డెల్టా కాల్వలకు జల కళ
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:37 AM
డెల్టా కాలువలకు ఆదివారం సాగునీటిని విడుదల చేశారు.
విజ్జేశ్వరం హెడ్ స్లూయిస్ వద్ద గోదావరికి ప్రత్యేక పూజలు
నీరు విడుదల చేసిన మంత్రి దుర్గేష్
నిడదవోలు, మే 31(ఆంధ్రజ్యోతి): డెల్టా కాలువలకు ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద హెడ్ స్లూయిస్ వద్ద మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి మాతకు పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం స్లూయిజ్ గేట్లు ఎత్తే స్విచ్ ఆన్‌చేసి పశ్చిమ డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. అనంతరం గోదావరి మాతకు పసుపు, కుంకుమ, చీర, రవిక, పండ్లు సమర్పించారు. హెడ్ స్లూయిస్‌ను మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అలంకరిం చారు. నీటిపారుదలశాఖ అధికారులు, నాయకు లు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
గోదావరి జలాలతో ఆర్థికాభివృద్ధి
గోదావరి జలాల ఖరీఫ్, రబీల ద్వారా ఏటా సుమారు రూ.5500 కోట్ల ఆర్థిక అభివృద్ధి సాధిం చడం జరుగుతుందని, ఇందుకు గోదావరి జలాలే ప్రధాన కారణమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజ్వేశ్వరం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆఖరి ఎకరా వరకు సాగునీటి అందిస్తుందన్నారు. గోదావరి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయడం ద్వారా సుమారు 5 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు కు నీరు అందించడం జరుగుతుందన్నారు. రైతాంగానికి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఖరీఫ్ సీజన్‌కు నీరందుతుం దన్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ద్వారా పంట భూములు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు.