ఎర్రకాలువ భూములు కబ్జా
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:28 AM
కబ్జాదారులకు ఎర్రకాలువ భూములు బంగారు కొండల్లా మారాయి..
కొందరు గట్టు కొట్టేస్తుంటే..
మరికొందరు కాలువ పూడ్చేస్తున్నారు..
కొనేది ఎకరం..అనుభవించేది రెండెకరాలు
తాడేపల్లిగూడెం రూరల్, మే జూన్ 18(ఆంధ్రజ్యోతి): కబ్జాదారులకు ఎర్రకాలువ భూములు బంగారు కొండల్లా మారాయి.. కాలువ గట్లను కొందరు కొట్టేసి ఆక్రమి స్తుంటే మరికొందరు కాలువ పూడ్చేసి మరీ కబ్జా చేస్తున్నారు. బంగారుగూడెం నుంచి మారంపల్లి వరకూ ఇదే తంతు జరుగుతుందంటూ స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మండలం లోని మారంపల్లిలో ఓ రైతు తన చేనుకు ఆనుకుని ఉన్న ఎర్రకాలువ గట్టు తొలిచేసి గట్టు ఆక్రమించగా మరో ఇద్దరు రైతులు అక్కడ సరిహద్దు ప్రాంతంలో పాత ఎర్రకాలువ పూడ్చేసి మరీ సాగుచేసే పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్థానికులు ఆరోపించడంతో రెవెన్యూ అధికారులు గురువారం గట్టు పూడ్పించారు. అయితే ఆ పక్కనే ఎర్రకాలువ పూడ్చి సాగు చేస్తున్నవారిని మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు లేకపోలేదు.
పాత కాలువ వదిలేయడం వల్లే.,.
గతంలో ఎర్రకాలువ అభివృద్ధిలో భాగంగా పాత ఎర్రకాలువ వంకర్లు తీసేందుకు కొందరి రైతుల వద్ద భూమి కొనుగోలు చేసి పాత కాలు వను వదిలేసి నూతనంగా కాలువ సరిచేశారు. అయితే ఈ పని పూర్తయి పదేళ్లవుతున్నా పాత ఎర్రకాలువను అలానే వదిలేశారు. దీంతో కొందరు దాన్ని పూడ్చి ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వరదలకు తమ భూమిలోకి కాలువ చొచ్చుకురావడం వల్ల తమ పంట చేను కాలువలోకి వెళ్లిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసేవారూ ఉన్నారు. ఇటు భూములు ఆక్రమించే వారిని అడ్డుకోలేక మరోపక్క భూమి కొల్పోయిన వారికి న్యాయం చేయడంలోనూ అదికా రులు విఫలమవుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.