Share News

వరికి మురుగు ముప్పు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:20 AM

మండలంలోని చిన అమిరం వరి చేలకు మురుగు ముప్పుతిప్పలు పెడుతోంది.

వరికి మురుగు ముప్పు
చిన అమిరంలో చేలో నిలిచిన నీటిని పరిశీలిస్తున్న ఏవో

డ్రెయిన్లలో పూడిక.. చేల నుంచి బయటకు పారని నీరు

భీమవరం రూరల్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన అమిరం వరి చేలకు మురుగు ముప్పుతిప్పలు పెడుతోంది. మురుగు కాలువలు మొరాయించడంతో దాళ్వా సాగుకు ఆటంకంగా మారింది. ఏవో ప్రసాద్‌కు బుధవారం రైతులు గోడు వెల్లడించారు. నాట్లు వేయడానికి చేలల్లో నీరు తగ్గక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రసాద్‌ డ్రెయినేజీ శాఖ అధికారులతో మాట్లాడతానని తెలిపారు. కొమరాడ నుంచి దాసుకోడు, కోపల్లె వెళ్లే మురుగు కాలువ బాగు చేయించాలని రైతులు వివరించారు.

న్యూ చానల్‌లో పూడిక తొలగింపు పనులు

మొగల్తూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మొగల్తూరు న్యూచానల్‌ చెత్తా చెదారం, పూడికతో సాగునీరందక దమ్ము చేసిన చేలు ఎండిపోతున్నా యని రైతులు ఆందోళన చెందారు. సాగునీటి సంఘం దృష్టికి తీసుకు వెళ్లారు. మొగల్తూరు శివారు ఇంజేటివారిపాలెం, గుండువారిపుంత వరకూ ఈ చానల్‌ ద్వారా 1200 ఎకరాలకు సాగునీరు, మొగల్తూరు బృహత్తర మంచినీటి ప్రాజెక్టుకు నీరు సరఫరా అవుతోంది. కాల్వ ప్రక్షాళనకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ ఆదేశాలతో బుధవారం పూడిక తొలగింపు పనులు చేపట్టారు. చానల్‌ గట్లు ఆక్రమించుకుని ఎగువ ప్రాంతంలో పలువురు కొబ్బరి, మామిడి చెట్లు నాటారని వాటిని తొలగించాలని శివారు ప్రాంత రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:20 AM