మెరుగైన పనితీరు !
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:47 PM
విద్యుత్ సమస్యలు తెలపడానికి, విద్యుత్ శాఖ పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది.
మెరుగైన పనితీరు !
విద్యుత్ శాఖ సేవలపై ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో ప్రజాభిప్రాయ సేకరణ
పశ్చిమ గోదావరి జిల్లా ఆరో స్థానం.. ఏలూరు జిల్లా పదమూడో స్థానం
ఏలూరుసిటీ, ఫిబ్రవరి 22(ఆంరఽధజ్యోతి) : విద్యుత్ సమస్యలు తెలపడానికి, విద్యుత్ శాఖ పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఏలూరు జిల్లాలో ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో జిల్లా విద్యుత్ శాఖ మెరుగైన పనితీరు కనబరుస్తోందని ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకుల ద్వారా తెలుస్తోంది. గత నెలలో ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో ఏలూరు జిల్లా.. రాష్ట్రంలో 13 స్థానంలో నిలిచింది. గతంలో 9 నుంచి 12 స్థానాలను కూడా జిల్లా దక్కించుకుంది.
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో వచ్చిన ప్రశ్నల వారీగా పరిశీలిస్తే రెండు ప్రశ్నలకు సంబంధించి ఏలూరు జిల్లా మెదటి మూడు స్థానాల్లో నిలిచింది. ముఖ్యంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో ప్రధానంగా ‘మీకు కరెంటు నిరంతరాయంగా వస్తోందా..?, ‘ఉద్యోగులు ప్రాంతీయంగా (లోకల్‌గా) ఉంటున్నారా..?’, ‘మీ ప్రాంతంలో లో ఓల్టేజీ సమస్య ఎలా ఉంది..?’ అనే మూడు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇందులో ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారా..? అన్న ప్రశ్నకు ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో చోటు దక్కించుకుంటోంది. లో–ఓల్టేజీ సమస్య నివారణ విషయంలో జిల్లా ఒకటి నుంచి ఐదు స్థానాల్లో నిలుస్తోంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా విషయంలో కొంత వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఆర్‌డీఎస్‌ఎస్ పనులు జరుగుతుండడంతో ఎల్‌సీలు తీసుకోవడం వల్ల విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను జిల్లాలోని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, అధికా రులు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రజల అభిప్రాయాల ద్వారా తెలుస్తోంది.
ప్రతివారం డయల్ యువర్ విద్యుత్ సీఎండీ
డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ప్రతివారం నిర్వహిస్తూ ప్రజల నుంచి విద్యుత్ సమస్యలను తెలుసుకుంటున్నారు. గత వారంలో జిల్లాకు సంబంధించి ఒకే గ్రామానికి సంబంధించి ఒకే సమస్యకు 10 మంది కాల్స్ చేయగా ఆ సమస్యను వెంటనే పరిష్కరించినట్టు జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాఽధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ వినియోగదారులు పాటించాల్సిన భద్రతా సూచనలను విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ సూచనలను అన్ని ఆర్‌బీకేలు, పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల వద్ద ఉంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ‘వేసవిలో జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉండవు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇళ్లను నిర్మించే సమయంలో శ్లాబ్ వేసేటప్పుడు దగ్గరలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉంటే జాగ్రత్తలు తీసుకుని ఆ పనులు నిర్వహించాలి’ అని ఏపీఈపీడీసీఎల్ ఏలూరు జిల్లా ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు పేర్కొన్నారు.
‘పశ్చిమ’ జిల్లాకు ఆరో స్థానం
తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌లో వచ్చే సమస్యలపై వచ్చే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ను పరిష్కరించడంలో రాష్ట్రంలో ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయి నుంచి డివిజినల్‌స్థాయి వరకు టీం వర్క్‌గా చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాలు 80 శాతం, నాణ్యమైన విద్యుత్ 72 శాతం, సిబ్బంది స్థానికంగా ఉంటున్నారనే అంశంలో 80 శాతం ర్యాంకింగ్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించింది. సిబ్బంది సమన్వయం వల్లే ఈ ర్యాకింగ్ సాధించామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉషారాణి తెలిపారు.