది. పోలవరంలో మండలంలో వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితో కొందరు టీడీపీ నేతలు కలిసి సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల పనులు చేస్తూ పర్సంటేజీలు పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దెందులూరులో బెల్ట్‌షా పులు, మద్యం దుకాణాల్లో ఎక్కువ మంది వైసీపీ నేతలు భాగస్వామ్యులుగా ఉన్నారన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో గత వైసీపీ హయాంలో విధ్వంసాల్లో కీలక భూమిక పోషించిన ఒక వైసీపీ నేతపై ఇటీవలే రౌడీషీట్‌ను పోలీసులు తెరిచారు. ఎక్కడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, ఆందోళన కార్యక్రమాలు గత ఐదునెలులగా జరగకపో వడం వెనుక కారణాలు అంతుబట్టడం లేదని సీనియర్లు చెబుతున్నారు.
రాబోయే స్థానికంపై దృష్టి లోపం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఎక్కడా దృష్టి సారించనట్లే కనిపించడం లేదు. కార్పొరేషన్, మున్సిపాల్టీలు, గ్రామాల్లో ఓటర్ల జాబితాల పరిశీలన కనీసం చూడలేదు. వార్డుల విభజన, పునర్విభజన, ఇతర అంశాలపై పట్టుకోల్పోయే స్థితిలో పార్టీ అధినాయకత్వం ఉండడంతో పార్టీలో సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.