ఏమయ్యారో.?
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:33 AM
ఒక కుటుంబంలో ఎవరైనా కనిపించకుండాపోతే ఆ కుటుంబం వేదన అంతా ఇంతా కాదు.
కొలిక్కిరాని అదృశ్యం కేసులు
కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
ఒక కుటుంబంలో ఎవరైనా కనిపించకుండాపోతే ఆ కుటుంబం వేదన అంతా ఇంతా కాదు. ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో తెలియని పరి స్థితి. తిరిగి వస్తారని అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటారు. బాలలు, యువకులు, మహిళలు, వృద్ధులు అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా వారి ఆచూకీ కానరావడం లేదు. ఎవరైనా మరణిస్తే ఒక్కరోజో రెండు రోజులో గుండెలు అవిసేలా రోదిం చి ఆ బాధను కాలక్రమేణ మర్చిపోయి వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుం టారు. కానీ అదృశ్యమైన వారి విషయం లో తెలియని హృదయ గాయం ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది.
ఏలూరు క్రైం, జూన్ 3(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అదృశ్యమవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారి కోసం వెతకడం ఒక ఎత్తు అయితే, అదృశ్యమైన వారిలో బాలిక లేదా మహిళ అయితే చుట్టుపక్కల వారి వ్యాఖ్యలు మరింత బాధ కలిగిస్తున్నాయి. అదృ శ్యమైన వారి గురించి సన్నిహితులు, బంధువు ల సాయంతో ఆచూకీ కోసం ప్రయత్నించే వారు కొందరు.. ఎవరికి చెప్పకుండా గాలించి ఫలితం లేక చివరకు పోలీసులను ఆశ్రయిస్తు న్నారు. 2024 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అదృశ్యం కేసులను పరిశీలిస్తే అదృశ్యమైన మహిళల్లో ఇప్పటి వరకు 34 మంది ఆచూకీ తెలియలేదు. ముగ్గురు బాలికల ఆచూకీ, ముగ్గురు బాలల ఆచూకీ, 68 మంది పురుషుల ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆ కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. అదృశ్యమైన వారు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుండగా ఇటీవల ఒక మహిళ హత్యకు గురైంది.
కొన్ని కేసుల్లో కావాలనే అదృశ్యం
ఇప్పటి వరకు అదృశ్యమైన కేసులను పోలీసులు విచారించగా కొన్ని కేసుల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. బాల, బాలికలయితే చదువుతో ఒత్తిడి, ఇంట్లో పనుల ఒత్తిడి, టీనేజ్‌లో ఉన్న యువతను మందలించ డంతో క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్లిపోతు న్నారు. సోషల్ మీడియా, సినిమాలు, టీవీల ప్రభావంతో కొంతమంది మహానగరాలకు వెళ్లి గొప్పవాళ్లు కావాలనే ఆలోచనతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. కొంతమంది విద్యా ర్థులు స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక వారే రైలో, ఇతర వాహనాలు ఎక్కి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. చివరకు వారి ఆచూకీ పోలీసులు కనుగొంటే ఒక పిట్ట కథ చెప్పేస్తు న్నారు. ఎవరో మత్తు మందు ఇచ్చి ఎత్తుకు పోయారని వారి నుంచి తప్పించుకుని వచ్చా నని చెబుతూ ఉంటారు. ఇక యువత, మహిళ లు ప్రేమ వ్యవహారాలతో అదృశ్యమవుతున్నారు. కుటుంబ కలహాలతో కొంతమంది తల్లులు తమ బిడ్డలను తీసుకుని వెళ్లిపోతున్నారు. మగవారు ఇదే విధంగా కుటుంబంలో కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.
మూడేళ్ల పరిస్థితి ఇది..
2024లో 281 మంది మహిళలు అదృశ్యం కాగా, 273 మందిని పోలీసులు గుర్తించారు. మరో ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కాలేదు. 2025లో 279 మంది అదృశ్యం కాగా, 264 మంది ఆచూకీ కనుగొన్నారు. 15 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఏడాది ఇప్పటివరకూ 137 మంది అదృశ్యం కాగా 126 మంది ఆచూకీ కనుగొన్నారు. ఇంకా 11 మంది ఆచూకీ కనుగొనాల్సి ఉంది.
బాలికలు: 2024లో 131 మంది అదృశ్యం కాగా అందరిని గుర్తించారు. 2025 లో 126 మంది అదృశ్యం కాగా 124 మందిని గుర్తించారు. ఇంకా ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఏడాది 33 మంది అదృశ్యం కాగా 32 మందిని గుర్తించారు. ఒక బాలిక ఆచూకీ తెలియాల్సి ఉంది.
బాలురు: 2024లో 19 మంది అదృశ్యం కాగా అందరిని గుర్తించారు. 2025 లో 17 మంది అదృశ్యం కాగా అందరిని గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 9 మంది అదృశ్యం కాగా ఆగురుగురిని గుర్తించారు. ముగ్గురి బాలురు ఆచూకీ తెలియాల్సి ఉంది.
పురుషులు: 2024లో 164 మంది అదృశ్యం కాగా 145మందిని ఇంకా 19 మంది ఆచూకీ తెలియాల్సిఉంది. 2025లో 208 మంది అదృశ్యం కాగా 173 మందిని గు ర్తించారు. ఇంకా 35 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఏడాది 59 మంది అదృశ్యం కాగా 45 మందిని గుర్తించారు. 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
కొన్ని కేసుల్లో గంటల వ్యవఽధిలోనే..
అదృశ్యమైన వారిని గంటల వ్యవఽధిలోనే పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటనలూ ఉన్నాయి. ఎస్పీ కేపీఎస్ కిశోర్ పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ముఖ్యంగా డ్రోన్ కెమెరాలతో ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించడం, ఇంకో వైపు పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేయించడం, సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించడం ద్వారా అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొన్నారు. ఆపరేషన్ ట్రేస్డ్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా నిర్వహించగా ఏలూరు జిల్లాలో 19 మంది ఆచూకీని కనుగొన్నారు. ఆరేళ్ల క్రితం ఏలూరులో భర్తపై గొడవపడి వరంగల్ వెళ్లిపోయి తన పిల్లలతో జీవిస్తున్న ఒక మహిళను పోలీసులు కనుగొని తీసుకొచ్చారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి తన భర్త (ఆటోడ్రైవర్) వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఏలూరు నగరంలో శక్తి టీమ్ డ్రోన్ కెమెరాలతో పరిశీలించి చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న యువతిని గుర్తించి కాపాడారు. ఆ యువతి డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై నేడు తన ఇద్దరు పిల్లలతో ప్రభుత్వ ఉద్యోగినిగా జీవిస్తోంది.