Share News

ఏలూరుకు నీటి గండం!

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:56 PM

తాగు నీటి సరఫరాపై నగర ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నా యి. వర్షాభావ పరిస్థితుల వల్ల దెందులూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని అధికారులు ఒక్కపూటే తాగు నీరందిస్తున్నారు. అదీ 15 రోజుల వరకే సరిపోతాయని అధికారులు చెబుతుండ డంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది.

ఏలూరుకు నీటి గండం!
పంపుల చెరువులోకి గోదావరి కాల్వ నీటిని తోడుతున్న దృశ్యం

నగరంలో ఒక్క పూటే సరఫరా.. ప్రజల్లో ఆందోళనలు

15 రోజులకే సరిపోయేలా పంపుల చెరువు నీళ్లు

తాగునీటికి ఢోకా లేదంటున్న పాలకులు, అధికారులు

ఏలూరు టూటౌన్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి):తాగు నీటి సరఫరాపై నగర ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నా యి. వర్షాభావ పరిస్థితుల వల్ల దెందులూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని అధికారులు ఒక్కపూటే తాగు నీరందిస్తున్నారు. అదీ 15 రోజుల వరకే సరిపోతాయని అధికారులు చెబుతుండ డంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. ఇదే అదనుగా వైసీపీ నేతలు సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును పరిశీలించి నీళ్లు అడుగంటాయని ప్రజలకు తాగునీరు అందించే పరిస్థితులు లేవని ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోదావరి కాల్వకు నీటి సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో సీఎం ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి గోదావరి కాల్వకు నీటి ని పెంచాలని ఆదేశించారు. నగర మేయర్‌ నూర్జహాన్‌, కోఅప్షన్‌ సభ్యులు, కార్పొరేటర్లు కలెక్టర్‌ వెట్రిసెల్విని కలిసి పరిస్థితిని వివరించగా కాల్వకు నీటిమట్టం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్టోరేజ్‌ ట్యాంకులోకి అతికష్టంగా కాల్వ నీళ్లు

నగర ప్రజలకు తాగునీరందించేందుకు దెందులూరు వద్ద 2015లో 117 ఎకరాల్లో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును 6.5 మీటర్ల లోతుతో, మూడు వేల మిలియన్‌ లీటర్ల కెపాసిటీతో నిర్మించారు. గత పదేళ్ల నుంచి నిరంత రాయంగా ప్రతిరోజు రెండు పూటలా మనిషికి సగటున 135 లీటర్లు అందిస్తూ వస్తున్నారు. నగరంలో 2.5 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరి కాల్వలో తగినంత నీరు పారుదల కాకపోవడంతో నీటి ఎద్దడి దుస్థితి నెలకొంది. అరకొరగా వదిలిన నీటిని రైతులు తమ పంటల సాగు నిమిత్తం మళ్లిస్తున్నారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు గోదా వరి కాల్వకు శివారున ఉండటంతో కేవలం అడుగున్నర, రెండు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించడంతో నీటిని తోడలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికి నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు రాత్రి, పగలు కష్టపడి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో నీరెక్కిస్తున్నారు.

ఆందోళన వద్దు.. తాగునీరందిస్తాం..

‘నగర ప్రజలకు తాగునీరందిస్తాం. ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో 400 మిలియన్‌ లీటర్ల నీటి నిల్వలున్నాయి. ఒక్కపూట సరఫరాకు 15 రోజుల వరకు సరిపోతాయి. ప్రతిరోజు 50 మిలియన్‌ లీటర్ల నీటిని గోదావరి కాల్వ నుంచి తోడుతున్నాం. ఒకవేళ వర్షాలు పడనప్పటికి ప్రజలకు తాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నా’మని కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ తెలిపారు.

రెండు పూటలా తాగునీరందించాలి : సీపీఎం ధర్నా

నగర ప్రజలకు రెండుపూటల తాగునీరందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు బీఎన్‌వీడీ ప్రసాద్‌, రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో తాగునీటి కొరతను నిరసిస్తూ శనివారం ధర్నా నిర్వహిం చారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా పాలక మండలి, అధికారులు ఎటువంటి ప్రణాళికలు రూపొందించకపోవడం అసమర్థతతకు నిదర్శనమన్నారు.

తాగునీటి కోసం ఆందోళన చెందవద్దు..

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని నగర ప్రజలకు తాగునీరందించి తీరుతామని టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, నగర పాలక సంస్థ కోఅప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌.పెదబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు తాగునీటి సమస్యను రాజకీయం చేయడానికి ప్రయత్ని స్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌.ట్యాంకును రూ.5కోట్ల 60లక్షలతో దశల వారీగా అభివృద్ధి పరిచామని, ఆ నిధుల్లో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్‌ విసిరారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్‌, నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:56 PM