శుద్ధ జలం.. ఏది నిజం!
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:56 PM
గొంతెండుతున్న జనం గోడు పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇదే అదునుగా జిల్లాలో రివర్స్ ఆస్మాసిస్ (ఆర్వో) ప్లాంట్లు ద్వారా తాగునీటి వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్వో ప్లాంట్లు
పాటించని నిబంధనలు ..నీరుగారుతున్న ప్రమాణాలు
రోగాల బారిన పడుతున్న జనం
ప్రజారోగ్యంతో నిర్వాహకుల చెలగాటం..పట్టని అధికారగణం
ఏలూరు రూరల్/లింగపాలెం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి) :
జిల్లాలో నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఏ నీరు తాగుతున్నా రని ఎవరైనా అడిగితే మినరల్ వాటర్ అని గొప్పగా చెబుతాం. అయితే కేవలం శుద్ధజలం (ఫిల్టర్ వాటర్) మాత్ర మేనని తెలుసుకునే సరికి జేబులు ఖాళీ అవుతు న్నాయి. కొన్ని ప్లాంట్లు నిర్వాహకులు కనీస ప్రమాణాలు పాటించకుండా నీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ నీటిని తాగిన జనం అనారోగ్యం బారిన పడుతున్నారు.
గొంతెండుతున్న జనం గోడు పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇదే అదునుగా జిల్లాలో రివర్స్ ఆస్మాసిస్ (ఆర్వో) ప్లాంట్లు ద్వారా తాగునీటి వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది.జిల్లాలో అన్ని ప్రాంతాల్లో రక్షిత నీరు సరఫరా కాకపోవడంతో మారుమూల ప్రాంతాల వారు సైతం ఆర్వో ప్లాంట్లు ద్వారా విక్రయిస్తున్న శుద్ధ జలాన్నే కొనుక్కుని తాగాల్సి వస్తోంది. నిజానికి గ్రామాల్లో నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు కడిగి క్లోరినేషన్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. దాదాపు అన్ని పంచాయతీ ల్లోనూ ఈ కార్యక్రమాన్ని విస్మరించారు. దీంతో జనం తాగునీటిని కొనుగోలు చేసి, తాగా ల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఈ అవ కాశాన్ని ఆసరాగా తీసుకుని జిల్లాలో పట్టణ కేంద్రాలు మొదలుకొని మారుమూల గ్రామాల్లో సైతం విచ్చలవిడిగా శుద్ధి జల ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.
ఇవీ నిబంధనలు..
వాటర్ ప్లాంట్‌లు తప్పనిసరిగా భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నిబంధనలు పాటించాలి. ప్రతి వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ ప్లాంట్‌లో నీటిని పరీక్షించేందుకు ప్రయోగ శాలలు ఉండాలి. నీటిని నిలువ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్ములను మాత్ర మే ఉపయోగించాలి. వీటికి క్రమం తప్పకుండా ఆక్సీకరణ చేయాలి. ప్రజలకు నీటిని సరఫరా చేసే వాటర్ క్యాన్లు, కూలింగ్ క్యాన్లను తప్పకుండా ప్రతిరోజు శుభ్రపర చాలి. వాటర్ ప్లాంట్లలో మైక్రో బయాలజిస్టు, కెమిస్ట్‌ల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి. ఆహార కల్తీ నిరోధక శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అమ్మకం పన్ను, జిల్లా పరిశ్రమల శాఖతో పాటు స్థానికంగా ఉన్న మున్సిపల్, పంచాయతీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
లింగపాలెం మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటి పేరిట కొందరు వ్యాపారులు యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేస్తున్నారు. వాటిలో ఎక్కడా నీటిని శుద్ధి చేసే విషయంలో ప్రభుత్వ ప్రమాణాలను, నిబంధన లను పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఆ వాటర్ ప్లాంట్లలో 20 లీటర్ల క్యాన్ రూ.15, కూలింగ్ క్యానుకు రూ.35 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో కూలింగ్ క్యాన్లు డిమాండ్‌ను బట్టి రూ.50 వరకు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఈ వాటర్ ప్లాంట్లలో చాలా వరకు అనుమతులు లేనివే ఉండడం గమనార్హం. కొన్ని వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు సొంత బోర్లు లేకపోవడంతో పంచాయతీ పైపులైన్లకు మోటార్లు బిగించి ఆ నీటిని ఫిల్టర్ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని వాటర్ ప్లాంట్లలో నీటిని శుభ్రపరిచే ఫిల్టర్‌లను నిర్ణీత సమయానికి మార్చడం లేదు. ఇటువంటి నీటిని తాగితే ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాగునీరు సురక్షితంగా ఉండాలి..
తాగునీరు సురక్షితంగా లేకపోతే అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాటర్ ప్లాంట్‌లో నీరు సురక్షితంగా ఉండేలా చూసు కోవాలి. కొన్ని ఆర్వో ప్లాంట్లలో శరీరానికి అవసరమైన కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం కూడా ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ నీటినే తాగాల్సి వచ్చినప్పుడు తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
– డాక్టర్ ప్రియాంక, ప్రభుత్వ వైద్యాధికారి, ధర్మాజీగూడెం పీహెచ్‌సీ