వార్డులు, డివిజన్ల పునర్విభజన!
ABN , Publish Date - May 17 , 2026 | 12:44 AM
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌లో డివి జన్లు, నూజివీడు, జంగారెడ్డిగూడెంల్లో వార్డుల పునర్విభజన పూర్తయింది.
ఏలూరు నగరపాలక సంస్థలో 62 డివిజన్లు.
నూజివీడులో 36, జంగారెడ్డిగూడెంలో 32 వార్డులకు పెంపు
వారం పాటు సూచనలు, అభ్యంతరాల స్వీకరణ .. జూన్‌లో తుది జాబితా
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌లో డివి జన్లు, నూజివీడు, జంగారెడ్డిగూడెంల్లో వార్డుల పునర్విభజన పూర్తయింది. గత నెలన్నర కాలం నుంచి చేస్తున్న సుదీర్ఘ కస రత్తులు శనివారం నాటికి టౌన్‌ప్లానింగ్ అధి కారులు పూర్తి చేశారు. ఏలూరులో 50 డివిజన్ల ను 62ను పెంచగా, జంగారెడ్డి గూడెంలో 29 నుంచి 32, నూజివీడులో 32 నుంచి 36 వార్డు లకు పెంచారు. ఈ మేరకు ప్రాథమిక ముసా యిదా జాబితాలను నేడు ప్రదర్శించనున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఆయా వార్డులు, డివిజన్లలో ఓటర్ల జాబితాల ఆధారం గా బౌండరీలు, సరిహద్దులు, మ్యాప్‌లను తయారు చేశారు. ముసాయిదా జాబితాలను ఆయా పురపాలక సంఘాల కార్యాలయాల వద్ద నేడు ప్రదర్శిస్తారు. ఇదే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా ముసాయిదా, ఓటర్ల జాబితా లను ఒక్కొక్క కాపీలను అందజేస్తారు. దీనిపై ఈనెల 18 నుంచి వారం పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచ నలు, సలహాలను తీసుకుని వాటిని పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శిస్తారు. ఈ తంతు పూర్తయ్యాక మున్సి పాల్టీలు అయితే కలెక్టర్ ద్వారా, కార్పొరేషన్లు అయితే నేరుగా పురపాలకశాఖ డైరెక్టర్‌కు తుది ప్రతులను పంపు తాయి. అనంతరం పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ మేరకు జిల్లాల వారీగా గెజిట్‌ల్లో వార్డుల, డివిజన్లు పునర్విభజన ఆమోదం తెలుపుతూ జీవోలను విడుదల చేయనున్నారు.
ముసాయిదా సిద్ధం..
జంగారెడ్డిగూడెం:జంగారెడ్డిగూడెం పురపాలక సం ఘం పరిధిలో జనాభా ప్రాతిపదికన వార్డుల పెంపునకు సంబంధించిన ముసాయిదా సిద్ధం చేసినట్టు మున్సిపల్ కమిషనర్ కెవి.రమణ శనివారం తెలిపారు.పట్టణంలో ఉన్న 29 వార్డులను 32 వార్డులుగా పునర్విభజిస్తున్నట్టు వివరించారు. పట్టణంలో 48,256 మంది ఓటర్లు ఉండగా ప్రతివార్డులో సరాసరి 1,508 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల 18 నుంచి 24 వరకు ప్రజలు,ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించను న్నట్లు ఆయన తెలిపారు. జూన్ 24నుంచి 26వ తేదీ మధ్యలో వార్డుల పునర్విభజన తుది ముసా యిదా గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయ నున్నట్లు తెలిపారు. కాగా పట్టణ భౌగోళిక సరిహద్దుల క్షేత్రస్ధాయి పరిశీలన కష్టతరమైన పని కావడంతో గతనెల 26 నుంచి ఈనెల 2వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యం తరాలు స్వీకరించాల్సి ఉంది. ప్రభుత్వం గడువు పొడిగించ డంతో ఈనెల 18 నుంచి 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
డీలిమిటేషన్‌పై సూచనలు ఇవ్వండి..
ఏలూరు టూటౌన్ : ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లను 62 డివిజన్లుగా పునర్విభజిస్తు న్నామని, దీనిపై ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలని నగర పాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ శనివారం తెలిపారు. డీలిమిటేషన్‌లో భాగంగా ప్రాథమిక ముసా యిదా ప్రతిపాదనలు వివిధ ప్రదేశాల్లో ప్రదర్శిస్తున్నామ న్నారు. 17న ప్రాథమిక ముసాయిదా ప్రతిపాదనలు కలెక్టర్ కార్యాలయం, నగర పాలక సంస్థ కార్యాలయం, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయం, కోటదిబ్బలోని మండల తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్, జిల్లా కోర్టు, ఈడా కార్యాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. నగర ప్రజలు ప్రాథమిక ముసాయిదా ప్రతిపాదనలపై తగు సూచనలు, సలహాలు ఏడు రోజుల్లోగా తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 18 నుంచి 24వ తేదీలోపు నగర పాలక సంస్థ కార్యాలయానికి సూచనలు, సలహాలు తెలపాలని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు.