Share News

వరాలు కురిపిస్తారా?

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:26 AM

కూటమి ప్రభుత్వం కొలువు తీరాక సీఎం చంద్రబాబు అధికారికంగా కైకలూరు నియో జకవర్గంలో సోమవారం తొలిసారిగా పర్యటించబోతున్నారు.

వరాలు కురిపిస్తారా?
సిద్ధమైన ప్రజావేదిక

కైకలూరు నియోజకవర్గంలో వెంటాడుతున్న సమస్యలు

అధ్వాన స్థితిలో డ్రెయినేజీ వ్యవస్థ..

మౌలిక సదుపాయాలు అంతంతే..

నియోజకవర్గ ప్రజల ఎదురుచూపులు

కూటమి ప్రభుత్వం కొలువు తీరాక సీఎం చంద్రబాబు అధికారికంగా కైకలూరు నియో జకవర్గంలో సోమవారం తొలిసారిగా పర్యటించబోతున్నారు. కలిదిండిలో జరిగే కార్యక్రమంలో 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన 4వేల ఎకరాలకు భూ హక్కు పత్రాలు, రీ సర్వే చేసిన భూములకు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అయితే నియోజకవర్గంలో దశాబ్దాల నుంచి పరిష్కారం కాని సమస్యలెన్నో ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. నాలుగు మండలాల్లో నిర్మించిన జగ నన్న కాలనీల్లో అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. సాగు, తాగునీరు, వంతెనలు, ఉప్పుటేరు సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. సీఎం ఏ వరాలిస్తారో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది.

– ఏలూరు–ఆంధ్రజ్యోతి

దశాబ్దాల డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

కైకలూరు నియోజకవర్గంలో నాలుగు మేజర్‌ డ్రెయిన్లు.. 16 మీడియం డ్రెయిన్లు, సుమారు 200 మైనర్‌ డ్రెయిన్లు ఉన్నాయి. అయితే రైతు లకు అవసరమైన సాగునీటి, మురుగునీటి వ్యవస్థల పరిస్థితి గత పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అన్న చందాన ఉంది. కృష్ణా తూర్పు డెల్టాకు శివారు ఉన్న కైకలూరు నియోజక వర్గంలో ఇరిగేషన్‌, డ్రెయినేజీల వ్యవస్థలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. దీంతో ఖరీఫ్‌ సీజన్‌లో నీరు అందదు.. ముంపు తప్పదు అన్న చందంగా పొలాలు పరిస్థితి ఉంది. సాగునీటి సంఘాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో క్షేత్రస్థాయిలో పనులు ఏమాత్రం జరగలేదు. సుమారు లక్షా 17వేల ఎకరాల ఆయకట్టుకు సరైన సాగునీటి, మురుగునీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడలేదు. కూటమి పాలనలో కొల్లేరు ముంపునకు దారీ తీస్తున్న మేజర్‌, మైనర్ల డ్రెయిన్ల ప్రక్షాళన చేయడానికి జలవనరులశాఖ చేపట్టిన ప్రతిపాదనలు కాగి తాల రూపంలో ఉన్నాయి. ఇటీవల రూ.3.50 కోట్ల నిధులిచ్చినా కాల్వల్లో గుర్రపు డెక్కను నిర్మూలించడానికే సరిపోయాయి. రెండు జిల్లాల మధ్యలో రవాణాశాఖ సౌకర్యం కోసం 1975లో పెద్దయడ్లగాడి వద్ద వంతెన నిర్మించారు.ఈ వం తెనకు 27 ఖానాలుండగా, 18 ఖానాలు పూడుకు పోగా 7 ఖానాలు పనిచేస్తున్నాయి. బుడమేరు నుంచి వచ్చే వరదనీరు సర్కార్‌ కాల్వ ద్వారా ఉప్పుటేరుకు సకాలంలో చేరడం లేదు. ఈ కారణంగా మండవల్లి, ఏలూరు మండలంలోని 15 గ్రామాలకు ముంపు తప్పడం లేదు.

కూలే దశలో వంతెనలు

ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ను సుమారు 20 పురాతన వంతెనలు శిథిలా వస్థలో చేరుకున్నా వాటికి మరమ్మతులు, కొత్త వంతెనల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాద నలు ఏమీ లేవు. 2014 నుంచి నియోజవర్గం లోని 14 వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ముదినేపల్లి మండలం పేరూరు వద్ద పోల్‌రాజ్‌ మెయిన్‌ డ్రెయిన్‌పై ఆర్‌అండ్‌బీ రోడ్డులో వంతెన కూలిపోయి ఆరేళ్లు గడిచినా అతీగతీ లేదు.

