సాగు నీరు ఇవ్వండి
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:36 AM
కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.
సాగు నీరు ఇవ్వండి
ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ధర్నా
ఏలూరు రూరల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా జలవనరుల శాఖ నిర్లక్ష్యం చేస్తోందని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆరోపించారు. కృష్ణా డెల్టాను ఎడారిగా మార్చకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోణంగి పుంత కాలువ ద్వారా ఏలూరు రూరల్ మండలంలోని 10 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందించాలని, తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వ కుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రైతు ప్రతినిధులు కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, గుర్రం రాంబాబు, వాడవల్లి రామారావు, దాసరి హనుమంత రావు, బైరెడ్డి లక్ష్మణరావు, మలకలపల్లి నాగు, దాసరి సతీష్, పైడిపాటి భాస్కరరావు, తలారి జయరాజు, దాసరి నాగేశ్వరరావు, బండి శ్రీనివాసరావు, చిన్ని పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
పొగాకుకు బదులు పామాయిల్ సాగు చేయండి : ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
ఏలూరు టూటౌన్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పొగాకు పంటకు బదులు పామాయిల్ పంటల వైపు మొగ్గు చూపాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ రైతులకు సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది పొగాకు ధర కేజీకి రూ.470 కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించగలిగామన్నారు. దీని దృష్టిలో పెట్టుకుని పొగాకు రైతులు అధికంగా పొగాకు పండించారని, దీంతో రూ.275కు ధర పడిపోయింద న్నారు. రైతులు పామాయిల్ పంటల వైపు మొగ్గు చూపాలని, ఈ పంటకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తోందని, తగినన్ని మొక్కలు కూడా సరఫరా చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు క్వింటాకు రూ.12 వేలు మద్దతు ధర ఉండేదని ఇప్పుడు తమ ప్రభుత్వంలో క్వింటాకు రూ.24వేలు గిట్టుబాటు ధర అందిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మరింత ధర లభిస్తుందన్నారు. ప్రస్తుతం కొల్లేరుపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని దృష్టిని పెట్టుకుని కొల్లేరు సమస్యకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, ఆర్‌ఆర్ ప్యాకేజీలు పూర్తి చేస్తామన్నారు.