సీఆర్‌ఎఫ్ నిధులెక్కడ ?
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:19 AM
కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం కేంద్ర రహదారి నిధి (సీఆర్‌ఎఫ్) నుంచి రూ.100 కోట్లు మంజూరు చేసింది. లోసరి నుంచి భీమవరం మీదుగా తాడేపల్లి గూడెం వెళ్లే రహదారి అభివృద్ధికి నిధులు వెచ్చించాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే పనులు
ఎదురుచూస్తున్న అధికారులు
లోసరి నుంచి భీమవరం–తాడేపల్లిగూడెం రహదారి అభివృద్ధి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం కేంద్ర రహదారి నిధి (సీఆర్‌ఎఫ్) నుంచి రూ.100 కోట్లు మంజూరు చేసింది. లోసరి నుంచి భీమవరం మీదుగా తాడేపల్లి గూడెం వెళ్లే రహదారి అభివృద్ధికి నిధులు వెచ్చించాల్సి ఉంది. కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులు దీనిపై ప్రకటన చేశారు. రహదారి అభివృద్ధి చెందితే కుదుపులతో వెళ్లే రహదారిలో సాఫీగా రాకపోకలు చేయవచ్చంటూ ప్రయాణికులు ఆశపడ్డారు. నాణ్యమైన రహదారితో పాటు, ఇరువైపులా విస్తరించేలా కేంద్రం నిధులు కేటాయించింది. ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇస్తేనే టెండర్లకు అవకాశం ఉంటుంది. నెలలు గడచిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. వైసీపీ హయాంలో సీఆర్‌ఎఫ్ నిధులతో రాష్ట్రంలో రహదారులు నిర్మించారు. నిధులను దారి మళ్లించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దాందాపు రూ.300 కోట్లు మేర పెండింగ్‌లో ఉండిపోయినట్టు లెక్కలు కట్టారు. వాటిని పరిష్కరించకుండా కొత్తగా సీఆర్‌ఎఫ్ నిధులకు అనుమతి ఇస్తే ఇబ్బందులు పడతామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రహదారి అభివృద్ధి కోసం తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మధ్య రాకపోకలు సాగించాలంటే ఇబ్బందికరంగా మారింది. రహదారులు అభివృద్ధి చేస్తున్నా ఒక్క వర్షానికే దెబ్బతింటున్నాయి. గరగపర్రు నుంచి యండగండి వరకు నిర్మించిన రహదారి గడచిన రెండేళ్లనుంచి భద్రంగానే ఉంది. ఆ స్థాయిలోనే యండగండి నుంచి పిప్పర వరకు రహదారి విస్తర్ణతో పాటు పునర్నిర్మించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. లోసరి నుంచి భీమవరం వరకు రహదారిని అభివృద్ధి చేయనున్నారు. పట్టణంలో ఉండి రోడ్డు నుంచి బీవీరాజు సర్కిల్ వరకు, భీమవరం నుంచి గొల్లల కోడేరు వరకు నాలుగు లేన్‌ల రహదారిని విస్తరించనున్నారు. అందుకోసం మొత్తంపైన కేంద్రం నుంచి రూ.100 కోట్లు రాబట్టారు. నిధులను రప్పించడంలో మంత్రి వర్మ ప్రయత్నం ఉంది. ఎమ్మెల్యే అంజిబాబు సైతం ఇదే రహదారిపై ఆశలు పెట్టుకున్నారు.తన హయాంలో భీమవరం పట్టణానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సునాయాసంగా రాకపోకలు సాగించేలా రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు.
పరిపాలనా అనుమతి ఇస్తేనే టెండర్లు
కేంద్రం సీఆర్‌ఎఫ్‌లో కేటాయించిన నిధులను వందశాతం చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి భారం ఉండదు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు మంజూరైపోతాయి. వైసీపీ హయాంలో చేపట్టిన పనులకు ఇప్పటిదాకా బిల్లులు చెల్లించలేకపోతున్నారు. అప్పట్లో నిధులు దారిమళ్లాయన్న విమ ర్శలున్నాయి. వాటిని సర్దుబాటు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం తంటాలు పడుతోంది. పాలకొల్లు నుంచి మార్టేరు వరకు సీఆర్‌ఎఫ్ నిధులతోనే రహదారిని అభివృద్ధి చేశారు. ఇప్పటిదాకా బిల్లులు చెల్లించలేదు. బిల్లులు చెల్లించకుండా కొత్త రహదారులకు అనుమతి ఇస్తే కాంట్రాక్టర్లు కోర్టుకు వెళుతున్నారు. దాంతో కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. కేంద్రమంత్రి వర్మ ఆర్‌అండ్‌బీ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. పరిపాలనా అనుమతులు ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఒకసారి నిధులు మంజూరైతే ఎప్పుడైనా రహదారి వేసుకోవచ్చు. జిల్లా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిధులు కేటాయించా ల్సిన అవసరం ఉందంటూ స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పాటైన తర్వాత పెద్దగా మౌలిక వసతులు కల్పించలేదు. కేంద్రం వందశాతం భరించే సీఆర్‌ఎఫ్ నిధులను ప్రాధాన్యతా అంశంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.