Share News

తాగునీటిలో కలిసిన కలుపు మందు

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:09 AM

మండలంలోని పి.అంకం పాలెంలో కలుపుమందు కలిసిన తాగునీరు తాగి 12 మంది అస్వస్థతకు గురయ్యారు.

తాగునీటిలో కలిసిన కలుపు మందు
108 వాహనంలో బాధితుల్ని వివరాలు అడుగుతున్న డీఎల్‌పీవో సుబ్బరాయన్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వరావు

పి.అంకంపాలెంలో 12 మంది చిన్నారులకు అస్వస్థత ..అధికారులు అప్రమత్తం

108లో ఆస్పత్రికి బాధితుల తరలింపు

జీలుగుమిల్లి,ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): మండలంలోని పి.అంకం పాలెంలో కలుపుమందు కలిసిన తాగునీరు తాగి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో పంచాయతీ మంచినీటి పైపులైన్‌ల ద్వారా వచ్చే తాగునీటిలో పొలాలకు వాడే కలుపు మందు కలిసినట్టు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పంచాయతీ మంచినీటి ట్యాంకు వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ రైతు పొలంలో వేరుశెనగ పంట కు కలుపు మందు కొట్టేందుకు బూటాక్లోర్‌, పిండిమెథాలియన్‌ మందును ట్రాక్టర్‌పై ఉంచిన 1000 లీటర్ల ట్యాంకులో ఉంచి పంచాయతీ ట్యాంకు వద్ద నీటిని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పంచాయతీ మంచినీటి ట్యాంకులోకి కలుపు మందునీరు కలిసి నట్టు గ్రామస్థులు పేర్కొంటున్నారు. సాయంత్రం గ్రామంలో పలు వురు ఇళ్ల వద్ద కుళాయి నీటి నుంచి నురగలు రావడంతో కొందరు గ్రామస్థులు పరిశీలించి తాగునీరు కలుషితమైనట్టు గుర్తించారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు కలుషిత మైందని, ఎవరు కుళాయి నీళ్లు తాగొద్దని గ్రామంలో కార్యదర్శి మైక్‌లో ప్రచారం చేయించారు. అప్పటికే కుళాయి నీరు తాగి స్వల్ప అస్వస్థతకు గురై నీరసపడిన 12 మంది చిన్నారులను గుర్తించారు. వారిలో ఏడేళ్ల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు చాపల రిజ్వాన్‌, చాపల రసూల్‌బీ, నేలపాల వెంకటదుర్గారావు, నేలపాల అజయ్‌కుమార్‌, గుర్రం జైవర్ధన్‌, గుర్రం వర్షిత్‌తేజ్‌, మానికల భానుచైతన్యశ్రీ, మానికల నిత్యశ్రీ, యేగేంద్ర శశిరాణి, సాయిల పూర్ణగణేష్‌, సంపురేటి ప్రేమ్‌పవన్‌, సంకుల ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. వీరిని 108లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం డీఎల్‌పీవో ఎవి.సుబ్బ రాయన్‌, తహసీల్దార్‌ జి.వెంకటేశ్వరావు చిన్నారుల ఆరోగ్య పరి స్థితిపై ఆరా తీశారు. మండల వ్యవసాయాధికారి కె.గంగాధరం నీటిలో కలిసిన కలుపు మందు విషయమై ఆరా తీశారు. వీఆర్వో జగదీశ్వరి, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, సంబంధిత అధికారులు ఘటనపై వివరాలు సేకరించారు.

Updated Date - Aug 15 , 2026 | 01:09 AM