తీరం.. విషాదం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:48 AM
సరదా వెనుక ప్రమాదాలు పొంచి వున్నాయి. లోతు తెలియక, ప్రవాహ వేగం అంచనా వేయడంలో విఫలమై జల సమాధి అయిన ఘటనలు ఎక్కువే. నిత్యం ఏదో మూల జల ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి.
గోదావరిలో మృత్యు ఘంటికలు
ప్రాణాలు తీస్తున్న ఈత సరదా.. ఉమ్మడి పశ్చిమలో వరుస ప్రమాదాలు
గోదావరి, సముద్రం, కాల్వలు, జలాశయాల్లో విషాద ఘటనలు
ఏటా పదుల సంఖ్యలో జల సమాధి.. అయినా నేర్వని పాఠాలు
కుక్కునూరు/భీమవరం/ఏలూరు/ముసునూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి):
గోదావరి, కాల్వలు, సముద్రంలో స్నానం చేయడం అంటే అందరికీ సరదా. పండుగ రోజుల్లో ఉమ్మడి పశ్చిమ తీర ప్రాంతాలన్నీ సందడి చోటు చేసుకుంటాయి. ఇక కార్తీక మాసం పిక్నిక్ రోజుల్లో తీరానికి వెళ్లడం తప్పనిసరి చేసుకున్నారు. అయితే సరదా వెనుక ప్రమాదాలు పొంచి వున్నాయి. లోతు తెలియక, ప్రవాహ వేగం అంచనా వేయడంలో విఫలమై జల సమాధి అయిన ఘటనలు ఎక్కువే. నిత్యం ఏదో మూల జల ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా కుక్కునూరు మండలం వేలేరు సమీపంలోని గోదావరి తీరంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వీటికి అడ్డుకట్ట వేయాలంటే.. ప్రతి ఒక్కరు అవగాహనతో మెలగాలి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, పెనుగొండ, ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల మీదుగా గోదావరి ప్రవహిస్తోంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వుం ది. ఊరూరా కాల్వలు ప్రవహిస్తూ వుంటాయి. గోదావరి, కాల్వల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఎక్కడ ఎంత లోతు ఉంటుందో.. అగాధం ఏర్పడుతుందో తెలియదు. పైకి అంతా ఒకేలా కనిపిస్తుంది. ప్రధానంగా ఇలాంటిచోటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలియక అక్కడ దిగి గల్లంతై మృత్యువుబారిన పడుతూనే ఉన్నారు. కాల్వలు, జలాశయాలు, చెరువుల్లో లోతును అంచ నా వేయలేక ఈతకు దిగి చనిపోయిన వారి సంఖ్య తక్కు వేమీ కాదు. ప్రతి ఏడాది మార్చి ఆరంభం కాగానే గోదావ రిలో నీటిమట్టం తగ్గుతుంది. ఈ క్రమంలో పలుచోట్ల ఇవతల నుంచి అవతల వైపునకు వెళ్లడానికి సాధ్యమవు తుంది. ఇలా గోదావరి దాటుతూ పలువురు గల్లంతవుతు న్నారు. యువత, విద్యార్థులు, పర్యాటకులు నది లోతుపై అవగాహన లేకుండానే దిగడంతో ప్రమాదాల బారిన పడు తున్నారు. కొంగువారిగూడెంలో కరాటం కృష్ణమూర్తి జలాశ యం, బుట్టాయగూడెం పరిసరాల్లోని జల్లేరు జలాశయం వద్ద స్నానాలకు దిగి మృత్యువు పాలైన ఘటనలు ఏటా జరుగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చి.. విగత జీవులుగా మారుతున్న ఘటనలు కళ్లెదుటే సాక్షాత్కరిస్తు న్నా.. రెప్పపాటు నిర్లక్ష్యంతో యువకులు మృత్యువు పాలవు తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జల ప్రమా దాలు జరిగిన తీరు నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఒకసారి వీటిని చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది.
వరుస ప్రమాదాలు
2012లో తణుకుకు చెందిన విద్యార్థులు ట్యూష న్ టీచర్‌తో తీపర్రు గోదావరిలోకి పిక్నిక్ వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటూ గోదావరిలోకి దిగడంతో వారిని రక్షించే క్రమంలో మహిళా టీచర్ సహా ఐదుగురు గల్లంతయ్యారు.
2016లో మరో ఇద్దరు విద్యార్థులు తీపర్రు వెళ్లి గోదావరి స్నానానికి దిగి గల్లంతయ్యారు.
