కొల్లేరును ఏంచేస్తారో?
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:01 AM
కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు త్వరలో ఫలించనున్నాయి.
ఢిల్లీలో సీఈసీకి నివేదిక..
ప్రజల కష్టాలను వివరించిన ఉన్నతాధికారులు
ప్రభుత్వం కృషి ఫలిస్తుందని ఆశ.. ప్రజల్లో ఉత్కంఠ
కైకలూరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి):కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు త్వరలో ఫలించనున్నాయి. సున్నితమైన కొల్లేరు అంశం సుప్రీంకోర్టు సాధికార కమిటీ పరిధిలో ఉండడంతో ఇరవై ఏళ్లుగా ఎలాంటి పరిష్కా రానికి నోచుకోలేదు. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని పదే పదే చెప్పిన మాటకు కట్టుబడి ఆశించిన ఫలితాలు సాధించేందుకు కృషి చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టు సీఈసీని ఏర్పాటు చేసింది. ఈ కమి టీ కొల్లేరులో మూడు రోజులపాటు పర్యటించ డంతో సమస్య పరిష్కారం వైపు తీసుకువెళ్లారు. ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పంచమట్ల ధర్మరాజు, చింత మనేని ప్రభాకర్, బడేటి చంటి కొల్లేరు ప్రజలను ఆదుకునేందుకు చేసిన కృషితోనే నేడు సమస్య పరిష్కారానికి దారిచూపింది. కూటమి ప్రభు త్వం కొల్లేరు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం కేబినెట్, అసెంబ్లీలో తీర్మానం చేసి పక్షుల తోపాటు మనుషులను గుర్తించాలని కోరడంతో శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేశారు.
నివేదిక తయారీ.. అందజేత
2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్‌లో అభ యారణ్య పరిధిలోని 154 జలగం వెంగళరావు సొసైటీలు, జిరాయితీ భూములు, డీఫారం పట్టా భూములు 20 వేల ఎకరాలను కొల్లేరు ప్రజలు తిరిగి అందించి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదే అంశాన్ని సీఈసీ కమిటీకి అందజేయడంతో వారి ఆదేశాల మేరకు కొద్ది రోజులుగా కొల్లేరుపై అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించి కమిటీకి కావాల్సిన నివేదికను తయారుచేశారు. దీనిని తీసుకుని ఢిల్లీలోని సీఈసీ కమిటీకి మంగళ, బుధవారాల్లో అంద జేసి వారి సందేహాలను తీర్చడమే గాక మరో సారి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే సానుకూల మైన పరిణామాలు వస్తాయని కొల్లేరు ప్రజలు, ఈ ప్రాంత నాయకులు ఆశిస్తున్నారు. ఈ కమిటీ తయారుచేసిన నివేదిక కోసం కొల్లేరులో రీసర్వే చేపట్టి గ్రామాల సరిహద్దులను నిర్ధారించారు. సరస్సులోని పంట, మురుగు కాలువలు ప్రజల మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యల పై పూర్తిస్థాయిలో నివేదికను రూపొందించారు.
ఈ నివేదిక పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, వైల్డ్‌లైఫ్ ఛీఫ్ కన్జర్వేటర్ ఎన్.నాగేశ్వరరావు, ఏలూరు డీఎఫ్‌వో డాక్టర్ త్రిముర్తులురెడ్డి సీఈ సీకి అందించారు. దీనిపై తీవ్రస్థాయిలో ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా గత ఇరవై ఏళ్లుగా కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులు, వారు పడుతున్న ఇబ్బందులు, రోడ్లు, రవాణా, తాగు నీటి సమస్య, గృహాల నిర్మాణంతోపాటు మరిన్ని వసతులు, జీవనోపాధి కల్పించాలన్న ప్రయత్నంపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం.
కొల్లేరు ప్రజల్లో ఉత్కంఠ
అటవీ అధికారులు కొల్లేరు సరస్సుపై నివేదికను సీఈసీకి అందజేశారని తెలియడంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. తమ సమస్య పరిష్కారమైతే జీవన రూపురేఖలు మారతాయని, వలసలు వెళ్లకుండా గ్రామాల్లోనే ఉండి తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని కొల్లేటి శ్రీపెద్దింటి అమ్మ వారిని వేడుకుంటున్నారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ కృషి ఫలించి తమ కష్టాలు తీరాలని కోరుతున్నారు. కొల్లేరు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఈ కమిటీ నివేదికపైన రెండు రోజులుగా ప్రజలు చర్చిస్తున్నారు.