Share News

జడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్నారా ?

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:32 AM

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రేసులో ఉన్న వారంతా ఉండి నుంచి నామినేషన్‌లు వేస్తున్నారు.

జడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్నారా ?

ఉండి నుంచి పోటీ చేయించేలా ప్లాన్‌ !

నర్సాపురం టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు నామినేషన్‌ వేసేందుకు సిద్ధం

సాంకేతిక ఇబ్బందులతో వాయిదా

నేడు వేసేందుకు సన్నాహాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రేసులో ఉన్న వారంతా ఉండి నుంచి నామినేషన్‌లు వేస్తున్నారు. చైర్మన్‌ అభ్యర్థిపై కూటమి అధిష్ఠానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశం, జనసేన మధ్య చైర్మన్‌ పదవులు పంపకాలు జరగాల్సి ఉంది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థుల విషయంలో కూటమిలో సయోధ్య కుదిరింది.జిల్లా పరిషత్‌ చైర్మన్‌ల పంపిణీ జరగాలి. ఇప్పటిదాకా అధిష్ఠానం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. దాంతో జిల్లా నుంచి చైర్మన్‌ ఆశించే నాయకులు నామి నేషన్‌లు వేస్తున్నారు. విత్‌డ్రా సమయానికి ఇంకా సమయం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి నామి నేషన్‌ గడువు ఇంకా ఒకరోజు మిగిలి ఉంది. జడ్పీటీసీలంతా భీమవరం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద నామినేషన్‌లు వేస్తున్నారు. నర్సాపురం తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌ పొత్తూరి రామరాజు ఉండి జడ్పీటీసీగా గురువారం నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామీణ ప్రాంతంలో ఓటు ఉండాలి. కానీ సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో నామినేషన్‌ వాయిదా వేసుకున్నారు. శుక్ర వారం వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు స్థానికంగా తెలుగుదేశం నాయకుడు కృష్ణంరాజు నామినేషన్‌ వేశారు. తొలిరోజు బుధవారం జనసేన నుంచి పీవీఎల్‌ నరసింహరాజు నామినేషన్‌ దాఖలు చేయడంతో ఇప్పుడంతా ఉండిపైనే దృష్టి పెడుతున్నారు. కూటమి నాయకత్వం కూడా ఒక ప్రతిపాదనకు వచ్చింది. జిల్లా పరి షత్‌ రేసులో ఉన్నట్టయితే వేర్వేరు చోట్ల కాకుండా ఉండిలోనే వేసేలా సూచించారు. ఆ మేరకు చైర్మన్‌ అభ్యర్థులు నామినేషన్‌లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఐదు చోట్ల అవకాశం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని జనరల్‌ కేటాయించారు. జిల్లాలో ఐదు జడ్పీటీసీ స్థానాలు మాత్రమే జనరల్‌ అభ్యర్థులకు అందు బాటులో ఉన్నాయి. ఉండి, పాలకోడేరు, పెంటపాడు, పెనుమంట్ర, గణపవరం మండలాలు జనరల్‌కు వెళ్లాయి. పెనుమంట్ర, పెంటపాడు పరిధిలో స్థానిక రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుని అక్కడ అభ్యర్థులను కూటమి రంగంలోకి దింపింది. నామినేషన్‌లు విత్‌డ్రాకు సమయం ఉంది. ఈ నెల 27 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అంతలోగా కూటమి అధిష్ఠానం జిల్లా పరిషత్‌ చైర్మన్లపై ఒక నిర్ణయానికి రానుంది. ఆ మేరకు ఉండిలో నామినేషన్‌లు వేసిన వారంతా ఉపసంహరించుకుంటారు. చైర్మన్‌ అభ్యర్థి రంగంలో ఉండేలా కూటమి స్థానికంగా ఏర్పాట్లు చేసుకుంది. అధిష్ఠానం నిర్ణయం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:32 AM