సర్ చార్జీలేవీ ?
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:44 AM
ప్రభుత్వం స్థానిక సంస్థలకు ట్రాన్స్‌ఫర్ డ్యూటీ (సర్‌చార్జి) నిధులు జమచేయడం లేదు.ఏకంగా 26 నెలల నుంచి నిధులు విడుదల కాక స్థానిక సంస్థల్లో ప్రగతి పడకేసింది.
జాడలేని ట్రాన్స్‌ఫర్ డ్యూటీ నిధులు
22 నెలలుగా బకాయిలు
పంచాయతీ, మునిసిపాలిటీల్లో నిలిచిన అభివృద్ధి పనులు
గత డిసెంబర్ వరకూ ప్రభుత్వానికి
స్టాంప్ డ్యూటీ చెల్లింపు
తాడేపల్లిగూడెం రూరల్, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం స్థానిక సంస్థలకు ట్రాన్స్‌ఫర్ డ్యూటీ (సర్‌చార్జి) నిధులు జమచేయడం లేదు.ఏకంగా 26 నెలల నుంచి నిధులు విడుదల కాక స్థానిక సంస్థల్లో ప్రగతి పడకేసింది. నిధులన్నీ ప్రభుత్వ ఖజానాకు జమయినా మున్సిపాలి టీలకు, పంచా యతీలకు విడుదల కాకపోవడంతో నిధుల లేమితో స్థానిక సంస్థలు డీలా పడిపోయాయి. పారిశుద్ధ్య పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రూ.145 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
1.5 శాతం స్థానిక సంస్థలకే
మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలో ఉండే ఇళ్లు, ఇళ్ల స్థలాలు అపార్ట్‌మెంట్‌లు, భూముల క్రయ విక్రయాలు జరిగితే 1.5 శాతం బదిలీ సుంకం (ట్రాన్స్‌ఫర్ డ్యూటీ) స్థానిక సంస్థల ఖాతాలకు జమ చేయాలి. ఉదాహరణకు ఒక స్థిరాస్తి రూ.1 కోటికి విక్రయిస్తే అందులో 1.5 శాతం అంటే రూ.1.5 లక్షలు ఆస్తి పరిధిలో ఉన్న పంచాయతీ లేదా మున్సిపాలిటీలకు ఇవ్వాలి. పంచాయతీ పరిధిలో జరిగే ఆస్తుల విక్రయాలకు సంబంధించి నిష్పత్తి ప్రకారం పంచాయతీ లతో పాటు మండల, జిల్లా పరిషత్ ఖాతాకు జమచేయాలి. ప్రతీ రిజిస్ట్రేషన్‌కు కచ్చితంగా నిర్ణయించిన శాతం మేర స్థానిక సంస్థలకు జమ కావాల్సిందే. జనవరి 2024 నుంచి మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్‌లకు ఈ నిధులు జమ కావడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి స్టాంప్ డ్యూటీకి సంబందించిన వివరాలను ఖజానా శాఖకు డిసెంబర్ 2025 వరకూ వివరాలు, వాటి సొమ్ములను జమ చేసినా నేటికీ డిసెంబర్ వరకూ అయిన పెండింగ్ సొమ్ము ఖజానా శాఖ నుంచి స్థానిక సంస్థలకు జమ కాలేదు. ముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆరునెలల పెండింగ్ కూడా నేటికీ జమ కాలేదని స్థానిక సంస్తల అధికారులు గగ్గోలు పెడుతున్నారు.
స్థానిక సంస్థల్లో నిధుల కొరత
పంచాయతీలైనా, పట్టణాలైనా ప్రజల నుంచి వసూలు చేసిన ఇంటి పన్నులు, కుళాయి పన్నుల ఆధారంగా పాలన సాగిస్తున్నాయి. అవి సిబ్బంది జీతాలు చెల్లించడానికే సరిపోక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సిర్థాస్తి క్రయ విక్రయాలపై స్థానిక సంస్థలకు వచ్చే 1.5 నిధులను మూడు భాగాలుగా విభజించి మూడో వంతు పంచాయితీలకు, ఒకవంతు మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు జమ చేస్తారు. ఈ నిధులతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేయడానికి వెసులుబాటు ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో క్రయవిక్రయాల సర్ చార్జీ మొత్తం పురపాలక ఖాతాకే జమ చేస్తారు. స్థానిక సంస్థలకు ఖజానా శాఖ నుంచి ఈ నిధులు జమ కావాలంటే ప్రభుత్వ అనుమతి ఇవ్వాలి.
ట్రాన్స్‌ఫర్ డ్యూటీ అంటే
భూములు, స్థలాలు,ఇళ్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు, అమ్మకాల సమయంలో రిజిస్ర్టేషన్ ప్రక్రియలో ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీ వసూలు చేస్తుంది. ఇందులోనే ట్రాన్స్‌ఫర్ డ్యూటీ (సర్‌చార్జి) కూడా వసూలు చేస్తారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వం నిబంధనల ప్రకారం పంచా యతీలు, మునిసి పాలిటీలు వంటి స్థానిక సంస్థలకు కేటాయిస్తుంది. ఈ నిధులను తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రెయినేజీలు, రహదారుల నిర్వహణ వంటి మౌలిక పనుల కోసం వినియోగించాలి.