ఆ భూములు ఎవరివి... ?
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:37 AM
కుక్కునూరు మండల రైతుల భూములకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ తొమ్మిదేళ్లుగా ఓపెన్ కాలేదు.
తొమ్మిదేళ్లుగా ఓపెన్ చేయని వెబ్‌ల్యాండ్
నిలిచిపోయిన భూలావాదేవీలు
రైతులకు తప్పని తిప్పలు
హైకోర్టు తీర్పు ఇచ్చినా వెబ్‌ల్యాండ్ ఓపెన్ చేయని అధికారులు
కుక్కునూరు మండల రైతుల భూములకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ తొమ్మిదేళ్లుగా ఓపెన్ కాలేదు. రైతుల భూలావాదేవీలు స్తంభించిపోయాయి. మరణించిన వారి భూములు వారసులకు అందడం లేదు. ఉన్నవారి భూములకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. క్రయవిక్రయాలకు అవకాశం లేదు. భూమార్పిడి జరగదు. ఈ భూములు ఎవరికి చెందుతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెబ్‌ల్యాండ్ ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
కుక్కునూరు, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2017లో భూసేకరణ జరిగింది. ఆ సమయంలో వెబ్ ల్యాండ్‌లో మార్పులు, చేర్పులు జరగకుండా ప్రభుత్వం ఆన్‌లైన్ వెబ్‌ల్యాండ్ నిలిపివేసింది. భూసేకరణ పూర్తయ్యి తొమ్మిదేళ్లు అవుతున్నా వెబ్‌ల్యాండ్ మళ్లీ ఓపెన్ చేయలేదు. భూసేకరణ చేయగా కుక్కునూరు మండలంలో ఐదు వేల ఎకరాలకు పైగా మిగులు భూమి ఉంది. ఇది పోలవరం ప్రాజెక్టు ముంపులో లేదు. స్థానిక రెవెన్యూ యంత్రాంగం పోలవరం భూసేకరణ జరిగిన భూముల వివరాలు, మిగిలిన భూముల రికార్డులను గుర్తించి రికార్డు తయారుచేశారు. వెబ్‌ల్యాండ్ ఓపెన్ చేయకపోవడంతో వాటికి సంబంధించి రైతుల మధ్య క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ భూములు కుటుంబ సభ్యులకు మార్పిడి నిలిచిపోయింది. ఈ క్రమంలో భూ హక్కు కలిగిన తాతలు, తండ్రులు మృతి చెంది న ఇంకా వారి పేరు మీదే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వెబ్‌ల్యాండ్ ఓపెన్ చేయక పోవడంతో వారి వారసత్వం వారికి మార్పిడి జరగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రభుత్వం నుంచి రైతులకు అందే డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పనిముట్లు విద్యుత్ మోటర్ల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు మంజూరు కాకుండా నిలిచిపోయాయి. గత ఏడాది మృతి చెందిన వారి పేరు మీదే భూముల రికార్డులు నమోదై ఉండడంతో 1,498 మంది రైతు కుటుం బాలకు అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి వ్యవసాయ శాఖ స్పందించి మాన్యువల్‌గా రికార్డు తయారుచేసి ఆ పథకాన్ని లబ్ధిదారులకు అందేలా చేశారు. ఇదంతా వెబ్‌ల్యాండ్ ఓపెన్ కాక ఏర్పడిన సమస్య. పాస్ పుస్తకాల మార్పిడి జరిగి తద్వారా వారసత్వ భూమిపై హక్కు కలిగితే తమకు బ్యాంకుల్లో రుణాలందే అవకా శం ఉందని గిరిజన, గిరిజనేతర రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తున్నారు. బ్యాంకు ద్వారా రుణాలు మంజూ రైతే తాము సాగుకు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండే అవ కాశం ఉందని రైతులు చెబుతున్నారు.
హైకోర్టు తీర్పు ఇచ్చినా..
కివ్వాక గ్రామానికి చెందిన మంత్రి గోపాల కృష్ణ కుటుంబం కుక్కు నూరు పంచాయతీ ఇసు కపాడులోని ఓ రైతు దగ్గర దాదాపు ఎనిమిది ఎకరాల భూమి కొను గోలు చేసింది. వెబ్‌ల్యాండ్ ఓపెన్ కాకపోవ డంతో ఇప్పటివరకు గోపాలకృష్ణ కుటుంబం పేరు మీద పట్టా మార్పిడి జరగలేదు. దీంతో ఆ రైతు కుటుంబం వెబ్‌ల్యాండ్ ఓపెన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు గత ఏడాది న వంబర్ 11న వెబ్‌ల్యాండ్ ఓపెన్ చేయాలం టూ తీర్పు ఇచ్చింది. జిల్లా రెవెన్యూ యంత్రాం గానికి, జిల్లా రిజిస్ర్టేషన్ కార్యాలయానికి సంబంధించిన పత్రాలను జారీ చేశారు. ఏడు నెలలైనా ఇంత వరకు వెబ్‌ల్యాండ్ ఓపెన్ చేయలేదు. అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని గోపాలకృష్ణ కోరుతున్నారు.