Share News

పనుల్లో వేగం.. సీఎంలో ఉత్సాహం

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:46 AM

పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వేగాన్ని చూసి సీఎం చంద్రబాబులో ఎన్నడూ లేనంతగా ఉత్సాహం తొణికసలాడింది.

పనుల్లో వేగం.. సీఎంలో ఉత్సాహం
విద్యుత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

వచ్చే ఏడాది మార్చికి పూర్తవుతుందని ధీమా.. విశాఖకు జలాలు

కేంద్రం సహకారంతో పనులు ఫాస్ట్‌ ట్రాక్‌ పట్టాయని వెల్లడి

భూసేకరణ పరిహారానికి పెద్దపీట వేశామన్న చంద్రబాబు

గంటన్నరపాటు ప్రాజెక్టు ఆసాంతం పరిశీలన..

పనుల తీరును వివరించిన అధికారులు

ఏలూరు/పోలవరం, జూలై 13(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వేగాన్ని చూసి సీఎం చంద్రబాబులో ఎన్నడూ లేనంతగా ఉత్సాహం తొణికసలాడింది. అను కున్న సమయానికి అన్ని ప్రధాన కట్టడాల పను లు వేగంగా సాగుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి కాగలదనే ధీమాను వ్యక్తపరిచారు. ‘శరవేగంగా జరుగుతున్న పనులను చూస్తుంటే కనుచూపు మేరలోనే ప్రాజెక్టు పూర్తవుతుందని నమ్మకం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 14 నాటికి ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలు అందించి జలహారతి ఇస్తాం. వచ్చే ఏడాదిలోగా విశాఖకు నీటిని తరలించే ప్రక్రియ ను చేపడతాం. ఏ రోజు జలకళ సంతరించుకుం టుందో.. ఆ రోజు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం’ అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ధవ ళేశ్వరం పర్యటన ముగించుకుని సోమవారం గంటన్నర ఆలస్యంగా సాయంత్రం మూడు గంటల ప్రాంతానికి పోలవరం ప్రాజెక్టు ప్రాంతా నికి సీఎం చేరుకున్నారు. తొలుత ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తర్వాత హిల్‌వ్యూ ప్రాంతం నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం బస్సులో ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌ 2 ప్రాంతానికి చేరుకుని, పనుల ప్రగతి ఫొటో ఎగ్జిబిషన్‌, గ్యాప్‌ 2 ఈసీ ఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతాన్ని, విద్యుత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ పనులను గంటన్నరకు పైగా పరిశీలిం చారు. మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశి భూషణ్‌ కుమార్‌, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్ర రావు ప్రాజెక్టు పనులను సీఎంకు వివరించారు.

పనులపై సీఎం సంతృప్తి

అధికారులతో సమీక్ష అనంతరం చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పనుల్లో 15 శాతం పురోగతి సాధించాం. మొత్తం గా చూస్తే 89 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 11 శాతం కొద్ది నెలల్లోనే పూర్తవుతుంది. రెండే ళ్లలో నిర్వాసితులకు రూ.2,250 కోట్ల పరిహారం అందించాం. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, పునరా వాసం త్వరితగతిన పూర్తిచేయాలని అఽధికారు లను ఆదేశించాం. నేవిగేషన్‌ పరంగా పోలవరం దేశంలోనే ఓ మోడల్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుం టుంది. వరదల సమయంలో నీట మునుగుతు న్న గండి పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు వేగంగా చేపడతాం. ఇప్పటి వరకు పోలవరంలో 37సార్లు పర్యటించి 136 సమీక్షలు చేశా. ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడటం, పీపీఏ, సీడబ్యూసీ సహకారంలో ప్రాజెక్టు పనులు ఫాస్ట్‌ట్రాక్‌ పట్టాయి’ అని సీఎం వివరించారు. సీఎం వెంట మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూ రు, పోలవరం జిల్లాల కలెక్టర్లు వెట్రిసెల్వి, దినేష్‌ కుమార్‌, ఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌, జేసీ అభిషేక్‌ గౌడ, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్‌, మద్దిపాటి వెంకట్రాజు, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌కుమార్‌, పితాని సత్యనారాయణ, మిర్యాల శిరీష దేవి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజ శేఖర్‌, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెం దుర్తి వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఎక్స్‌అఫీషియో కలెక్టర్‌ వి.అభిషేక్‌, ఎస్‌ఈ రామచంద్రరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు, శాప్‌ డైరెక్టర్‌ కొవ్వాసు జగదీశ్వరి, మేఘా జీఎం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హెలీకాప్టర్‌పై ఉండ వల్లి బయల్దేరి వెళ్లారు.

సీఎం దృష్టికి.. ఆంధ్రజ్యోతి కథనం

పోలవరం సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబును ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షుడు మంగిన కొండ కోరారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని, ‘30 పడకల ఆసుపత్రికి మోక్షమెప్పుడు’ అనే శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్‌ను ఆయనకు అందజేశారు. పోలవరం అసంపూర్ణంగా నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని 100 పడకలకు పెంచి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని కోరారు. ‘అఖండ గోదావరి నెక్లెస్‌ బండ్‌ని సుందరీకరణ చేసి టూరిజం హబ్‌ చేయాలి. పోలవరంలో గోదావరి నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటుచేయాలి. మండలంలోని పలు రోడ్లు నిర్మించాలి. వరదల నుంచి పంట నష్టం జరగకుండా కడెమ్మ స్లూయిజ్‌ వద్ద మినీ లిఫ్టు మోటారు ఏర్పాటు చేయాలి. కన్నాపురం అడ్డరోడ్డు సమీపంలో 2015లో నిర్మించిన ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తి చేయాలి’ అని కోరారు. ఆకుల రాజా, పాదం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:46 AM