Share News

వాతావరణం కూల్‌ కూల్‌

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:44 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నెల రోజులుగా భానుడి భగభగలు, తీవ్ర ఉక్కపోత తో అల్లాడిపోయిన ప్రజలకు శనివారం కురిసిన వర్షం భారీ ఊరటనిచ్చింది.

వాతావరణం కూల్‌ కూల్‌
నరసాపురం రోడ్డుపై వర్షం నీరు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలుచోట్ల కుండపోత వర్షం

భీమవరం/నరసాపురం/పాలకొల్లు/ఆచంట/

కాళ్ల/మొగల్తూరు/ఇరగవరం/పెనుమంట్ర, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి):బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నెల రోజులుగా భానుడి భగభగలు, తీవ్ర ఉక్కపోత తో అల్లాడిపోయిన ప్రజలకు శనివారం కురిసిన వర్షం భారీ ఊరటనిచ్చింది. అన్నదాతల్లో సాగు పై ఆశలు చిగురించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతోపాటు పలుచోట్ల మురు గునీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదుర య్యాయి. రెండు రోజుల్లో వినాయక చవితి ఉత్స వాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షం నిర్వాహకులకు ఇబ్బంది కలిగించింది. పట్టణా లు, గ్రామాల్లో యువత ఇప్పటికే వినాయక మండపాల ఏర్పాట్లలో నిమగ్నమైంది. వర్షాన్ని లెక్కచేయకుండా పందిళ్ల నిర్మాణ పనులు కొనసాగించారు. మధ్యాహ్నం వర్షం తగ్గడంతో పూజా సామగ్రి విక్రయాలు ఊపందుకున్నాయి.

పెనుగొండలో అత్యధికం

గడిచిన 24 గంటల్లో పెనుగొండలో అత్యధికంగా 108.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైం ది. ఇరగవరం 107, పెనుమంట్ర 104.6, తాడే పల్లిగూడెం 8.2, తణుకు 41.2, భీమవరం 18.4, నరసాపురం 3.4, ఆకివీడు 24.6, పెంటపాడు 32.4, అత్తిలి 51.6, గణపవరం 97.4, ఉండి 126.2, పాలకోడేరు 24.4, ఆచంట 87.6, పోడూరు 65.8, వీరవాసరం 8.2, కాళ్ల 22.4, మొగల్తూరు 4.2, యలమంచిలి 40.2 మి.మీ. నమోదైంది.

తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవ డంతో నరసాపురం మండలంలోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగ్గా, సాయంత్రానికి అధికారులు పునరుద్ధరించారు. శివారు ప్రాంతాల్లోని రైతులు పంట సాగుపై ఆశలు పెంచుకున్నారు. మొగల్తూరు మండలం లో జోరు వాన కురిసింది. ఎండల తీవ్రతతో కలుపు తీసేందుకు కూలీలు రాని పరిస్థితుల్లో కురిసిన ఈ వర్షం వరి చేలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. నీరందక, పురుగు మందుల ఖర్చులతో సతమతమైన వంగ, బెండ, బీర సాగుదారులకు వాన ఊరటనిచ్చింది. మొగల్తూరు–వెంప ఆర్‌అండ్‌బీ రోడ్డు గోతుల్లో వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. తీరప్రాంత మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆచంట, పెనుగొండ మండలాల్లో కుండపోత వర్షానికి పల్లపు ప్రాంతాలు, రహదారులు జలమయమై బురదగా మారాయి. ఇరగవరం మండలంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై జోరుగా వర్షం కురిసింది. వర్షం మరికొంత సమయం కొనసాగితే పంటలకు మరింత మేలు జరుగుతుందని రైతులు పేర్కొన్నారు. మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి ఆలమూరు, పొలమూరు, పెనుమంట్ర, నత్తారామేశ్వరం తదితర గ్రామాల్లో డ్రెయిన్లు పొంగి మురుగునీరు సిమెంట్‌ రోడ్లపైకి చేరింది. వరుస సెలవుల కారణంగా పంచాయతీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు రాకపోకలకు అవస్థలు పడ్డారు. మురుగునీటిని వెంటనే తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. భారీ వర్షానికి కాళ్ల జలమయంగా మారింది. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక అంతర్గత రహదారులు పొంగి ప్రధాన రహదారులను ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర రహదారిపై వర్షం నీరు నిలిచి రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్ళే పల్లపు వీధి మోకాలు లోతు నీటితో నిండిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం జిల్లాలోని రెండు లక్షల 25 వేల ఎకరాలకు లాభం చేకూర్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. మరో రెండు రోజుల పాటు మురుసుతో కూడిన వర్షాలు కురిస్తే సాగుకు ఎంతో మేలు చేస్తుంది.

Updated Date - Sep 13 , 2026 | 12:44 AM