సాగునీళ్లు కరువు .. పంట పొలాలు నెర్రలు!
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:34 AM
పచ్చని పంట లతో కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు ఎల్‌నినో ప్రభా వంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నెర్రలు చాచి బీడు వారుతున్నాయి.
పంటల బీమాతో సంబంధం లేకుండా ఆదుకోవాలని రైతుల వినతి
ఏలూరు రూరల్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పచ్చని పంట లతో కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు ఎల్‌నినో ప్రభా వంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నెర్రలు చాచి బీడు వారుతున్నాయి. జూన్, ఆగస్టు నెలల్లో అతి తక్కువ వర్ష పాతం నమోదైంది. వర్షాలు తక్కువగా ఉంటాయని అధికారులు హెచ్చరించినా దేవుడిపై భారం వేసి సాగు చేపట్టిన రైతుల ఆశలు రోజురోజుకు ఆవిరవుతున్నాయి. అడపాదడపా కురుస్తున్న మోస్తరు వర్షాలు పంటలకు ఏమాత్రం చాలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు రూరల్ మండలంలో సుమారు పది వేల ఎకరాలలో ఏటా సార్వా వరి సాగు చేయాల్సి ఉండగా ఎల్ నినో ప్రభావంతో పాలగూడెం, సుంకరివారి తోట, చాటపర్రు, పోణంగి ప్రాంతాల్లో మాత్రమే ఖరీఫ్ ఆలస్యంగా ప్రారంభించారు. సుమారు రెండు వేల ఎకరాలకు పైగా రైతులకు సాగుకు దూరమ య్యారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతున్నా కొత్త పంటలు సాగు చేయలేక సంప్రదాయ పంటల సాగుకే ఆసక్తి చూపడంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. మాదేపల్లి, లింగారావుగూడెం గ్రామాల్లో పంట భూములు నెర్రలు చాచాయి.
దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి
వరిసాగు చేపట్టిన రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.25వేలు వరకు పెట్టుబడులు పెట్టగా, కౌలు రైతులు అదనంగా మరో 10 వేల వరకు కౌలు చెల్లించి సాగు చేపట్టారు. పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సి ఉంది. మెజార్టీ శాతం మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేకపోవడంతో నష్టపరిహారం వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటల బీమా చెల్లింపులో సంబంధం లేకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.