Share News

జలం.. గరళం!

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:43 AM

వర్షాకాలంలోనూ మంచినీళ్ల కోసం జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో జనం ఇబ్బందులు పడుతు న్నారు. కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు చాలా ప్రాంతాల్లో అందడం లేదు. పైప్‌లైన్లు పగిపో వడం, లీకేజీలు, ట్యాంక్‌లను శుభ్రం చేయకపో వడం తదితర కారణాలతో తాగునీరు కలుషిత మవుతోంది. దీంతో సొమ్ములు చెల్లించి ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నారు.

జలం.. గరళం!
మంచినీటి ట్యాంకులు

జిల్లాలో సక్రమంగా అందని రక్షిత నీరు

ఏలూరు జిల్లాలో రోజు విడిచి రోజు సరఫరా

శిఽథిలావస్థలో మంచినీటి ట్యాంకులు

పైపుల లీకేజీ.. కలుషితమవుతున్న నీరు

వర్షాకాలంలో పొంచివున్న వ్యాధుల ముప్పు

వర్షాకాలంలోనూ మంచినీళ్ల కోసం జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో జనం ఇబ్బందులు పడుతు న్నారు. కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు చాలా ప్రాంతాల్లో అందడం లేదు. పైప్‌లైన్లు పగిపో వడం, లీకేజీలు, ట్యాంక్‌లను శుభ్రం చేయకపో వడం తదితర కారణాలతో తాగునీరు కలుషిత మవుతోంది. దీంతో సొమ్ములు చెల్లించి ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొన్నిచోట్ల వృథాగా మంచినీళ్లు పోతున్నా పట్టిం చుకునే నాథుడే లేడు. జంగా రెడ్డిగూడెం వంటి ప్రాంతాల్లో ఉప్పు, సుద్ద నీటి సమస్యతో జనం సతమతమవు తున్నారు. జిల్లాలో వర్షాకాలంలో తాగునీటి సరఫరాపై ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ నిర్వహించగా పలు అంశాలు వెలుగుచూశాయి.

చింతలపూడి : చింతలపూడి నగర పంచాయతీలో ఇప్ప టికీ రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఇళ్ల కుళాయిల వినియోగంలో ప్రజలు పంపులు బిగించకుండా నీటిని వృఽథా చేస్తున్నారు. మునిసిపల్‌ అధికారుల పర్యవేక్షణ లేదు. పబ్లిక్‌ కుళాయిల పరిస్థితి అంతే. తరచూ పైపులైన్ల లీకే జీలతో రోడ్లపై నీరు చేరి దుర్గంధం వెదజల్లుతోంది. పట్టణ పరిధిలో సుమారు మూడు వేల కుళాయిలు ఉన్నా అనధికార కుళాయిలు వెయ్యికి పైగా ఉన్నాయి. విద్యుత్‌ మోటార్లతో ప్రైవేటు కుళాయిదారులు ఇష్టారాజ్యంగా మంచినీటిని విని యోగించడం వల్ల పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి విని యోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఏడు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు, 38 మోటార్ల ద్వారా మంచినీరు అందిస్తున్నారు. మెరక ఏరియాలో సరఫరా కోసం ట్యాం కర్లను వినియోగిస్తున్నారు. అయితే ఆర్వో వాటర్‌ ప్లాం ట్‌లు రావడంతో పబ్లిక్‌ కుళాయిల నీటిని వాడకం నీటికి వినియోగిస్తున్నారు. కాగా నగర పంచాయతీకి అమృత్‌ 2.0 పథకంలో రూ.48 కోట్లు మంజూరయ్యాయి.

జీలుగుమిల్లి : గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పలు గ్రా మాల్లో గతంలో ఏర్పాటుచేసిన మంచినీటి ట్యాంకులు శిఽథిలావస్థకు చేరాయి. తాగునీరు కలుషితం వల్ల ఇతర ప్రాంతాల నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నట్టు తా టియాకులగూడెం పంచాయతీ ఉదయ్‌ భాస్కర్‌ కాలనీ వాసులు చెబుతున్నారు. రామచంద్రాపురంలో ఏళ్ల తర బడి మంచినీటి ట్యాంకు లీకులు ఏర్పడి తాగునీరు వృథాగాపోతోంది. వంకవారిగూడెం, తాటియాకులగూ డెం, చిర్రివారిగూడెం, పాములవారిగూడెం, జీలుగు మి ల్లి గ్రామాల్లో తాగునీటి క్లోరినేషన్‌, ట్యాంకులు శుభ్ర పర్చి నెలలు గడుస్తున్నాయని గ్రామస్థులు చెబుతు న్నారు. కొన్నిచోట్ల కార్యదర్ళులు బదిలీ కావడం ఉన్న వారికి రెండు మూడు పంచాయతీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో వారు గ్రామాల్లో తాగునీరు, పారిశు ధ్యం పట్ల పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. సమస్య పరిష్కారం కాలేదని గిరిజనులు వాపోయారు.

