Share News

చలి పంజా!

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:20 AM

చలి బాబోయ్‌.. చలి.. అంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసు లు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. మూడు రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.

చలి పంజా!
జీలుగుమిల్లి– బుట్టాయగూడెం 365 బీబీ జాతీయ రహదారిని శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో కమ్మేసిన మంచు

వణికిస్తున్న చలిగాలులు

వాయుగుండం ప్రభావమే కారణం

ఏజెన్సీలో మరింత అధికం

పడిపోయిన ఉష్ణోగ్రతలు

చలిని తట్టుకోలేకపోతున్న ప్రజలు.. వ్యాధుల విజృంభణ

ఏలూరుసిటీ, జనవరి 9(ఆంధ్రజ్యోతి):చలి బాబోయ్‌.. చలి.. అంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసు లు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. మూడు రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఒకేసారి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. వాతావరణ మార్పులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తగ్గట్టుగానే చలి తీవ్రత మూడు రోజులుగా పెరుగుతూ వస్తోంది. ఏజెన్సీ మండలాల్లో ప్రజలు రాత్రి సమయాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రి పూట ప్రయాణా లు చేసే వారు చలికి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులలో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు చలిని తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. చలిగాలుల తీవ్రత వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరిగింది. ఉమ్మడి పశ్చిమలో రాత్రి ఉష్ణోగ్రతలు మూడు రోజులుగా గణనీయంగా పడిపోతు న్నాయి. గతేడాది ఇదే సమయంలో 18 డిగ్రీలు నమోదు కాగా, శుక్రవారం రాత్రి 14 డిగ్రీలకు పడిపోయింది. గురువారం 30/15, శుక్రవారం 29/14 డిగ్రీలు నమోదైంది. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మంచుతో కానరాని రహదారి

జీలుగుమిల్లి, జనవరి9(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో వేకువ జామున రైతులు పొలం వెళ్లేందుకు వీలులేకుండా మంచు కమ్మేస్తోంది. మరోవైపు ఇటీవల నిర్మాణం చేపట్టిన జాతీ య రహదారి (365 బీబీ) రోడ్డుపై గ్రావెల్‌ పనులు కొనసాగుతున్నాయి. దగ్గరకు వచ్చే వరకు ఎదురుగా వస్తు న్న వాహనం కనబడక, రోడ్డుపై ఉన్న కంకరరాళ్లు పైకి లేచి ఉండడం, కల్వర్టుల వద్ద ఇరుకు రోడ్లు కనిపించక, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:20 AM