Share News

రైతుకు కలిసొచ్చిన పుచ్చ

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:08 AM

పుచ్చకా యల ధరలు చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సంవత్సరం వీటి సాగు విస్తీర్ణం తగ్గడంతో మంచి డిమాండ్‌ వచ్చింది. ఇటీవల తమిళనాడులో తుఫాన్‌ ప్రభావంతో తోటలు దెబ్బతిన్నాయి.

రైతుకు కలిసొచ్చిన పుచ్చ
తాడేపల్లిగూడెం మార్కెట్లో తమిళనాడు పుచ్చ

కిలో రూ.18 నుంచి 20కి కొనుగోలు

గత సంత్సరం ఇదే రూ.6 నుంచి 10

పెరిగిన ధరలతో వినియోగదారులు గగ్గోలు

తాడేపల్లిగూడెం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పుచ్చకా యల ధరలు చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సంవత్సరం వీటి సాగు విస్తీర్ణం తగ్గడంతో మంచి డిమాండ్‌ వచ్చింది. ఇటీవల తమిళనాడులో తుఫాన్‌ ప్రభావంతో తోటలు దెబ్బతిన్నాయి. గత సంవత్సరం పుచ్చకాయలకు సాగు ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది సాగు ఉన్నా తుఫాన్‌ దెబ్బతో తోటలు దెబ్బతినడంతో డిమాండ్‌ ఏర్పడింది. దీనికి తోడు రంజాన్‌ మాసం జతకలిసింది. గతంలో సాగు విసీర్ణం ఎక్కువగా ఉండడంతో డిమాండ్‌ తక్కువగా ఉండేది. అలాంటిది ఈ ఏడాది రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. తమిళనాడు నుంచి వచ్చే సారల పుచ్చకాయలకు విపరీత మైన డిమాండ్‌ మార్కెట్లో ఉంటుంది. తీపి ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయలు తమిళనాడులో ఆరం బాకం, కొట్టాయం, తిరువెల్లూరు వంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా సాగుచేస్తుంటారు. ఇక్కడ నేల సారవంతంగా ఉండడంతో పుచ్చకాయలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఇక్కడ రైతులు ఎక్కువగా సారల పుచ్చ కాయలనే పండిస్తారు. గత సంవ త్సరం ఇక్కడ రైతులు వ్యాపారులకు కిలో రూ.6 నుంచి 10 మధ్య అమ్మారు. ఈ ఏడాది ఇదే రకం పుచ్చకాయలు కిలో రూ.18 నుంచి 20కు రైతులు హోల్‌సేల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీటిని తెచ్చిన హోల్‌సేల్‌ వ్యాపారులు రిటైలర్స్‌కు కిలో రూ.23 నుంచి 25కు విక్రయిస్తున్నారు. వీటిని రిటైలర్స్‌ వినియోగదారుకు కిలో రూ.30 నుంచి రూ.35 అమ్ముతున్నారు.

ఏపీ, తెలంగాణల్లో నల్లపుచ్చకాయల సాగు

ఏపీ, తెలంగాణాలోను నల్లపుచ్చకాయల సాగు విస్తీర్ణం పెంచారు. ఈ ప్రాంతాల్లో నల్లపుచ్చకాయలకు అనువైన వాతావరణం ఉండడంతో వీటినే సాగుచేస్తున్నారు. మన రాష్ట్రంలో కొయ్యలగూడెం, అనంతపల్లి, నల్లజర్ల, దేవరపల్లి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలాల్లో వీటిని ఎక్కువ సాగుచేశారు. తెలంగాణలోని ఖమ్మం, సత్తుపల్లి ప్రాంతాల్లో సాగుచేశారు. వీటికి గతంలో డిమాండ్‌ లేకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు. ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది. గత ఏఏడాది కిలో రూ.6 మాత్రమే ఉండేది. ఖర్చులు రావని రైతులు పొలాల్లోనే కోయకుండా వదిలేయడంతో పశువులు తినేవి. ఇలాంటి పరిస్థితి నుంచి రైతులకు ఈ ఏడాది కాసుల వర్షం కురుస్తుంది. నల్లరకం పుచ్చకాయలు పొలంలో రైతులు కిలో రూ.20 నుంచి 22 మధ్యన హోల్‌సేల్‌ వ్యాపారులకు అమ్ముతున్నారు. వీటిని హోల్‌సేల్‌ వ్యాపారులు రిటైలర్స్‌కు కిలో రూ.25 నుంచి 28 మధ్య విక్రయిస్తున్నారు. ఇక రిటైలర్స్‌ వీటిని రూ.30 నుంచి 32 మధ్య అమ్మకాలు చేస్తున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:08 AM