చెత్తపై సీరియస్
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:02 AM
నరసాపురం పట్టణంలోని చెత్తపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఆభిప్రాయ సేకరణలో 65 శాతం మంది చెత్త సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నరసాపురంలో వీడని సమస్య
ఐవీఆర్‌ఎస్ సేకరణలో 65 మంది అసంతృప్తి
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులపై
మండిపడ్డ మునిసిపల్ జాయింట్ డైరెక్టర్
పట్టణ పరిధిలో 250 టన్నుల చెత్త
కంపోస్టు స్థలాలను పరిశీలించిన
కలెక్టర్ నాగరాణి
నరసాపురం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): నరసాపురం పట్టణంలోని చెత్తపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఆభిప్రాయ సేకరణలో 65 శాతం మంది చెత్త సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి చెత్త సేకరించడం లేదని, వీధుల్లో ఎక్కడబడితే అక్కడ పేరుకు పోయిందంటూ వెల్లడించారు. దీంతో అమరావతి నుంచి మునిసిపల్ పరిపాలనా విభాగం జాయింట్ డైరెక్టర్ రవీంద్రబాబు పురపాలక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎందుకు చెత్త సేకరించడం లేదని, వీధుల్లో పేరుకుపోతున్న చెత్తను ఎందుకు తొలగించడం లేదంటూ మండిపడ్డారు. దీనికి కమిషనర్ వెంకట్రామిరెడ్డి పట్టణంలో నెలకొన్న సమస్యను వివరించారు. గత ఏడాదిగా కంపోస్టుయార్డు లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందుల్ని వివరించారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, వీధిల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని జేడీ ఆదేశించారు. యుద్ధ ప్రాతిపాదికన సమస్య పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని కమిషనర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అదికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇతర పురపాలక సంఘాలు నో
వారం రోజుల క్రితం చెత్త సమస్య తీరిందని ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికే 15 రోజుల నుంచి చెత్త సేకరించకపోవడంతో ఏ వీధి చూసినా.. చెత్త కుప్పలే దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని కమిషనర్ వెంకట్రామిరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర పురపాలక సంఘాలకు నరసాపురం చెత్తను వేసుకోవాలని ఆదేశించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాలకు దాదాపు 40 లారీల చెత్తను పంపారు. ఇంకా పట్టణంలో 300 టన్నుల పైగా చెత్త ఉంది. ఇలా టన్నుల కొద్దీ చెత్తను తీసుకురావడంపై అక్కడ పురపాలక సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. భీమవరం, తాడేపల్లిగూడెంలో కంపోస్టుయార్డులు లేక పడుతున్న ఇబ్బందుల్ని చెప్పడంతో పాల కొల్లు, తణుకుకు పంపారు. చివరికి అక్కడా అభ్యంతరాలు రావడంతో మూడు రోజులుగా నిలిపివేశారు. దీంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయి. మూడురోజుల క్రితం సుమారు 250 టన్నుల చెత్త ఉంది. ఇదికాకుండా రోజుకు మునిసిపాల్టీలో 30 నుంచి 35 టన్నుల చెత్త వస్తుంది. ఇలా మూడు రోజులుగా అదనంగా మరో 100 టన్నుల చెత్త చేరింది.
100 టన్నుల చెత్త పాలకొల్లుకు..
స్థానిక అధికారులు సమస్యను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాలకొల్లు కమిషనర్‌తో మాట్లాడి కంపోస్టుయార్డులో చెత్త వేసుకోవాలని ఆదేశించారు. మంగళవారం సుమారు 100 టన్నుల చెత్తను పాలకొల్లుకు తరలించారు. అందులో వలంథర్‌రేవు సమీపంలో పేరుకుపోయిన చెత్తే ఎక్కువుగా ఉంది. రోజువారీ చెత్తను సేకరించకపోవడం వల్ల ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు రోడ్లపై పడేస్తున్నారు.
సమస్య తీవ్రంగా ఉంది..
త్వరలో పరిష్కరిస్తాం : కలెక్టర్
కలెక్టర్ నాగరాణి మంగళవారం నరసాపురంలో పర్యటించారు. వలంథర్‌రేవులో చెత్త కుప్పల్ని పరిశీలించారు. స్మృతివనం వద్ద పాత కంపోస్టుయార్డును పరిశీలించారు. గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసు ఉన్నందున ఇక్కడ తాత్కాలికంగా చెత్త వేసేందుకు ఆస్కారం లేదని ఆర్డీవో దాసిరాజు కలెక్టర్‌కు వివరించారు. అక్కడ నుంచి మండవారిగరువు వద్ద పురపాలక సంఘం కొనుగోలు చేసిన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్థులు కలెక్టర్ వద్దకు వచ్చి అక్కడ చెత్త వేయొద్దంటూ విన్న వించారు. ఆనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు. ‘‘పట్టణంలో చెత్త సమస్య సీరియస్‌గా ఉంది..దీన్ని రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తాం.. అప్పటి వరకు ఇళ్లల్లో రోజువారీ చెత్తను సేకరించి ఒక చోట డంప్ చేయాలి.. ఉన్నతాధికారులతో చర్చించి ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కారిస్తాం..’’ అన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సత్యనారాయణ, కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.