2019 ఫిబ్రవరి 3న కుక్కునూరు మండలం వేలేరు గోదావరి తీర ప్రాంతంలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
2020 ఏప్రిల్‌లో శ్రీరామ నవమికి పాదయా త్రగా వెళుతూ ఓ భక్తుడు పెదరావిగూడెంలో గోదావరి దాటుతూ గల్లంతయ్యాడు. గత ఏడాది లచ్చిగూడెం గ్రామానికి చెందిన ఓ అయ్యప్ప భక్తుడు గోదావరిలో మృతి చెందాడు.
2023లో ఆచంట మండలం కోడేరులో ఇద్దరు యువకులు స్నానాలకు దిగి మృత్యువాత పడ్డారు. ఏడాది క్రితం కరుగోరుమిల్లిలో మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
యలమంచిలి మండలంలో సంక్రాంతి సంబరాలకు వచ్చి ఇద్దరు యువకులు చించినాడ వద్ద ఆగి గోదావరిలో స్నానానికి దిగగా ఒకరు గల్లంతయ్యాడు.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గతేడాది ఏప్రిల్ 3న చల్లా బ్రహ్మయ్య పశువులను మేపుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఎర్రకాల్వలో పడి గల్లంతయ్యాడు.
ముసునూరు మండలం లోపూడి తమ్మిలేరులో ఉన్న చెక్ డ్యామ్ వద్ద మూడేళ్ల క్రితం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈతకు వెళ్లి గొయ్యిలో చిక్కుకుని మృతి చెందారు.
ఈ నెల 15న బుట్టాయగూడెం మండలం జల్లేరు జలాశయంలో డ్యామ్ చూడడానికి వెళ్లి ఈతకు దిగిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఇలా చెబుతూపోతే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య చాలానే వుంది.
ఇకనైనా మేల్కొవాలి
ప్రమాదకరమైన ప్రదేశాలతోపాటు ప్రభుత్వ నిబంధనల కు విరుద్ధంగా చెరువుల్లో చేస్తున్న తవ్వకాలతో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను సైతం గుర్తించి, ప్రమాదాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నా యి. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో పదో తరగతి పరీక్షలు పూర్తవుతాయి. ఇక కుటుంబాలతోను లేదా విడిగా యువకులు తెలియని తనం.. హెచ్చరికల పట్టింపు లేని వారు.. తల్లిదండ్రులకు తెలియకుండా ఈ ప్రాంతాలకు సందర్శనలకు వెళ్లే అవకాశాలు వున్నాయి. పిక్నిక్ స్పాట్‌ల విషయంలో అప్రమత్తత పాటించాలి. డ్యామ్‌ల వద్ద, జలాశయాల వద్ద పగటి వేళ్లలో పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలి. చేపల వేటకు వెళ్లే వారిపైనా నిఘా పెట్టాలి. పశువుల కాపరులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వ హించాలి. మరోవైపు అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకట్ట వేయడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ తరహాలోనే ప్రమాదాల జరిగే వాగులు, వంకల వద్ద నిఘా వ్యవస్థను ముమ్మరం చేసేలా పోలీస్, జల వనరుల శాఖ, ఇతర శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. నదీ తీరాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదకర ప్రాంతాలు గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించాలి. పుష్కరాల నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు గోదావరి తీర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్‌లలో స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
గోదావరి, కాల్వల్లో ప్రమాదాలకు గురికాకుండా ఉండా లంటే పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లోతు తెలియని చోట్ల దిగరాదు. పైకి నీరు తక్కువగా కనిపించి నా లోపల తెలియని లోతు ఉండొచ్చు. ప్రవాహాన్ని అంచ నా వేయాలి. ఒంటరిగా గోదావరిలోకి వెళ్లకూడదు. ఎప్పుడూ తోడుగా ఎవరో ఒకరు ఉండాలి. ఈత రాని వారు నీటిలోకి దిగరాదు. మద్యం సేవించి నదిలోకి వెళ్లకండి. భద్రత కోసం లైఫ్ జాకెట్ ధరించండి. లోతైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పాటించండి. పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు. స్నానం చేసే సమయంలో అతి ఉత్సాహం వద్దు. ఎవరో మునిగిపోతుంటే నేరుగా లోపలికి దూకకండి. కర్ర, తాడు లేదా బట్ట ఇచ్చి బయటికి లాగడానికి ప్రయత్నం చేయండి.
– రాజారెడ్డి, కుక్కునూరు ఎస్సై
స్నానానికి దిగి బాలుడి గల్లంతు
పెంటపాడు : స్నానం చేసేందుకు కాలువలో దిగిన బాలుడు గల్లంతయ్యాడు. కాకర్లమూడికి చెందిన గోపా సునీల్(16) 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పరిమెళ్ళ చినకాపవరం కాలువ లాకుల వద్ద స్నానం చేసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. అతని కోసం గాలించినా ఫలితం కానరాలేదు. తండ్రి శ్రీను పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ స్వామి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.