Share News

ముందు చూపేది..?

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:23 AM

ఏటా జూలై నుంచి సెప్టెంబరు వరకు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల ప్రజలకు గోదావరి వరదల ముంపు పొంచి ఉంటుంది.

ముందు చూపేది..?
తాటుకూరుగొమ్ము వద్ద నిండుగా గోదావరి

ముంపు మండలాల ప్రజల్లో ఆందోళన

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించని అధికార యంత్రాంగం

వరదలు వస్తే చెట్టుకొకరు.. పుట్టకొకరు వెళ్లాల్సిందేనా..!

వేలేరుపాడు/కుక్కునూరు, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి):

ఏటా జూలై నుంచి సెప్టెంబరు వరకు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల ప్రజలకు గోదావరి వరదల ముంపు పొంచి ఉంటుంది. భద్రాచలం వద్ద 43 అడుగులు గోదావరి నీటిమట్టం చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండు, 53 అడుగులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. అధికారులు అప్పటికప్పుడు మాత్రమే హెచ్చరికలు జారీ చేసి రక్షణ చర్యలు చేపడుతున్నారు. కేవలం బియ్యం నిల్వలు, ఇతరేతర నిల్వలు కొన్ని స్టాక్‌ పాయింట్ల వద్ద ఉంచుతున్నారు. ముందస్తుగా ఏ చర్యలు తీసుకోవడం లేదు. ఏటా వరద కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం గోదావరికి వరదలు వచ్చే సమయం కావడంతో అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే వరద బాధితులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా తరలిపోయే పరిస్థితి ఉంది.

జూలై నెల వస్తుందంటేనే ముంపు మండలాల ప్రజల గుండెల్లో గుబులు రేగుతుంది. గతంలో వలే గోదావరికి వరదలు వస్తే ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడ తలదాచుకోవాలనే బెంగ ప్రతీ ఒక్కరిలోనూ ముందు గానే కనపడుతోంది. కొన్నేళ్లుగా జూలై రెండోవారం నుంచి గోదావరికి వరదలు రావడం పరిపాటిగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి క్రమం తప్పకుండా ఏటా వరదలు వస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరితే ఈ ప్రాంతాలకు వరద భయం మొదలయ్యేది. కానీ ప్రాజె క్టు నిర్మాణం చాలావరకు పూర్తవుతున్న కారణంగా నీటిమట్టాల అంచనాలు తలకిందులవుతున్నాయి. 30 అడుగులకు చేరుకోగానే మండలంలోని ఎద్దువాగు వంతెన ముంపునకు గురవుతోంది. ఇది దాదాపుగా వర్షాకాలం ముగిసేంత వరకు ముంపులోనే ఉంటోంది. దీని కారణంగా కోయిదా దాని 15 పరిసర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి తీవ్ర అవస్థల పాలవుతున్నారు. అలాగే 40 అడుగులకు చేరుకోగానే మండలంలోని మరో 20 గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టి రహదారులను ముంచివేస్తోంది. ఆపై వరద వస్తే ఆయా గ్రామాల్లోని ప్రజలను పడవలు, లాంచీల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించడం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా ఎన్నో ఆటం కాలు ఎదురవుతున్నా అధికార యంత్రాంగంలో ముందస్తు ప్రణాళిక లోపిస్తోంది.

అధికారుల నిర్లక్ష్యం

అనవాయితీగా గోదావరికి వరదలు వస్తాయని తెలిసినా ఆయా గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తు న్నాయి. వరదలు చుట్టుముట్టే తరుణంలో ఆయా గ్రామాల ప్రజలు తమకు దగ్గరగా ఉన్న కొండగుట్టల పైనే ఆశ్రయం పొందుతున్నారు. ముందుగానే కొండ గుట్టలపై చిన్నపాటి గుడిసెలు వేసుకుని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. రుద్రమ్మకోట, కోయిదా, కాచరం, చిగురుమామిడి, తదితర గ్రామాల ప్రజలు ఇలా గుట్టల పైకి చేరుకుంటారు. వేలేరుపాడు, తాటుకూరుగొమ్ము, నడిమిగొమ్ము, తిరుమలాపురం, నాళ్లవరం, గ్రామాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటారు.

