రేషన్ రైస్‌కు రెక్కలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:30 AM
జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం వినియోగించడానికి లబ్ధి దారులు ఆసక్తి చూపడం లేదు. దళారులకు విక్రయిం చుకుంటున్నారు.
మళ్లీ కొనుగోలు చేస్తున్న దళారులు
విక్రయించుకుంటున్న లబ్ధిదారులు
కొందరు నేరుగా డీలర్లకే విక్రయాలు
తనిఖీలు చేస్తున్న అధికారులు
అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్నాయంటూ దళారుల బెదిరింపులు
జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం వినియోగించడానికి లబ్ధి దారులు ఆసక్తి చూపడం లేదు. దళారులకు విక్రయిం చుకుంటున్నారు. జిల్లా నుంచి దాదాపు 40 శాతం రేషన్ బియ్యం తిరిగి మార్కెట్‌కు తరలిపోతోంది. జిల్లా నుంచి కాకినాడ, మండపేట ప్రాంతాలకు సరఫరా చేస్తుండగా అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది..
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గతంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి కొనుగోలు చేసేవారు. ద్విచక్ర వాహనాలపై తీసుకు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. జిల్లాలోనే కొత్త ముఖాలు దళారులు అవతారమెత్తాయి. అధికార పార్టీ నేతలే తమకు అండ అంటూ బరి తెగిస్తున్నారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో ఉత్పత్తయ్యే బియ్యాన్ని మాత్రమే కొద్దో గొప్పో వినియోగిస్తుంటారు. రబీలో ఉత్పత్తి చేసే బియ్యాన్ని రేషన్‌లో సరఫరా చేస్తే జిల్లాలో వినియోగం తక్కువగా ఉంటుంది. అవే బియ్యాన్ని మళ్లీ మార్కెట్‌లో విక్రయిం చేస్తున్నారు. దళారులు కిలోకు రూ. 14 ఇస్తున్నారు. కొందరు లబ్ధిదారులు డీలర్ల వద్దే రేషన్ ఉంచేస్తున్నారు. సొమ్ములు తీసుకుంటున్నారు. డీలర్‌ల నుంచి కూడా దళారులే బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ చేసే వాళ్లకు మాత్రమే జిల్లాలో తెల్లకార్డులు లేవు. మిగిలిన వారందరికీ తెల్లకార్డులు న్నాయి. పట్టణాల్లో భవనాలు అద్దెకు ఇచ్చిన వారు కూడా రేషన్ కార్డు పొందారు. రేషన్ తీసుకుంటున్నారు. అపార్ట్‌మెంట్‌లలో నివాసముంటున్నవారు కూడా రేషన్ తీసుకోవ డానికి వెనుకాడడం లేదు. వారంతా మళ్లీ మార్కెట్‌లో విక్రయించేస్తున్నారు. అదే ఇప్పుడు దళారులకు ఆదాయ వనరుగా మారింది. ప్రతి రోజు జిల్లా నుంచి రేషన్ వాహనాలు కాకినాడ జిల్లాకు వెళుతున్నాయి. ప్రధానంగా మండపేట ప్రాంతంలో వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
మిల్లర్లకు సరఫరా
రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు తిరిగి సంచులను మార్చి మిల్లులకు ఇచ్చేస్తున్నారు. నేరుగా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కేటాయించిన గోదాములకు తరలిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండ పేట ప్రాంతం ఇప్పుడు రేషన్ బియ్యం అడ్డాగా మారింది. గతంలో కాకినాడ పోర్టు వద్ద తనిఖీల పేరుతో కాస్త కఠినంగా వ్యవహరించారు. దాంతో రేషన్ బియ్యం కాకినాడ పోర్టునుంచి విదేశాలకు తరలించడం తగ్గిపోయింది. చెన్నయ్ పోర్టుకు తరలించేవారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి వివిధ మార్గాల్లో మళ్లీ విజయవాడ వెళ్లిపోయేవి. అక్కడ నుంచి నేరుగా చెన్నయ్ పోర్టుకు తరలించేవారు. మళ్లీ ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు సదరు జిల్లాల్లో కొందరు మిల్లర్లు కూడా రీసైక్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పొరుగు జిల్లా మిల్లర్లు ధాన్యాన్ని అధిఽక ధరలకు కొనుగోలు చేసేవారు. మద్దతు ధరకంటే రూ. 100 అధికంగా చెల్లించేవారు. దీనిపై పశ్చిమ సరిహద్దు గ్రామాల రైతులు ఘొల్లుమంటు న్నారు. పొరుగునే ఇతర జిల్లా మండలాల్లో అధిక ధర లభిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ తలలు పట్టుకునే సందర్భా లుంటున్నాయి.
40 శాతం మార్కెట్‌కు..
ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఓ రైసు మిల్లులో 90 టన్నుల రేషన్ బియ్యం దొరికింది. అప్పుడు జిల్లా అధికారులకు అక్కడ పరిస్థితులు అర్థమయ్యాయి. రేషన్ రీసైక్లింగ్ వల్లే అధిక ధరలకు ధాన్యం కొనుగోలు చేయగలుగు తున్నారంటూ నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికీ అవే జిల్లాలకు రేషన్ బియ్యం తరలి వెళుతున్నాయి. గతంలో నిడదవోలు, రావులపాలెం నుంచి చిరు వ్యాపారులు జిల్లాకు వచ్చేవారు. బియ్యం కొనుగోలు చేసి తమ ప్రాంత వ్యాపారులు విక్రయించుకునేవారు. ఇప్పుడు జిల్లాలోనే దళారులు పుట్టుకొచ్చారు. అధికార పార్టీ నేతల పేరుతో దందా సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారాలకు అలవాటు పడ్డారు. తనిఖీలు చేసే క్రమంలో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా 40 శాతం బియ్యం మార్కెట్‌కు వెళ్లిపోతున్నాయి. ప్రతినెలా జిల్లాలో సగటున 8 వేల టన్నుల బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. అందులో దాదాపు 3,200 టన్నులు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు తరలి పోతు న్నాయి. అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. లేదంటే రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారు.