పదవీ కాలం ముగుస్తోంది గౌరవ వేతనం ఏదీ?
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:42 AM
మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యుల ప్రదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. వారికి మూడేళ్లకు పైగా గౌరవ వేతనం చెల్లించలేదు.
తణుకు రూరల్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యుల ప్రదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. వారికి మూడేళ్లకు పైగా గౌరవ వేతనం చెల్లించలేదు. 2021 సెప్టెంబరు లో జిల్లాలో పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. వారికి నెల నెలా గౌరవ వేతనం చెల్లించకపోవడం గౌరవం ఇవ్వకపోవడంగా భావిస్తున్నారు. ప్రతీ సమావేశంలో సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ సభ్యులకు నెలకు రూ.3 వేలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం చెల్లించాలి. ప్రస్తుతం 60 నెలలు గడుస్తున్నా మొదటిలో పలు దఫా 22 నెలలు మాత్రమే దఫదఫాలుగా గౌరవ వేతనం అందించారు. 38 నెలల వేతనం ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలతో పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో కొన్ని మండల పరిషత్‌లు ఈనెలలో సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేసుకుని వీడ్కోలు సభ నిర్వహించనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 48 మంది మండల పరిషత్‌లకు సంబంధించి ఎంపీపీలకు, జడ్పీటీసీ సభ్యులకు రూ.6 వేలు చొప్పున 38 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. సుమారు 800 మంది పైగా ఎంపీటీసీ సభ్యులకు రూ.3 వేలు చొప్పున చెల్లించవలసి ఉంది. మొత్తం 1,09,44,000 బకాయి చెల్లించాలని స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంక రవీంద్రనాథ్‌ను పలు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు కలసి వినతిపత్రం అంజేశారు.