గాలికి వదిలేస్తున్నారు..

పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు, వైద్యం అందిస్తున్నప్పటికి గుట్టలపై ఆశ్రయం పొందుతున్న వారిని గాలికి వదిలేస్తున్నారు. గోదావరి వరద చుట్టు ముట్టి కలుషిత నీటినే వాడుకోవాల్సి వస్తుంది. ఆహా రానికి ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. గుట్టలపై నివాసాలు ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లో తాగునీటి బోర్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌తో సహా అధికారులు చెబుతూనే ఉన్నా ఇప్పటి వరకు ఒక్కచోట కూడా బోర్లు వేసిందిలేదు. వరద బాధితులకు తాత్కాలిక గుడిసెలపై కప్పుకునేందుకు టార్ఫాలిన్లను సకాలంలో ఇవ్వకుండా వరదలు తగ్గిన తర్వాత ఇచ్చిన ఘటన లు గతంలో జరిగాయి. గుట్టలపై ఆశ్రయం పొందుతు న్న వారికి విద్యుత్‌ సౌకర్యం ఉండక చీకటిలోనే గడ పాల్సి వస్తుంది. ఇందుకోసం ముందుగానే ఆయా ప్రాంతాల్లో జనరేటర్లను వాటికి అవసరమైన డీజిల్‌ను అందుబాటులో ఉంచాల్సి ఉండగా వరదలు చుట్టు ముట్టిన కొన్నిరోజులకు గానీ జనరేటర్లు పంపించడం లేదు. ఇలా వరదల కారణంగా వరదలు ఉన్నన్నినాళ్లు ప్రజలు కష్టాలతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

కుక్కునూరు మండలంలోని కొన్ని గ్రామాలను ఏటా గోదావరి చుట్టుముడుతుంది. 41.15 కాంటూరు లెవెల్‌లో ఉన్న గొమ్ముగూడేంకు పోలవరం పరిహారం అందించారు. ఇంకా వారిని పునరావాస కాలనీకి తరలించలేదు. ఈ క్రమంలో ఏటా గోదావరి వరద ముంపు రాగానే వారిని గ్రామం ఖాళీ చేయించి సుర క్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. లచ్చిగూడెం గ్రామ గిరిజనులు గ్రామ సమీపంలోని గుట్టలపైకి ఎక్కి తల దాచుకుంటారు. ఇటువంటి గ్రామాలను ముందే గుర్తించి వారికి టార్ఫాలిన్లు, జనరేటర్లు, మంచి నీళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు వంటివి ముందస్తుగానే ఏర్పాటు చేయాలి. ఆహార నిల్వలు పడవలు, బృందా లు ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వరదలు వచ్చినప్పుడు హడావిడి పడేకంటే ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలని వరద బాధితులు కోరుతున్నారు.

బలహీనంగా ఏటిగట్లు

పోలవరం : గోదావరికి వరద సీజను ప్రారంభం కానుంది. కానీ ఏటిగట్ల పరిరక్షణకు అధికారులు ఏ చర్యలు తీసుకోలేదు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే దిగువ నుంచి పోలవరం మండలం మహాలక్ష్మీదేవి పేట వరకు ఏటిగట్లు పలుచోట్ల బలహీనంగా మారిం ది. ఉధృతంగా వరదలు వస్తే హడావిడిగా ఇసుక బస్తాలు, సర్వేబాదులు, వెదురు తడికలతో తాత్కాలిక పరిష్కారాలు చేస్తున్న జిల్లా యంత్రాంగం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వేకు ఇరువైపులా రివిట్‌మెంట్‌ నిర్మించక పోవడం వల్ల స్పిల్‌ ఛానల్‌కి ఆనుకుని ఉన్న మహానందీశ్వర స్వా మి శివక్షేత్రం గట్టు ఆలయ విశ్రాంతి భవనం పిల్లర్ల వరకు కోతకు గురైంది. ఎన్నో ఫిర్యాదులు చేయగా రాళ్లతో కొంతమేర రక్షణ చర్యలు చేసినా స్పిల్‌వే నుంచి వచ్చే వరద జలాల తాకిడికి అవి గోదావరిలో కొట్టుకుపోయి భవనం వరద నీటిలోకి పడిపోయే అవకాశాలు కనిపిస్తు న్నాయి.

