ఇంకెన్నాళ్లు సారూ..!
ABN , Publish Date - May 07 , 2026 | 12:39 AM
గత జగన్ ప్రభుత్వంలో త్వరితగతిన రీసర్వే పూర్తి చేయాలని హడావుడి చేయడంతో ఉన్నతాధి కారులు గ్రామస్థాయి అధికారులపై ఒత్తిడి చేయడంతో అధికారులు ఇష్టారాజ్యంగా క్షేత్ర స్థాయిలో భూముల వద్దకు వెళ్లకుండా, రైతు లకు సమాచారం ఇవ్వకుండా రీసర్వే చేశారం టూ రైతులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ హయాంలో రీసర్వే తప్పుల తడక
కూటమి ప్రభుత్వంలోనూ పరిష్కారం కావడం లేదు
రాజముద్ర పాస్ పుస్తకాలతో సరి..
సమస్యలు లేని భూములకు మాత్రమే పంపిణీ..
రైతుల ఆవేదన
వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన రీ సర్వే తప్పుల తడకగా జరిగింది. ఆ తప్పులను సరి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా నేటికీ రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సర్వే రాళ్లను మార్చి రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారే తప్పా తప్పులను సరి చేయడం లేదని రైతులు వాపోతున్నారు.
కొయ్యలగూడెం, మే 6(ఆంధ్రజ్యోతి):గత జగన్ ప్రభుత్వంలో త్వరితగతిన రీసర్వే పూర్తి చేయాలని హడావుడి చేయడంతో ఉన్నతాధి కారులు గ్రామస్థాయి అధికారులపై ఒత్తిడి చేయడంతో అధికారులు ఇష్టారాజ్యంగా క్షేత్ర స్థాయిలో భూముల వద్దకు వెళ్లకుండా, రైతు లకు సమాచారం ఇవ్వకుండా రీసర్వే చేశారం టూ రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభు త్వంలో తప్పులు సరి చేస్తామని సమావేశాలు పెడుతున్నారే తప్పా పరిష్కారం కావడం లేదంటూ వాపోతున్నారు. రాజముద్రతో ఉన్న పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నా కేవలం సమ స్యలు లేని భూములకు మాత్రమే ఇస్తున్నారు. భూముల హెచ్చుతగ్గులు, జాయింట్ ఎల్‌పీఎం లు ఉన్న వారికి ఈ పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే సర్వేయర్లు అందుబాటులో ఉండాలి. అయితే రీసర్వే జరగని గ్రామాలకు సర్వేయర్లను పంప డంతో గ్రామ సర్వేయర్లు అందుబాటులో లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు.
రీ సర్వేలో అనేకమంది రైతులకు భూ విస్తీ ర్ణంలో హెచ్చు తగ్గులు వచ్చాయి. జాయింట్ ఎల్‌పీఎంలు వచ్చాయి. ఒకే ఎల్‌పీఎంలో అనేక మంది రైతుల సర్వే నంబర్లు జాయింట్‌గా పాస్‌పుస్తకాలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఇప్పటికీ జాయింట్ నుం చి విడదీయడం లేదంటూ రైతులు వాపోతు న్నారు. తమ పొలాలు అమ్ముకోవాలన్నా, బ్యాం కుల్లో రుణాలు తెచ్చుకోవాలన్నా ఆటంకాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు
రైతుల పొలాల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు వచ్చాయి. ఒకరి పొలం తగ్గడం, పక్కనున్న మరో రైతుకు ఎక్కువ భూవిస్తీర్ణం రావడం జరిగింది. రైతులు తమ పాత పాస్‌పుస్తకాల్లో ఉన్న విధంగా భూమి తగ్గిందంటూ అర్జీలు పెట్టుకుంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. అర్జీ పెట్టుకున్న రైతులకు ఎక్కువ భూమి వచ్చిన రైతుల నుంచి అంగీకార పత్రం తెచ్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎక్కువ భూమి నమోదయిన రైతులు మేము ఎందుకు ఇవ్వాలి.. ఆ పొలం మాదేనంటూ ఎదురు తిరు గుతున్నారు. ఈ సమస్య పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని రోజు రైతులు జిల్లా, డివిజన్, మండల అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు.