దెందులూరు : మండలంలోని కొవ్వలి సమగ్ర సురక్షిత తాగునీటి పథకం పైపులైన్ల ద్వారా దెందులూరుతో పాటు పలు గ్రామాలకు మంచినీళ్లు సరఫరా అవుతున్నాయి. 16వ నంబర్‌ జాతీయ రహదారి దగ్గర గోదావరి ఏలూరు కాలువ వంతెనపై నుంచి వెళ్లిన ఈ పైపులైను వాల్వు లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతూ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై పడుతోంది. రోడ్డుపై చేరి నిలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు,ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఏలూరు టూటౌన్‌ : ఏలూరు నగరంలో విలీనమైన వెంకటాపురం, పో ణంగి, మాదేపల్లి, కొమడవోలు, తంగెళ్లమూడి, సత్రంపాడు, శనివారపుపేట ల్లో 55 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఈ ఏడు గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. చెరువులు, బోర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. బోరువాటర్‌లో సుద్ద ఉండడంతో ప్రజలు అనారోగ్యం పాల వుతున్నారు. విలీన గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో గోదావరి జలాలను అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విలీన గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో కూటమి ప్ర భుత్వం రూ.129 కోట్లు మంజూరు చేసింది. త్వరలో ప్రాజెక్టు పట్టలెక్క నుంది. పోణంగిలో 60 ఎకరాల్లో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించి విలీన గ్రామాలకు తాగునీటి అవసరాలు త్వరలో తీరే అవకాశాలున్నాయి. దీనిలో భాగంగా 76 కిలోమీటర్ల పైపులైన్లు వేయడమే కాకుండా ఇంటింటికి 4,600 కుళాయిలు వేయించనున్నారు. కాగా నగర ప్రజలకు రెండు పూటల తాగునీరు పుష్కలంగా లభిస్తుంది. దెందులూరు వద్ద 117 ఎకరాల్లో సమ్మ ర్‌ స్టోరేజ్‌ ట్యాంకును నిర్మించారు. నగరంలో రెండున్నర లక్షల జనాభాకు ప్రతి రోజూ రెండు గంటల పాటు గోదావరి, కృష్ణా జలాలను కుళాయిల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు.

జంగారెడ్డిగూడెం: పట్టణంలో సురక్షిత మంచినీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. స్థానికంగా 29 వార్డులు, 60 వేలకు పైగా జనాభా, 8,205 కుళాయి కనెక్షన్లు, 43 బోర్లు, మోటార్లు ఉన్నాయి. అయితే వీటిలో కేవలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న బోరు, హైస్కూల్‌ వద్దనున్న బోరు నుంచి వచ్చే మంచినీరు మాత్రమే ప్రజలు తాగ డానికి ఉపయోగపడతాయి. మిగతా 41 బోర్ల నుంచి వచ్చే నీరు ఉప్పు, సుద్ద నీరు రావడంతో కేవలం వాడకానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది పట్టణ ప్రజలకు మున్సిపల్‌ కుళాయిలు ఉన్నా ప్రైవేటు వాటర్‌ ప్లాంట్‌ల నుంచి తాగునీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఎస్సీపేటలోని ఎనిమిదో వార్డు ప్రజలకు రెండేళ్ల క్రితం హైస్కూల్‌ ట్యాంక్‌ నుంచి తాగు నీటిని కొద్దిసేపు కుళాయిల ద్వారా ఇచ్చేవారని, ప్రస్తుతం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

కలిదిండి: లంక గ్రామాలైన పెదలంక, మూలలంక, మట్టగుంట, భాస్కరరావుపేట,కొండంగి గ్రామాల్లో ఫిల్టర్‌ బెడ్‌లు పాడైపోవడంతో తాగు నీటి చెరువుల్లో నీటిని ఫిల్టర్‌ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. తాగునీరు బురదగా ఉండటంతో తాగ లేక ఆయా గ్రామాల ప్రజలు ప్రైవే టు వాటర్‌ప్లాంట్లలో బిందెడు నీరు రూ.10 చొప్పున కొనుగోలు చేసి తాగు తున్నారు. పేదలు బురదనీరు తాగి రోగాలబారిన పడుతున్నారు. పాడైన ఫిల్టర్‌ బెడ్‌లను మరమ్మతులు చేయుంచకపోవడంతో నిరుపయోగంగా ఉన్నా యి. ఫిల్టర్‌బెడ్‌లలో పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగాయి. ఇప్పటికైనా సంబం ధిత ఉన్నతాధికారులు ఫిల్టర్‌బెడ్‌లకు మరమ్మతులు చేయించి సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నూజివీడు టౌన్‌: నూజివీడులో తాగునీటి అవసరాలకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంలో కృష్ణా జలాల తరలింపు పథకాన్ని ఏర్పాటు చేశారు. 2008లో ప్రారంభమైన ఈ పథకం నిర్మాణ లోపాలతో ఎక్కడో ఒకచోట లీకులు ఏర్పడుతూ ఉండడంతో పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా అవడం లేదు. నూజివీడు పట్టణంలో దాదాపు 56 కిలోమీటర్లు మేర కృష్ణా జలాల తరలింపునకు సంబంధించి తాగునీటి పైప్‌లైన్లను ఏర్పాటు చేసినా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఎన్టీఆర్‌ కాలనీ, యానాదుల కాలనీ, ఎమ్మార్‌ అప్పారావు కాలనీ, తదితర కొన్ని ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు అందడం లేదు.

Updated Date - Jul 03 , 2026 | 12:43 AM