పట్టిసీమ ఫెర్రీ రేవులో కొవ్వాడ కాలువ అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ వరద జలాల తాకిడి కి స్లూయిజ్‌ స్పిల్‌ ఛానల్‌ ఎడమ గట్టు పూర్తిగా కోతకు గురై పంచాయతీ భవనం స్పిల్‌ ఛానల్‌లోకి పడిపోయే పరిస్థితి వచ్చి ఆరేళ్ళయ్యింది. అప్పటి నుంచి పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల సమీక్షలకు వచ్చిన జిల్లా కలెక్టర్లు, ఉత్సవ కమిటీ చైర్మన్‌, జంగారెడ్డిగూడెం ఆర్డీవో అఖండగోదావరి రివర్‌ బండ్‌ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు, కొవ్వాడ అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. రానున్న వరదల సీజనులో ఆ పంచాయతీ భవనం కూడా గోదావరి వరద నీటిలోకి పడిపోయే అవకాశాలున్నాయి.

పోలవరం మండల కేంద్రంలో పాత పోలవరం నుంచి యడ్లగూడెం వరకు మూడున్నర కిలోమీటర్ల మేర బంకమట్టితో నిర్మించిన నెక్లెస్‌ బండ్‌కి గడిచిన ఆరేళ్ల నుంచి వరదల సీజనులో దెబ్బతిన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉండగా రెండు కిలోమీటర్ల మేర రాళ్లతో రక్షణ చర్యలు చేశారు. మిగిలిన ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఆంజనేయస్వామి ఆలయ రేవు నుంచి యడ్లగూడెం వరకు ఏ రక్షణ చర్యలు చేపట్టలేదు.

పోలవరం నుంచి మండల పరిధి మహాలక్ష్మిదేవిపేట వరకు పట్టిసీమ వీరభద్రపురం రేవు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రేవు, పట్టిసీమ ఇసుకర్యాంపు కోత గట్టు, కొత్తపట్టిసీమ జోడు చింతల వద్ద గట్టు, గూటాల కొండ్రువీది రేవుగట్టు, మహాలక్ష్మీదేవిపేట ఇసుక ర్యాంపు కోతగట్టు వద్ద ఏటిగట్లు బలహీనంగా మారి ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిలో మహాశివరాత్రి ఉత్సవాల కోసం ఏటిగట్లను తొలగించిన ప్రాంతాల్లో సంబంధిత కాంట్రాక్టర్లు, పట్టిసీమ, గూటాల ప్రాంతాల్లో ఇసుక ర్యాంపుల నిర్వాహకులు తొలగించిన ఏటి గట్లకు తాత్కాలికంగా తూతూ మంత్రంగా కొన్ని చోట్ల మట్టితో పూడ్చారు, మరికొన్ని చోట్ల పూడ్చకుండా వదిలేశారు. అవికూడా వరద సీజనులో ప్రమాదకరంగా మారుతున్నాయి. ‘ఏటిగట్టు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకున్నాం. ఇసుక ర్యాంపుల కోసం చేసిన గండ్లను వరదల సమయాల్లో పూడుస్తా’మని అఖండ గోదావరి రివర్‌ బండ్‌ ఏఈ మణికంఠ పేర్కొన్నారు. ‘అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌ స్పిల్‌ ఛానల్‌కి ఇరువైపులా రివిట్‌మెంట్‌ కోసం రెండుకోట్ల బడ్జెట్‌తో ప్రభుత్వానికి నివేదికలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తా’మని కొవ్వాడ కాలువ రిజర్వాయర్‌ ఏఈ రాహుల్‌ భాస్కర్‌ తెలిపారు.

Updated Date - Jun 28 , 2026 | 12:23 AM