2లక్షల ఖాతాలో సర్వే నెంబర్లు
అనేక గ్రామాల్లో రీ సర్వే జరిగినప్పుడు మిగిలిన భూముల పేరుతో ‘2లక్షల ఖాతా’లో సర్వే నంబర్‌లను పెట్టారు. ఈ ఖాతా నుంచి తమకు బయటకు తీయాలంటూ రైతులు కోరగా సరిచేస్తామని అధికారులు చెబుతున్నారే తప్పా పరిష్కారం కాలేదు. ఈ ఖాతాలో ఉన్న భూములన్నీ రైతులే సాగు చేసుకుంటున్నారు. పైగా ఇవి ప్రభుత్వ భూములు కూడా కావు. కేవలం మిగులు భూముల పేరుతో వీటిని ఈ ఖాతాలో పెట్టడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య కూడా మండలంలోని అనేక గ్రామాల్లో ఉంది. సుమారు రెండువేల సర్వే నంబర్లు ఈ ఖాతాలో ఉన్నట్టు సమాచారం.
ఏడాదిగా తిరుగుతున్నా.. : చిక్కాల సురేఖ, అచ్యుతాపురం
నా తల్లిదండ్రులు నాకు 20 సెంట్లు భూమి ఇచ్చారు. ఆ భూమికి పాస్‌పుస్తకం వచ్చి, ఆ భూమిని నేనే వ్యవసాయం చేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో రీసర్వే జరిగినప్పుడు ఆ భూమి మళ్లీ మా పూర్వీకుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదవ్వడంతో నా పేరుపై ఉన్న 20 సెంట్లు ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. దీనివల్ల అన్నదాత సుఖీభవ పథకం వర్తించడం లేదు. ఏడాదిగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.
10 సెంట్లు భూమి తగ్గింది.. : కరోతు నారాయణరావు, కొయ్యలగూడెం
పరింపూడి రెవెన్యూ పరిధిలో నాకు 2.95 ఎకరాల భూమి ఉంది. రీసర్వే జరిగినప్పుడు 10 సెంట్లు భూమి తగ్గింది. ఈ సమస్య పరిష్కరించమని అధికా రుల చుట్టూ తిరుగుతున్నా. పైగా పక్కరైతుకు సర్వే రాళ్లు వేసేశారు. ఆ రైతు నుంచి అంగీకారపత్రం తెచ్చుకోమని చెబుతున్నారే తప్పా సమస్యను పరిష్కరించడం లేదు.
జాయింట్ ఎల్‌పీఎంలో నమోదు : రాజేశ్వరి, కన్నాయిగూడెం
నాకు ఉన్న ఎకరం భూమి జాయింట్ ఎల్‌పీఎంలో పెట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా జాయింట్ ఎల్‌పీఎం నుంచి వేరు చేయడం లేదు. అధికారులు ఆ సమస్యను పరిష్కరించాలి.
పరిష్కారం కాని 22ఏ సమస్యలు
22ఏలో ఉన్న భూముల సమస్యలు పరిష్కా రం చేశామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఆ సమస్య పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మండలం లోని మంగపేట, పరింపూడి రెవెన్యూ పరిధిలో అనేక మంది పేద రైతులకు 2005–06లో పట్టా లిచ్చారు. ఆ భూములను ఆ రైతులే సాగు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వారి పేరులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో రీ సర్వే జరిగిన ప్పటి నుంచి ఈ భూములన్నీ హోల్డ్‌లో పెట్టా రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. అవి హోల్డ్‌లో ఉండటం వల్ల కుటుంబ యజమాని మృతి చెందినప్పుడు ఆ భూమిని కుటుంబ సభ్యులకు మార్చేందుకు వీలు కావడం లేదు. వారికి అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందడం లేదు. బ్యాంక్ రుణాలు కూడా ఇవ్వడం లేదు.