Share News

యనమదుర్రు.. కాలకూటం

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:34 AM

కేంద్ర ప్రభుత్వం భీమవరం ప్రాంతాన్ని బ్రాకిష్‌ వాటర్‌ క్లస్టర్‌గా ప్రకటించింది. సముద్రపు నీరు, మంచినీరు కలిసే ఉప్పునీటి సాగుకు జిల్లాలో అవకాశం ఉందని గుర్తించింది. కానీ యనమదుర్రు డ్రెయిన్‌లో కాలుష్యం దీనికి పెద్ద అవరోధంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి పరిశ్రమల వ్యర్థాలన్నీ యనమదుర్రు లోకే విడచిపెడుతున్నారు.

యనమదుర్రు.. కాలకూటం
ఫ్యాక్టరీ వ్యర్థాలతో నల్లగా మారిన యనమదుర్రు నీరు

పరిశ్రమల వ్యర్థాలన్నీ డ్రెయిన్‌లోకే

ఉప్పునీటి సాగుకు ప్రధాన అవరోధం

బ్రాకిష్‌ వాటర్‌ క్లస్టర్‌గా భీమవరం ప్రాంతం

20 వేల ఎకరాల్లో సహజ సిద్ధమైన

సాగుకు అనుకూలమని గుర్తింపు

కాలుష్యాన్ని నివారిస్తేనే అవకాశం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం భీమవరం ప్రాంతాన్ని బ్రాకిష్‌ వాటర్‌ క్లస్టర్‌గా ప్రకటించింది. సముద్రపు నీరు, మంచినీరు కలిసే ఉప్పునీటి సాగుకు జిల్లాలో అవకాశం ఉందని గుర్తించింది. జిల్లా అధికారులు సైతం 20 వేల ఎకరాల్లో బ్రాకిష్‌ వాటర్‌ సాగుకు అనుకూలమని అంచనా వేసింది. కానీ యనమదుర్రు డ్రెయిన్‌లో కాలుష్యం దీనికి పెద్ద అవరోధంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి పరిశ్రమల వ్యర్థాలన్నీ యనమదుర్రు లోకే విడచిపెడుతున్నారు.

భీమవరం పట్టణ పరిధిలో రెండు కిలోమీటర్ల పొడవునా డ్రెయిన్‌ ప్రవహిస్తోంది. ఆ దారిలో ప్రయాణించే వాహనదారులకు ముక్కు పుటాల అదిరిపోయే దుర్గంధం వస్తుంది. రానున్న రోజుల్లో భీమవరం పట్టణ పరిసరాల్లో భూగర్భ జలాలు కూడా కాలుష్యమయం కానున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. కలుషిత జలాలను పరిష్కరించక పోతే బ్రాకిష్‌ వాటర్‌ క్లస్టర్‌పై జిల్లా అధికారులు చేసే ప్రయత్నాలన్నీ వృథా కానున్నాయి. ఏ ఒక్క రైతు కూడా ఉప్పుటేరు, యనమదర్రుకు ఇరువైపులా సహజ సిద్ధమైన ఉప్పునీటి సాగుకు సాహసం చేయరు. యనమదుర్రులో ప్రవహించే కలుషిత జలాలే అందుకు ప్రధాన కారణం. పరిశ్రమల కాలుష్యాన్ని నివారిస్తామంటూ ప్రభుత్వం ప్రతీసారి చెప్పుకొస్తోంది. ఆచరణలో సాధ్యం కావడం లేదు. గతంలో డెల్టా పేపర్‌ మిల్లు నుంచి వ్యర్థాలు యనమదుర్రులో కలిసేవి. ఇప్పుడది మూతపడింది. పరిశ్రమల్లో వ్యర్థ జలాలను శుద్ధిచేసే ప్లాంట్‌లు పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. యనమదుర్రు డ్రెయిన్‌లో కాలుష్య నివారణ సాధ్యమవుతుంది.

గతమెంతో ఘనం

యనమదుర్రు డ్రెయిన్‌ గతంలో మత్స్య సంపదకు ప్రసిద్ధి. మత్స్యకారులు వేట సాగించేవారు. సముద్ర జలాల నుంచి ఎగదన్నే చేపలు దీంట్లో లభ్యమయ్యేవి. రవాణా రాకపోకలకు డ్రెయిన్‌ ఉపయోగపడేది. ఉప్పు టేరుకు ప్రధాన నీటి వనరు కూడా ఇదే. భీమవరం నుంచి మండలంలోని గ్రామా లకు పడవలు ద్వారా ప్రయాణాలు సాగించేవారు. తిరిగి పట్టణానికి చేరుకునే వారు. గ్రామాల నుంచి మార్కెట్‌కు పడవల్లోనే వచ్చేవారు. ముఖ్యంగా మత్స్యకారులకు వేటకు యనమ దుర్రు ఉపయోగపడేది. కొల్లేరు దిగువ ప్రాంతంలో యనమదుర్రు ఉప్పుటేరులో విలీనమవుతుంది. కాలుష్య జలాలు కూడా కలవడంతో ఉప్పుటేరు కలుషితమవు తోంది. దీనిని పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాంక్షకు గండి పడనుంది. మంచి నీరు కలిసే సహజ సిద్ధమైన ఉప్పునీటితో రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులు సాగు చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయి. వైరస్‌లు సోకడం కూడా తక్కువగా ఉంటుంది. నర్సాపురం ప్రాంతంలో నల్లిక్రీక్‌కు ఇరు వైపులా ఇలాగే రైతుల మంచి ఉత్పత్తులు సాధిస్తున్నారు. జిల్లాలో 20 వేల ఎకరాలకు సహజసిద్ధమైన ఉప్పునీటి ఆక్వా సాగును విస్తరించాలని జిల్లా అధికారులు సంకల్పించారు. యనమదుర్రు కాలుష్యాన్ని నివారించినట్టయితే జిల్లాలో అంతకు మించి సాగు చేయడానికి అన్ని అవకాశాలున్నాయి.

రూ. 100 కోట్లు ఏమైనట్టు ?

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యనమ దుర్రు ప్రక్షాళనకు రూ. 100 కోట్లు కేటాయించారు. ఆ నిధులు ఏమయ్యాయో తెలియడం లేదు. పనులు లేకపోవడంతో ప్రాజెక్ట్‌ మరుగన పడింది. తాజాగా బ్లాకిష్‌ వాటర్‌ క్లస్టర్‌ను అమలు చేయాలంటే రూ. 900 కోట్లు అవసరం కానున్నదని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఉప్పుటేరు డ్రెడ్జింగ్‌, యనమదుర్రు పూడిక తీత వంటి పనులకు నిధులను విని యోగించున్నారు. మరోవైపు కొల్లేరు పరిరక్షణకు ఉప్పుటేరు డ్రెడ్జింగ్‌ ముఖ్యమని కేంద్ర బృందం కూడా స్పష్టం చేసింది. ఒకవైపు కొల్లేరు పరిరక్షణ, మరోవైపు బ్లాకిష్‌ వాటర్‌తో ఆక్వా సాగు లక్ష్యం నెరవేరాలంటే కేంద్రం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపారు. కేంద్రం నిధులు ఇచ్చినా యనమదుర్రు కాలుష్యాన్ని నివారించకపోతే ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరదు.

Updated Date - Jun 30 , 2026 | 12:34 AM