Share News

వార్‌ టెన్షన్‌

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:59 AM

గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ చేపట్టిన మిస్సైల్‌ దాడులతో అక్కడ ఉపాధి, ఉద్యోగాలు కోసం వెళ్లిన వివిధ ప్రాంతాల తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.

వార్‌ టెన్షన్‌

ఉపాధికోసం వెళ్లినవారిలో భయం..భయం..

ఇక్కడ కుటుంబ సభ్యుల్లో ఆందోళన

ఎప్పటికప్పుడు టీవీలు, ఫోన్లలో సమాచారం

తెలుసుకుంటున్న కుటుంబీకులు

గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ చేపట్టిన మిస్సైల్‌ దాడులతో అక్కడ ఉపాధి, ఉద్యోగాలు కోసం వెళ్లిన వివిధ ప్రాంతాల తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. దుబాయ్‌, కతార్‌, అబుదాబీ, సౌదీ తదితర దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ మిసైల్‌ దాడులతో ఆయా దేశాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. ఇప్పటికే గల్ఫ్‌ దేశాలు ప్రజల్ని బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశాయి. ఏ..క్షణం ఏం జరుగుంతుందో అనే భయం నెలకొంది. ఈ సమాచారాన్ని ఎప్పటి కప్పుడు ప్రసార మాధ్యమాల్లో వింటున్న స్థానికుల్లో అందోళన నెలకొంది.

నరసాపురం/ తణుకు రూరల్‌, మార్చి 1 (ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువత ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ముఖ్యంగా దుబాయ్‌, కువైట్‌, మస్కట్‌, సౌదీ అరేబియా బహ్రెయిన్‌, ఇరాక్‌ వంటి దేశాలల్లో పనిచేస్తున్నారు. సుమారు 20 వేల నుంచి 25 వేల మంది వరకూ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. వీరిలో యువకులు కూడా ఉన్నారు. అత్యధికంగా నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఇటీవల క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలకు వచ్చి తిరిగి వెళ్లిన వారి సంఖ్య కూడా ఎక్కువే. హఠాత్తుగా యుద్ధం రావడంతో వీరి బంఽధువులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు.గల్ఫ్‌లో వున్న తమ వారితో తరచూ ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి అయినవారికి ఫోన్‌లు చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటు న్నారు వీలు ఉంటే స్వదేశానికి వచ్చేయాలని సూచిస్తు యుద్ధాన్ని చూసి భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మిసైల్‌ శబ్ధాలతో వణికి పోతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు.

ఇళ్లలోనే ఉంటున్నాం : రామకృష్ణ, కతార్‌

నరసాపురం నుంచి ఉపాధి కోసం కతార్‌ వెళ్లాను. అమెరికా స్థావరాలపై క్షిపణుల దాడి జరుగుతుండటంతో రేయింబవళ్లు బాంబుల శబ్ధంతో బిక్కుబిక్కు మంటూ ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం ముందస్తుగా ప్రజల్ని అప్రమత్తం చేసింది. అందరికి సెలవులు ప్రకటించింది.ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. దీంతో ఎవరూ బయటకు రావడం లేదు. సరుకులన్నీ తెచ్చుకుని రూమ్‌లోనే ఉంటున్నాం.

రాత్రి,పగలూ బాంబుల హోరు : జ్యోతి, సౌదీ

ఉద్యోగం నిమిత్తం మూడేళ్ల క్రితం నరసాపురం నుంచి సౌదీ వెళ్లా. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. రెండు రోజుల నుంచి ఏం జరుగుతుందోనని భయం భయంగా ఉంది. స్వదేశానికి వద్దామన్నా ఎయిర్‌ పోర్టులన్నీ మూసివేశారు.గతంలో ఎప్పుడూ గల్ఫ్‌లో ఇలాంటి పరిస్థితి చూడ లేదు. రాత్రి, పగలు బాంబుల హోరు. ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. భారత ప్రభుత్వం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ పంపితే చాలామంది స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు

తాగునీటికి ఇబ్బంది : కడజారి మంగ, కువైట్‌

తణుకు నుంచి ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాను. హవాలీ నగరంలో బాంబుల మోతతో చాలా భయపడ్డాం. బాంబు దాడులు జరుగుతాయనే హెచ్చరికలతో సైరన్‌లు మోగాయి. దీంతో ప్రయాణాలు నిలిచి పోయాయి. శనివారం రాత్రి మంచినీరు కోసం చాలా ఇబ్బంది పడ్డాం. నిత్యా వసరాలు ముందుగానే స్టాకు పెట్టుకున్నాం.. మంచినీటిని కొనుగోలు చేయ లేదు. ఇక్కడ విమానాశ్రయం మూసి వేసినట్లు తెలిసింది.

ఆదివారం ప్రార్థనలను

నిలిపివేశారు : బైపా శ్రీకాంత్‌, దుబాయ్‌

ఉగ్యోగం కోసం తణుకు నుంచి దుబాయ్‌ వెళ్లాను. కరోమే నగరం బాంబుల మోతతో దద్దరిల్లి పోయింది. ఇవన్నీ ప్రధాన నగరానికి బయటే జరగడంతో ఇబ్బంది లేదు. ఆదివారం కూడా దాడులు జరుగుతాయని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆదివారం చర్చిల్లో ప్రార్థనల ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మదుపుదారుల్లో భయాలు

నరసాపురం, మార్చి 1 (ఆంద్రజ్యోతి): స్టాక్‌ మార్కెట్‌ మదుపుదారుల్లో యుద్ధ భయాలు నెలకొన్నాయి. సోమవారం మార్కెట్‌పై ఏం ప్రభావం చూపుతుందోనన్న భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి. సుంకాలు, యుద్ధ భయాలతో గతేడాది నుంచి సూచీలు రెడ్‌లోనే ముగుస్తున్నాయి. దీంతో జిల్లా ఇన్వెస్టర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో నష్టాల నుంచి బయటపడతామన్న ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ యుద్ధం రావడంతో మార్కెట్‌పై ఏం ప్రభావం చూపుతుందోనని కలవరపడుతున్నారు. దీంతో సోమవారం మార్కెట్‌ కీలకంగా మారింది. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే ఆ ప్రభావం మార్కెట్‌పై పడుతుందని ఇప్పటికే ఆర్థికనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులను ఉంచాలా ? లేక అయినకాడికి అమ్ముకోవాలా అనే మీమాంసలో పడ్డారు.

మళ్లీ వెండి, పసిడి ధరల పరుగు

పసిడి, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ యుద్ధంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు బులి యన్‌ మార్కెట్‌లో షికారు చేస్తున్నాయి. ఇదే జరిగితే మళ్లీ బంగారం ధర పరుగులు తీసే అవకాశం ఉంది. వెండి కూడా అదే రూట్‌లో వెళ్లే ఛాన్స్‌ ఉందని బులియన్‌ వర్తకులు చెబుతున్నారు. దీంతో సోమవారం మార్కెట్‌ కీలకంగా మారింది. యుద్ధంతో చమురు దిగుమతులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయన్న భయం వాహనదారుల్లో నెలకొంది.

Updated Date - Mar 02 , 2026 | 12:59 AM