అన్నీ కాల్వలోకే..
ABN , Publish Date - May 31 , 2026 | 12:34 AM
ప్రజలకు సాగు, తాగునీరు అందించే కాలువలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటు న్నాయి.
కాలుష్య కోరల్లో అత్తిలి పంట కాలువ
ప్రజలకు సాగు, తాగునీరు అందించే కాలువలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటు న్నాయి. ఒకప్పుడు కాలువల్లో నీటిని తాగు నీరుగా ఉపయోగించేవారు.నేడు స్నానాలు చేయ డానికి కూడా భయపడుతు న్నారు. ఇళ్లలోని మురుగునీటిని వ్యర్థాలు, చెత్తా చెదారం అంతా కాల్వల్లోకే వదిలేస్తున్నారు. సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే అత్తిలి కాలువ కలుషితమవుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు.
అత్తిలి, మే 30 (ఆంధ్రజ్యోతి) : అత్తిలి కాలువ ద్వారా మండలంలోని 18 గ్రామాలకు గోదావరి జలాలు తాగునీటితో పాటు సాగు నీటి అవసరాలను తీరుస్తుంది. అత్తిలి ప్రధాన కాలువ నుంచి రేలంగి, ఉరదాళ్ళపాలెం, తిరుపతిపురం, కెఎస్ గట్టు, పాలూరు, మంచిలి బ్రాంచి కెనాల్స్ ద్వారా ఆయా గ్రామాలకు తాగు, సాగు నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం అత్తిలి కాలువ మురుగు డ్రైయిన్‌ను తలపిస్తోంది. కాలువ ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వస్తున్న చెత్త, వ్యర్థాలు, జంతు కళేబరాలకు తోడు కాలువ వెంబడి ఉన్న పలు వర్తక సముదాయాల నుంచి వస్తున్న చెత్తను ప్రతి రోజు రాత్రి సమయాల్లో కాలువలో పడవేయడంతో పంట కాలువ డంపింగ్ యార్డుగా మారింది. అత్తిలి పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో మురుగునీరు డ్రెయిన్ అవుట్‌లెట్ ద్వారా కాలువలోకి కలుస్తోంది. కాలువ గట్టు వెంబడి ఉన్న నివాస గృహాలు వారు కూడా మురుగునీటి గొట్టాలను కాలువలోకి డైరెక్ట్‌గా కలిపేశారు. అత్తిలి ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ కాలువల ద్వారా పంచాయతీ చెరువు లకు తాగునీరు సరఫరా అవుతుంది. కలుషితమైన ఈ నీటిని అధిక శాతం మంది ప్రజలు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తుంటారు. ఆ నీటిని తాగే ధైర్యం లేక ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుక్కుంటున్నారు. అత్తిలి కాలువ శివారు ప్రాంతాలైన పాలూరు, కొమ్మర, ఈడూరు, మంచిలి, కంచుమర్రు, లక్ష్మీ నారాయణపురం, ఉనికిలి గ్రామాల పరిధిలో ప్రవహించే బ్రాంచ్ కాలు వలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. కొన్ని గ్రామాల్లో మురుగునీటి అవుట్‌లెట్‌ను పంచాయతీ వారే పంట కాలువలోకి ఏర్పాటు చేయడంపై ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలువను రక్షించండి..
కాలువ మరమ్మతుల నేపథ్యంలో ఇటీవల కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేయడంతో అత్తిలి ప్రధాన కాలువతో పాటు బ్రాంచ్ కాలువలు చెత్త, వ్యర్ధ పదార్ధాలతో దర్శనమిస్తూ, తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దోమలు విపరీతంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు అవస్ధలు పడుతున్నారు. కాలువ వెంబడి ఉన్న వర్తక దుకాణాల వారు చెత్తను కాలువలో పడ వేయడంతో పాటు, మురుగు నీటి గొట్టాలను కాలువలో పెట్టడంతో పంట కాలువ మురుగు డ్రెయిన్‌గా మారింది. ఇరిగేషన్, పంచా యతీ అధికారులు కాలువ వెంబడి ఉన్న మురుగు డ్రెయిన్ గొట్టాలను నిరోధించి, జల కాలుష్యం నుంచి అత్తిలి కాలువను కాపాడాలని కోరుతున్నారు.