విమానం ఎగిరేనా
ABN , Publish Date - May 21 , 2026 | 12:35 AM
పూర్వ పశ్చిమగోదావరి జిల్లాకు నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటూ దశాబ్దాలుగా కలలు కంటున్నారు.
జిల్లా వాసుల చిరకాల కోరిక
నేడు భూములను పరిశీలించనున్న కేంద్ర బృందం
కమిటీ నివేదికే కీలకం ..ఇప్పటికే భూముల గుర్తింపు
1,123 ఎకరాల సేకరణకు ప్రభుత్వ ఆదేశం
పూర్వ పశ్చిమగోదావరి జిల్లాకు నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటూ దశాబ్దాలుగా కలలు కంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ భూముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని భావించింది. కానీ అక్కడ ఏపీ నిట్ వచ్చింది. దీంతో విమానాశ్రయం మరుగు నపడింది.రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అందులో భాగంగానే తాడేపల్లిగూడెంలోనూ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక చేసింది. కేంద్ర బృందం గురువారం తాడేపల్లిగూడెంలో పర్యటించనుంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఇప్పుటికే గుర్తించిన భూములను కేంద్రబృందం పరిశీలించనుంది. ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పర్యటిం చేందుకు రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విమానాశ్రయ అవకాశాలను, అవసరాలను గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వాస్తవానికి ఏపీ నిట్ ఏర్పడిన స్థలంలోనే గతంలో వాణిజ్య అవసరాలకు అవసరమైన విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. నాటి ప్రభుత్వం 2004–09 మధ్యలో పాత రన్‌వే ఆధారంగా చేసుకుని విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేసింది. కానీ అది నెరవేరలేదు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చివరకు తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో నిట్ ఏర్పడింది. కొత్త విమానాశ్రయం మరుగన పడింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదలిక వచ్చింది.
రెండు గ్రామాల్లో భూమి
తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో వెంకట్రామన్న గూడెం, జగన్నపేట రెవెన్యూ భూములను విమానాశ్రయం కోసం గుర్తించారు. రెండు గ్రామాల్లోనూ 1,123 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు నివేదిక పంపారు. అక్కడ ప్రస్తుతం భూ వినియోగ మార్పిడి నిలిచిపోయింది. కేంద్ర బృందం సానుకూలంగానే నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
అభివృద్ధికి అవకాశం
తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ప్రధాన రైలు మార్గం తాడేపల్లిగూడెం మీదుగానే వెళుతోంది. ప్రస్తుతం గుర్తించిన భూములకు సమీపంలోనే ఇరువైపులా ప్రధాన జాతీయ రహదారులున్నాయి. తాడాపల్లిగూడెం పట్టణానికి నాలుగు వైపులా నాలుగు లేన్‌ల రహదారులు విస్తరించి ఉన్నాయి. ఇక భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ముఖ్య మంత్రి చంద్రబాబు సైతం దీనిని పరిశీలించాలని ఆదే శాలు జారీచేశారు. రెండు పట్టణాల మధ్య వాహనాల రాకపోకలపై సర్వేకూడా నిర్వహించారు. పూర్శ పశ్చిమ గోదావరి జిల్లాకు నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం పట్టణానికి ఇతర ప్రాంతాలతో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. దానికితోడు జాతీయ స్థాయి విద్యా సంస్థ ఏపీ నిట్, అదే స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యాన విశ్వ విద్యాలయాలు ఇక్కడే ఏర్పాటయ్యాయి. తాడేపల్లి గూడెంలో కొద్దిపాటి విమానాశ్రయ భూములు ఇంకా అందుబాటులో ఉన్నాయి. వాటిలోనూ భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నన్నయ్య పీజీ క్యాంపస్ కూడా అభివృద్ది చెందనుంది. మరోవైపు వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా అగ్రగామిగా ఉంది. విదేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవు తున్నాయి. అయితే విలువ ఆధారతి వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి విమానాశ్రయం ఉపయుక్తంగా ఉంటుంది. కార్గో రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రైతులకు ఎంతగానో మేలు చేకూరనుందని ఆశిస్తున్నారు. కార్గో విమానాల్లో 20 టన్నుల నుంచి 150 టన్నుల దాకా సరకు రవాణా అవుతుంది. దీనివల్ల ఇక్కడే ఆక్వా ఉత్పత్తులకు విలువ ఆధారితను జోడిస్తే ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలుంటాయి.
పారిశ్రామికంగా ఎదుగదల
జిల్లాలో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. విమానాశ్రయం ఏర్పాటు చేస్తే పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పరిశ్రమ లకు తాడేపల్లిగూడెం విమానాశ్రయం ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలో ప్రైవేటు భూములను పరిశ్రమలకు మళ్లించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఎవరైనా భూములు ఇవ్వడానికి ముందుకొస్తే అనుమతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. ఆ మేరకు జిల్లాలో అధికారులు పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగు పడితేనే ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరనుంది. రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని అందు బాటు లోకి రానున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయ ఆశలు నెరవేరితే వ్యవసాయ, ఆక్వా ఆధారిత, ఇతర పరిశ్రమల అభివృద్ధికి ఉమ్మడి జిల్లాలో అపారమైన అవకాశా లుంటాయి. కేంద్ర బృందం నివేదిక ఆధారంగానే పౌర విమానయాన శాఖ తదుపరి చర్యలు తీసుకోనుంది.