చుట్టూ నీరు ఉన్నా తాగునీటికి కొరతే

కొల్లేరు సరస్సు పక్కనే ఉన్న కైకలూరు నియోజకవర్గ వాసులకు తాగునీటి సమస్య తీరడం లేదు. సరస్సు కలుషితం కావడంతో ఆ ప్రాంతంలోని మంచినీటి వనరులు అధ్వానస్థితికి చేరాయి. పేద మఽధ్య, తరగతి ప్రజలు కూడా ఆర్వో ప్లాంట్ల ద్వారానే మంచినీటిని కొనుక్కొని తాగే పరిస్థితి వుంది. ఫిల్టర్‌ బెడ్లు ఎక్కడా పనిచేయడం లేదు. వాటిని నిర్వహించే ఆర్థిక స్థోమత గ్రామ పంచాయతీలకు లేనేలేదు.

మధ్యలో నిలిచిన ఉప్పుటేరు ప్రక్షాళన

కొల్లేరు పరీవాహక ప్రాంతంలో వరద ముప్పు నివారణకు కూటమి హయాంలో గతేడాది వరదల తర్వాత ఉప్పటేరు ప్రక్షాళనకు ప్రభుత్వం ఉప్పుటేరులోని ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టింది. ప్రక్షాళన పనులు కొంతవరకు చేసి వదిలేశారు. మళ్లీ వరదల సీజన్‌ ముంచు కొస్తున్నా.. ఇప్పటికీ ఆ పనులు పూర్తి చేయలేదు. ఉప్పుటేరు మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని చేపల, రొయ్యల చెరువుల తవ్వకాల వల్ల ఉప్పుటేరు వరదనీరు కిందికి పోకుండా ఖానాలు కుంచించుకుపోయాయి. అప్పట్లోనే మిత్రా కమిటీ ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు సాఫీగా సముద్రంలోకి వెళ్లాలంటే కొల్లేరు సరస్సులోకి ఛానలైజేషన్‌ చేయాలని, సర్కార్‌ కాల్వను అవకాశం ఉన్నంత వరకు వెడల్పు చేయాలని జువ్వి కనుమ ఆక్రమణలను తొలగించాలని, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్లు నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి రూ.కోట్లలో వ్యయం అవుతుందన్న నెపంతో ప్రభుత్వాలు వెనుకాడాయి. ఈ ప్రక్షాళన అంశాలను కొల్లేరులో పర్యటించిన సుప్రీం సాధికారత కమిటీ ముందు కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్యకారుల సంఘాల ప్రతినిధుల, రైతులు గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం ఇప్పటికే శూన్యమే.

నియోజకవర్గంలో కానరాని సఖ్యత

కైకలూరులో కూటమి పార్టీల మధ్య ఐక్యత అంతంత మాత్రంగానే ఉంది. టీడీపీ, జనసేన పార్టీల్లో అంతర్గత కుమ్మలాటలు ఎక్కువయ్యా యి. కొంతమంది బీజేపీ నేతల సహకారంతో వైసీపీ నేతలు తమ పనులు చక్కబెట్టుకుంటు న్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో కూట మి నేతలు సీఎం వస్తున్న సందర్భంగా ఐక్యత చాటుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

కలిదిండి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి):సీఎం చంద్రబాబు సోమ వారం కలిదిండిలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. కలిదిండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఏఎంసీ సమీపంలో ప్రజావేదికను ఏర్పాటు చేశారు. సభకు విచ్చేసే ప్రజలకు రక్షితనీరు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శిబిరాలు, వ్యవసాయ అనుబంధ శాఖల ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనకు ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌, ఆధ్వర్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌

ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10:45 గంటలకు కలిదిండి ప్రభుత్వ జూని యర్‌ కాలేజీ మైదానానికి చేరుకుంటారు.

10:45 నుంచి 10:55 వరకు ప్రజా ప్రతి నిధులు, అధికారుల స్వాగతం

11గంటలకు కలిదిండి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని 11:45 వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

11.55కి ప్రజావేదికకు చేరుకుని 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొల గిస్తున్న 4 వేల ఎకరాలకు భూ హక్కు పత్రాలు, రీ సర్వే జరిగిన కాళ్లపాలెం రైతులకు 600 పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తారు. స్టాల్స్‌ సందర్శిస్తారు.

2 గంటల నుంచి 2:50 వరకు రిజర్వ్‌డ్‌ సమయం.

2:55లకు మార్కెట్‌యార్డు సమీపంలో ఏర్పాటు చేసిన కేడర్‌ వేదికకు చేరుకుని 4.25 వరకు కేడర్‌ సమావేశంలో పాల్గొంటారు.

4:35కు కలిదిండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుని 4:40 హెలికాప్టర్‌లో తిరిగి ఉండవల్లి బయల్దేరి వెళతారు.

Updated Date - Aug 10 , 2026 | 12:26 AM