టెన్షనెందుకు సర్!
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:00 AM
ఓటర్ల సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రకియపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి..
ఓటర్ల సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రకియపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి.. తమ ఓటు పోతుందనే భయం కూడా ఉంది. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. అందులో వివరాలు పూర్తి చేసి బీఎల్‌వోలకు అందించాలి. కానీ చాలామంది ఇప్పటివరకు వాటిని అందించలేదు.. సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం.. ఆ ఫారాలు పూర్తి చేసి డిజిటిలైజేషన్ చేయాల్సిన భాద్యత బీఎల్‌వోలదే.. కానీ చాలామంది సచివాలయాల్లో ఉండి ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో వేగం పుంజుకుంది. ఇప్పటి దాకా 98.2 శాతం మందికి ఎన్‌రోల్‌మెంట్ ఫారాలను అందజేశారు. ఓటర్లను డిజటైలేజేషన్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలో 61.73 శాతం మంది ఓటర్ల డిజిటి లైజేషన్ పూర్తయింది. ఈనెల 14వ తేదీవరకు డిజిట లైజేషన్ నిర్వహించనున్నారు. 21న ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అప్పటి నుంచి జూలై 20వ ఆగస్టు 20వ తేదీవరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలిస్తారు. సెప్టెంబరు 18 వరకు అభ్యంతరాల పరిష్కారానికి సమయం ఉంది. అదేనెల 22న తుది జాబితాను ఖరారు చేస్తారు. ఒకరికి రెండు ఓట్లు ఉండడం, నిబంధనలకు విరుద్ధంగా ఓటు కలిగి ఉంటే తొలగించేందుకే ఎన్నికల సంఘం సర్‌ను అమలు చేస్తోంది. ఉన్న ఓటర్లను తొలగిస్తారన్న అపోహ ప్రజల్లో ఉంది.అర్హత ఉన్న వారందరినీ ఓటర్ల జాబితాలో ఉంచాల్సిందే. లేదంటే ఎన్నికల సిబ్బంది బలైపోతారు. అందుకోసం పారదర్శకంగా సర్ ప్రక్రియను చేపడుతున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ ఏజంట్‌ల సహకారం తీసుకంటున్నారు.
ధీమాగా కూర్చోవద్దు
ఓటు ఉందని ధీమాతో ఉంటే రెండు చోట్ల ఓటు పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిఒక్కరూ తమ ఓటును మ్యాపింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.ఎన్నికల నమోదు ఫారమ్ ఇవ్వకపోతే స్థానికంగా రాజకీయ ఏజంట్‌ల సహకారం తీసుకోవచ్చు. వాటిని భర్తీ చేసి తిరిగి అధికారులకు ఇవ్వాలి. అప్పుడు ఓటును డిజిటలైజేషన్ చేయనున్నారు. వాస్తవానికి 2002 కంటే ముందు ఓటుహక్కు ఉన్నవారికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. తాము ఉన్నట్టు నిరూపించుకుంటే డిజిటైలేజేషన్ అయిపోతుంది. అలా కాకుండా 1987 తర్వాత 2004 ముందు జన్మించి ఓటుహక్కు పొందిన వారు మాత్రం తల్లిదండ్రుల్లో ఎవరో ఒక్కరి ఆధారం చూపాలి. లేదంటే వారి తల్లిదండ్రులైనా, దగ్గరి బంధువుల ఆధారాలను చూపించి నిరూపించుకోవాలి. 2004 తర్వాత జన్మించి ఓటు హక్కు పొంది ఉంటే తల్లిదండ్రులిద్దరి ఆధారాలను చూపించాలి.
కొత్త ఓటర్లకు అవకాశం
ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి సర్ ఉపయోగపడనుంది. సంబంధిత ఫారమ్ తీసుకుని భర్తీ చేయాలి. బీఎల్‌వోలకు అందజేస్తే ఓటు నమోదవుతుంది.
రెండు చోట్ల ఓటు ఉంటే నేరమే !
అటువంటి వారికి సర్‌తో చెక్
ఓటర్లు భారీగా తగ్గే అవకాశం ?
అత్తిలి, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ఓటర్ల జాబితాను సంస్కరిం చేందుకు ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంది. ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. రెండు ఓట్లు ఉంటే భారత ఎన్నికల చట్టం 1950లో సెక్షన్ 31 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికా రులు స్పష్టం చేస్తున్నారు. వివిధ కారణాలతో ఒకరు రెండు చోట్ల ఓటరుగా ఉంటున్నారు.ఎన్నికల సమయంలో ఒకచోట మాత్రమే ఓటు వేస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారిలో ఎక్కువ మంది సొంతూరులో ఓటరుగా ఉండేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో తాముంటున్న నగరం, పట్టణంలో కూడా ఓటరుగా నమోదు అవుతుంటారు. ఎన్నికల సమయంలో ఏదోఒక చోట ఓటుహక్కు విని యోగించుకుంటారు. కొందరు మాత్రం నివాసం ఉన్న చోట ఓటు వేసిన అనంతరం సొంతూరు వెళ్లి ఓటేస్తుంటారు.
ఇంటింటికి రాని బీఎల్‌వోలు
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క ఓటరుని బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు మూడుసార్లు కలుసుకోవాలి. కానీ చాలామంది కార్యాలయాలకే పరిమితం అవు తున్నారు. ఓటరుకు ఫోన్ చేసి పంచాయతీ కార్యాలయానికి రావాలని ఎన్యూమరేషన్ ఫారాలు సచివాలయంలో ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా అయితే సర్ కార్యక్రమం సక్రమంగా ఎలా పూర్తవుతుందని పలువురు అంటున్నారు.
సర్ పేరుతో అంగన్‌వాడీ కేంద్రాల మూత
మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు 50 శాతం పైగా మూతపడతున్నాయి. సర్ విధులకు అంగన్ వాడీ సిబ్బందిని కేటాయించారనే నెపంతో గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిం చాల్సి ఉండగా, అది సక్రమంగా అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నా రులు తల్లిదండ్రులు అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రశ్నిస్తుంటే మాకు పంచాయతీ కార్యాలయాల్లో డ్యూటీలు వేశారని చెబుతున్నారని వాపోతున్నారు.